Monday, April 6, 2026
E-PAPER
Homeజాతీయం'స్థానిక భాగస్వామ్యంతో పరిమిత బాహ్య పెట్టుబడులు' ఉండాలి

‘స్థానిక భాగస్వామ్యంతో పరిమిత బాహ్య పెట్టుబడులు’ ఉండాలి

- Advertisement -

లడఖ్‌ పర్యాటకరంగ భాగస్వాములకు ఎల్టీటీఈ పిలుపు
సోనమ్‌ వాంగ్‌చుక్‌కు కార్గిల్‌ ఘనస్వాగతం

కార్గిల్‌ : లడఖ్‌ పర్యాటక రంగ భాగస్వాములు ఆదివారం ఒక సంయుక్త తీర్మానాన్ని ఆమోదించారు. ఈ రంగంలో ”స్థానిక భాగస్వామ్యంతో పరిమిత బాహ్య పెట్టుబడులు” ఉండాలని ఆ తీర్మానం నొక్కి చెప్పింది. ”బాహ్య పెట్టుబడుల ప్రభావానికి సంబంధించి ప్రత్యక్ష, పరోక్ష, ప్రకటించిన లేదా ఇతర ఏవైనా ఆందోళనలు ఉంటే, వాటిని చట్టబద్ధమైన మార్గాలు, సంప్రదింపులు, స్థానిక సమాజాలు, వాణిజ్య సంస్థలు, సంఘాల సమన్వయ ప్రాతినిధ్యం ద్వారా పరిష్కరించాలి,” అని లేహ్‌కు చెందిన 14 సంస్థల సమాహారమైన లడఖ్‌ టూరిస్ట్‌ ట్రేడ్‌ అలయన్స్‌ (ఎల్‌టీటీఏ) ఆమోదించిన తీర్మానంలో పేర్కొంది. ఇదిలా ఉండగా, జోధ్‌పూర్‌ జైలులో దాదాపు ఆరు నెలల నిర్బంధం తర్వాత విడుదలైన వాతావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌కు.. ఆయన పర్యటన సందర్భంగా లడఖ్‌లోని కార్గిల్‌ జిల్లాలో ఘన స్వాగతం లభించింది.

దశాబ్దాలుగా పర్యావరణ సవాళ్లు, రవాణా పరిమితులు ఉన్నప్పటికీ, స్థానిక జనాభా.. హోటళ్లు, అతిథి గృహాలు, రవాణా సేవలు, సాహస పర్యాటకం, అనుబంధ రంగాలతో కూడిన ఒక పటిష్టమైన అభివృద్ధి చెందుతున్న పర్యాటక పర్యావరణ వ్యవస్థను నిర్మించిందని ఎల్టీటీఏ తెలిపింది. అయితే, ఇటీవలి సంవత్సరాల్లో లడఖ్‌లోని పర్యాటక రంగంలోకి ప్రవేశించి, ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న బడా వ్యాపార సంస్థలు, స్వార్థ ప్రయోజనాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది అని ఎల్టీటీఏ పేర్కొంది. ఇలాంటి పరిణామాలు సున్నితమైన పర్యావరణానికే కాకుండా, స్థానిక జనాభాకు అందుబాటులో ఉన్న పరిమిత ఆర్థిక అవకాశాలకు కూడా తీవ్రమైన ముప్పు అని అభివర్ణించింది.నియంత్రణ లేని బాహ్య పెట్టుబడులు స్థానిక భాగస్వాములను స్థానభ్రంశం చేసి, సాంప్రదాయ జీవనోపాధులను క్షీణింపజేయటమే కాదు, ఈ ప్రాంత సామాజిక-ఆర్థిక సమతుల్యతను అస్థిరపరిచే ప్రమాదం ఉందని తెలిపింది.

సంయుక్త తీర్మానంలో లడఖ్‌ను ఒక ప్రత్యేకమైన, సున్నితమైన పర్యాటక గమ్యస్థానంగా పరిరక్షించాల్సిన అవసరాన్ని ఎల్టీటీఏ నొక్కి చెప్పింది. విధానపరమైన ప్రచారం, సమాజ నేతృత్వంలోని కార్యక్రమాలు, బాధ్యతాయుతమైన పర్యాటక పద్ధతుల ద్వారా స్థానిక ప్రజల జీవనోపాధులు, వ్యవస్థాపక అవకాశాలు, ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించటంతో పాటు వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆ తీర్మానం పేర్కొంది.కేంద్రానికి, లడఖ్‌ ప్రతినిధులకు మధ్య ”నిర్మాణాత్మక, అర్థవంతమైన చర్చ” జరుగుతుందని ఆశిస్తున్నామని, చర్చలే ఏకైక ఆచరణీయ మార్గమని వాంగ్‌చుక్‌ నొక్కి చెప్పారు. మధ్యేమార్గ పరిష్కారం కోసం కేంద్రంతో విశాల దృక్పథంతో సంభాషణ జరగాల్సిన అవసరం ఉంది అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -