Thursday, December 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరైతాంగ శ్రేయస్సు కోరేలా విత్తనచట్టముండాలి

రైతాంగ శ్రేయస్సు కోరేలా విత్తనచట్టముండాలి

- Advertisement -

– బయోసేప్టీ, వారసత్వ విత్తనాలకు డిజిటల్‌ సీక్వెన్స్‌ చేర్చాలి
– పంటనష్టపరిహారం విషయంలో స్పష్టతివ్వాలి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– ముసాయిదావిత్తన చట్టం-2025పై సవరణల నివేదికను సిద్ధం చేసిన ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రైతాంగ శ్రేయస్సు కోరేలా విత్తనచట్టముండాలనీ, అందుకోసం పలు సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా చేర్చాల్సిన, మార్చాల్సిన అంశాలపై రాష్ట్ర సర్కారు తుది నివేదికను రాష్ట్ర సర్కారు సిద్ధం చేసింది. దానికి సబంధించి వ్యవసాయ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముసాయిదాలో బయోసేప్టీ వారసత్వ విత్తనాలకు డిజిటల్‌ సీక్వెన్స్‌ ఇన్ఫర్మేషన్‌ చేర్చాలని కేంద్రానికి సూచించారు. తెలంగాణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు విత్తనోత్పత్తి కీలమనీ, సాంప్రదాయ, స్వదేశీ రకాలు సహా అధిక-నాణ్యత గల విత్తనాల సాగు, సంరక్షణలో వేలాది మంది రైతులు భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు. అధికారిక గుర్తింపు లేకపోవడం, లోపభూయిష్ట ఒప్పంద నిబంధనలు, సరైన పరిహారం అందకపోవడం వంటి సవాళ్లను విత్తన రైతులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయలు పండించే రైతులు నకిలీ, నాసిరకం, అనుమతి లేని,అధిక ధర కలిగిన విత్తనాల వ్యాప్తి కారణంగా నష్టాలను చవిచూశారని ఉదహరించారు. వారి రక్షణ కోసం పలు అంశాలను చేర్చాలని కోరారు. సెక్షన్‌13లో రాష్ట్ర విత్తన కమిటీకి, రాష్ట్రానికి ప్రత్యేక రకాలను నమోదు చేయడానికి అధికారమివ్వాలని కోరారు. విత్తన ఉత్పత్తి సంస్థల నిర్వాహకులకు, డీలర్లు, పంపీణీదారులకు విద్యార్హతలు ఉండేలా చూడాలని సూచించారు. విత్తన కంపెనీల స్వీయ ధ్రువీకరణకు అనుమతించకూడదనీ, గుర్తింపు పొందిన ధ్రువీకరణ సంస్థల నుంచి ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు విత్తన ధరలను నియంత్రించే అధికారం కల్పించాలనీ, రాష్ట్ర విత్తన కమిటీ విత్తన ధరలను సమీక్షించి, హేతుబద్ధమైన ధరల పరిమితిని సిఫార్సు చేయడానికి అనుమతించాలని డిమాండ్‌ చేశారు. దిగుమతి చేసుకున్న విత్తనాలు స్థానిక వాతావరణ పరిస్థితులకు తట్టుకోవడం కష్టమనీ, కనీసం రెండేండ్లు ఐసీఏఆర్‌/ఎస్‌ఏయూ కేంద్రాల్లో పరీక్షలను తప్పనిసరి చేయాలని సూచించారు. విత్తన ఉత్పత్తి సంస్థలు రైతులను మోసం చేసినట్టు తేలితే జరిమానా, శిక్షలతో పాటు ఆ కంపెనీ ఉత్పత్తిని, అమ్మకాలను ఐదేండ్ల పాటు నిషేధించాలని డిమాండ్‌ చేశారు.
నకిలీ, నాణ్యత లేని విత్తనాల వల్ల నష్టపోయే రైతులకు చట్టబద్ధమైన, కాలపరిమితితో కూడిన పరిహార విధానాన్ని ఏర్పాటు చేయడానికి బిల్లులో ఒక ప్రత్యేక విభాగాన్ని ప్రవేశపెట్టి, సాధారణ పరిస్థితుల్లో రైతు పొందగలిగే అత్యధిక దిగుబడి ఆధారంగా పరిహారం లెక్కించాలని డిమాండ్‌ చేశారు. రైతు ఫిర్యాదు చేసిన 60 రోజుల్లోపు క్లెయిమ్‌లను ప్రాసెస్‌ చేసి పరిష్కరించాలని కోరారు. విత్తనోత్పత్తి చేసే రైతులను రక్షించడానికి ముసాయిదా విత్తన బిల్లులో ఒక ప్రత్యేక విభాగాన్ని చేర్చాలని డిమాండ్‌ చేశారు. విత్తన కంపెనీలకు లైసెన్స్‌లు జారీ చేయడానికి ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌, వ్యవసాయశాఖ డైరెక్టర్‌ గోపి, ఇతర వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -