రద్దు దుర్మార్గమైన చర్య
ఉపాధి హామీని కూలీలకు దూరం చేయడమే..
కేంద్రం బిల్లును వెనక్కు తీసుకోవాలి
మోడీ ప్రభుత్వానికి కూలీల హెచ్చరిక
పది రోజులపాటు ఆందోళనలకు వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు
నవతెలంగాణ-విలేకరులు
మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను రద్దు చేసి మోడీ ప్రభుత్యం 2025 పేరుతో 197 బిల్లును తేవడంతో ఉపాధి హామీ చట్టం కాస్త పథకంగా మారే ప్రమాదం ఉందని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూలీలను పనికి దూరం చేయడం కోసమే పథకంగా రూపొందిస్తున్నారని చెబుతున్నారు. చట్టాన్ని రద్దు చేసి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడంపై కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఉపాధి హామీ పనులకు అరకొర నిధులు కేటాయిస్తూ నీరుగారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాలలో వలసలను నివారించేందుకు 2005లో ఏర్పడిన చట్టం.. బడుగు బలహీన వర్గాలకు భూమిలేని కూలీలకు వరంగా ఉన్న చట్టాన్ని రద్దు చేయడం కూలీలను పని దూరం చేయడమేనని ఆవేదన వ్యక్తం అవుతుంది.
ఈ బిల్లు చట్టమైతే ఉన్న ఉపాధిని లేకుండా చేస్తున్నదని, పనిదినాలు 125 రోజులకు పెంచుతున్నట్టు చెప్పి 60 రోజులు పని నిషేధం విధించారని.. తద్వారా ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కేంద్రం 90శాతం నిధులు రాష్ట్రం వాటా 10 శాతం ఉంది. ఈ పథకం ద్వారా రాష్ట్రాలు 40 శాతం కేంద్రం 60 శాతం చెల్లించే విధంగా రూపొందించడం దారుణం అని, రాష్ట్రాలకు నిధులు లేక ఈ పథకం నిర్వీర్యం అయిపోతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంట్రాక్టర్లకు ఉపాధి హామీగా మార్చే కుట్ర జరుగుతుందని ఆందోళన వ్యక్తం అవుతుంది. 197 బిల్లు రద్దు చేసే వరకు ఈనెల 18 నుంచి 28 వరకు పోరాటాలు సాగిస్తామని కేంద్రాన్ని వ్యవసాయ కార్మిక సంఘం హెచ్చరించింది. బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరింది.
యంత్రాలకు అనుమతివ్వడం దుర్మార్గం
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామి పథకంలో కూలీలకు బదులుగా మిషన్లకు అనుమతి ఇవ్వడాన్ని వ్యకాస సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నర్సింలు, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మల్లేశం, ఉపాధి కూలీలు ఎం.సుజాత, జి.మమతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామిలో యంత్రాలు తీసుకురావడం అంటే పేదలకు పనిలేకుండా చేయడమేనన్నారు.
ఉపాధి హామీ చట్టం ద్వారా ఊర్లోనే పనిచేసుకుంటున్నాం గంట విజయ- సర్వారం, తిప్పర్తి మండలం
ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామంలోనే పని చసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. కొత్తగా తెచ్చే పథకం ద్వారా గ్రామంలో పని దొరక్క పట్నానికి వలస వెళ్లాల్సి వస్తుందేమో. కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని రద్దు చేయాలి. యథావిధిగా ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలి.
యంత్రాలతో పనిచేయిస్తే మేము కూలికి దూరమవుతాం చెరుకుపల్లి రాజు- ఇండ్లూరు- తిప్పర్తి మండలం- నల్లగొండ జిల్లా
ఉపాధి హామీ చట్టంలో ఇప్పటివరకు యంత్రాలతో పనిచేసే అవకాశం లేకపోవడంతో గ్రామంలోనే పనులు చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం నూతనంగా చట్టం పేరు మార్చి యంత్రాలతో పని చేయిస్తే మేము ఉపాధి హామీ కూలికి దూరం కావాల్సి వస్తుంది. గ్రామం వదిలి పట్టణంలో పని కోసం వలస వెళ్లాల్సి వస్తుంది.
పేరు మార్చకూడదు
మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం పేరు మార్చొద్దు. కూలీలకు సౌకర్యాలు కల్పించి వేతనం పెంచాలి. పేరు మార్చడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. ఎలాంటి మార్పులూ చేయకుండా యథావిదిగా ఉపాధి కల్పించాలి. -ఎద్దు కోమలత ఉపాధి హామీకూలి, వర్ధన్నపేట
పని దినాలు తగ్గించే కుట్ర
మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం పేరు మార్చడమే కాకుండా పని దినాలను తగ్గించే కుట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక జాబ్ కార్డులను తొలగించే ప్రయత్నం చేసింది. కార్మికులు పనిచేసే పరిసరాలలో డ్రోన్ల వినియోగం, ఐరిష్ కెమెరాలు ఉపయోగం తదితర అంశాలతో గ్రామీణ ప్రభుత్వం ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కొట్రలను ప్రజలు తిప్పికొట్టనున్నారు. -సాదమ్ రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, జనగామ
నిరుద్యోగులకు ‘ఉపాధి’
ఉపాధి హామీ చట్టం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించినట్టు అయింది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం దుర్మర్గమైన చర్యగా బావిస్తున్నాం. గ్రామాల్లో నిరుపేదలకు ఉపాధి హామీ భరోసా కల్పిస్తుంది. చట్టాన్ని రద్దు చేయొద్దు. -బొడ్డు వంశీ, అండవిశ్రీరాంపూర్, ముత్తారం మండలం, పెద్దపల్లి జిల్లా
ఉపాధి హామీ చట్టంగానే కొనసాగించాలి
నేను ఏడాది సుమారు 90 రోజులపాటు ఉపాధి పనికి పోతాను. ఎండాకాలంలో ఈ పని చేసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చే యోచనలో ఉంది. దీంతో ఉపాధి పనికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. చట్టంగానే కొనసాగించి 125 రోజుల పనిని కొనసాగించాలి. -పోకల సత్తమ్మ, వెలిచాల, రామడుగు మండలం- కరీంనగర్



