నవతెలంగాణ- వనపర్తి
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సన్న, దొడ్డు రకం వరి ధాన్యాన్ని గుర్తించడంలో తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఆత్మకూరు మండల పరిధిలోని జూరాల రైతు వేదికలో వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు మండల స్థాయిలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి హాజరై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ 2025-26 సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఎఫ్ ఏ క్యూ ప్రమాణాల ప్రకారం ఉన్న ధాన్యాన్ని గుర్తించేలా కొనుగోలు కేంద్రం ఇంచార్జిలు అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సన్న, దొడ్డు రకం వరి ధాన్యాన్ని గుర్తించడంలో తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు.
ప్రతి పీపీసీ లో నిర్దేశించిన రిజిస్టర్లు నిర్వహించాల న్నారు. రైతులు పీపీసీ కి ధాన్యం ఎప్పుడు తెచ్చారు, ధాన్యం తేమ ఎప్పుడు ఎంత ఉంది అనేది రిజిస్టర్లలో రాసుకోవాలన్నారు. వర్షాలు వస్తే ఇబ్బందులు లేకుండా టార్పాలిన్ లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ట్రైనింగ్ తీసుకున్న ఇంచార్జి లు, ఆపరేటర్ లు మాత్రమే సెంటర్ లలో కనిపించాలని, వేరే వ్యక్తులు ఉండడానికి వీళ్లేదని ఆదేశించారు. హార్వెస్టర్లతో మాట్లాడి పంటలో గింజ పక్వానికి వచ్చినపుడే కోతలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఓపెన్ జిమ్ అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు చేయాలి
ఆత్మకూరు మండల కేంద్రంలోని పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో ఉన్న పార్కులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. పార్కులో ఓపెన్ జిమ్ కు కావలసిన వస్తు సామాగ్రిని ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ కలెక్టర్కు తెలియజేశారు. త్వరలోనే ప్రారంభించి, ప్రజల వినియోగానికి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయధికారి ఆంజనేయులు గౌడ్, సివిల్ సప్లై అధికారి, కాశీ విశ్వనాధ్, డీసీ ఓ రాణి, తహసీల్దార్ చాంద్ పాషా, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



