Friday, November 14, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలువిద్యుత్‌ బస్సుల విధానంలో మార్పు తేవాలి

విద్యుత్‌ బస్సుల విధానంలో మార్పు తేవాలి

- Advertisement -

ఆ బస్సుల నిర్వహణను ఆర్టీసీకే ఇవ్వాలి
ఈ విషయంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి : సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ లేఖ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యుత్‌ బస్సుల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీలకే నిధులివ్వాలి. విద్యుత్‌ బస్సుల కొనుగోలు, మెయింటనెన్స్‌, నిర్వహణను ఆర్టీసీకే అప్పగించాలి. ప్రజా రవాణా సంస్థలను సామాజిక బాధ్యతగా చూడాలి. ఖర్చుకు-ఆదాయానికి మధ్య వస్తున్న వ్యత్యాసాన్ని ప్రభుత్వాలే భరించాలి. ఆర్టీసీకి విద్యుత్‌ బస్సులను అప్పగించే విషయంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర సర్కారు ఒత్తిడి తేవాలి’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ కోరారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ‘ప్రత్యామ్నాయ ఇంధనం, కాలుష్య నియంత్రణ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రమాదకరమైన విద్యుత్‌ బస్సుల విధానాన్ని తీసుకొస్తున్నది.

బస్సుల నిర్వహణ మొత్తం ప్రయివేట్‌, కార్పోరేట్‌లకు కట్టబెట్టి, ఆయా కంపెనీలకే కేంద్ర ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు సబ్సిడీగా ఇస్తున్నది. అత్యంత విలువైన ఆర్టీసీ భూములు కూడా ప్రయివేట్‌ విద్యుత్‌ బస్సుల సంస్థలకు కట్టబెడుతున్నారు. కానీ, విద్యుత్‌ బస్సులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన బాధ్యత మాత్రం ఆర్టీసీలకు కేటాయిస్తున్నది. అలాగే టెండర్లను కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఈఎస్‌ఎల్‌ ఫైనల్‌ చేసి ఆర్టీసీపై భారం మోపుతున్నది. తక్షణమే ఈ విధానంలో మార్పులు చేసేలా కేంద్రంపై రాష్ట్ర సర్కారు ఒత్తిడి తేవాలి’ అని వెస్లీ డిమాండ్‌ చేశారు. ‘ప్రయివేటు విద్యుత్‌ బస్సుల డ్రైవర్లు, మెయింటనెన్స్‌ తదితరాలన్నీ ప్రయివేట్‌ కంపెనీలదే బాధ్యత. ఇది రెండు రకాలుగా నష్టం. ఆర్టీసీలో ఉన్నట్లు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు అమలు కావు. ఆయా కంపెనీలు తక్కువ వేతనంతో సిబ్బందిని నియమించుకోవడం వల్ల బలహీన, వెనుకబడిన తరగతుల నిరుద్యోగులకు తీవ్రనష్టం జరుగుతుంది.

ఇప్పటికే పని చేస్తున్న డ్రైవర్‌, కండక్టర్‌, మెకానిక్‌లతో పాటు, మిగతావారు అదనపు సిబ్బందిగా మిగలడంతో వారి ఉద్యోగ భద్రతకే ప్రమాదం వాటిల్లుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ‘మన రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్‌ బస్సుల పథకాలను సమర్ధిస్తూ రాష్ట్రంలో వెంటనే 2800 ఆర్టీసీ బస్సులను, 2030 నాటికి మొత్తం 9800 ఆర్టీసీ బస్సులను విద్యుత్‌ బస్సులుగా మారుస్తామని విధాన ప్రకటన చేసింది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ ప్రజల అవసరాల మేరకు బస్సులు సమకుర్చుకొనే అవకాశం వుండదు. బస్సుల నిర్వహణ ఖర్చు, ఆదాయానికి మధ్య వ్యత్యాసం పెరిగి ఆర్టీసీకి పెనుభారంగా మారుతుంది’ అని జాన్‌వెస్లీ హెచ్చరించారు. విద్యుత్‌ బస్సుల మౌలిక అవసరాల కల్పన బారాన్ని ప్రయాణీకులపై వేయడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలో ఇప్పటికే విద్యుత్‌ బస్సుల్లో రూ.10, రూ.20 అదనంగా చార్జి వసూలు చేస్తున్నారని విమర్శించారు. అన్ని రకాల బస్సుల్లోనూ చార్జీలు పెంచిన విషయాన్ని ప్రస్తావించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -