సర్పంచ్, ఏపిఎం సిసిల నిర్బంధం
నవతెలంగాణ – కట్టంగూర్
మండలంలోని చెరువు అనరం గ్రామంలోని సంఘ బంధంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సంఘ బంధం సభ్యులు మండల ఏపిఎం రాములు సర్పంచ్ చిలుముల సైదులు వెలుగు సిసి ప్రసాద్ లను సోమవారం సాయంత్రం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. ఈ సందర్భంగా సంఘబంధం 2 అధ్యక్షురాలు గద్దపాటి రేణుక మాట్లాడుతూ తాను అధ్యక్షురాలు అయి ఏడాది గడుస్తున్న తమ సంఘం విబికే చేగోని నాగమణి సంఘం యొక్క లెక్కలు చూపించకుండా దాటవేస్తుందని ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణలో, సంఘం యొక్క డిపాజిట్లలో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు ఇదే విషయంపై కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన పై అధికారులు మొక్కుబడిగా వచ్చి విచారణ చేస్తున్నామని చెప్పి వాయిదాలు వేస్తున్నారన్నారు.
గతంలో మూడు వాయిదాలు వేశారని రికార్డులు తేకపోవడంతో ఈరోజు వాయిదా వేసినట్లు ఆమె తెలిపారు. అధికారులు ఉదయం విచారణకు వస్తామని చెప్పి సాయంత్రం వరకు రాకపోవడంతో ఆగ్రహించిన మహిళలు విచారణకు వచ్చిన ఏపిఎం, సీసీల తో పాటు సర్పంచును గ్రామపంచాయతీలో మూడు గంటల పాటు నిర్బంధించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మహిళా సంఘాల సభ్యులకు సర్దిచెప్పి వారిని విడిపించారు. వారం రోజుల్లో విచారణ చేసి నివేదిక పై అధికారులకు ఇస్తామని హామీ ఇచ్చారు.



