రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఈ ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు,పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ,ఇతర ఉన్నతాధికారులతో హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాలు, సంబంధిత శాఖల అధికారులతో ధాన్యం సేకరణ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వీడియో కాన్ఫెరెన్స్అనంతరం ఆదనపు కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకుగాను 375 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని కేంద్రాలకు అవసరమైన సామాగ్రిని పంపించామని, ఇంకా మరో 25 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకునెందుకు అవకాశం ఉందని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు పంపించే విషయంలో లారీల సమస్య తలెత్తకుండా చూడాలని, మిల్లుల వద్ద అన్లోడింగ్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని, ఆయా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన గన్ని బ్యాగులు, టార్పాలిన్లు ,అలాగే తేమ కొలిచే యంత్రాలు, తూకం వేసే యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు.
రైతులు నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా చూడాలని , నాణ్యత ప్రమాణాలు ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. మండల స్థాయిలో ఐకెపి కేంద్రాలకు సంబంధించి ఏపీవోలు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. హార్వెస్టర్ల వివరాలను సైతం సేకరించాల్సిందిగా ఆయన ట్రాన్స్పోర్ట్ ,పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు పంపించేందుకుగాను ముందుగా 40 లారీలు ఏర్పాటు చేయాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ను ఆదేశించారు.
అంతక ముందు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం ఆల్ టైం రికార్డ్ సాధించిందని, ఈ వానాకాలం 148.3 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రానుందని తెలిపారు.ఈ ఖరీఫ్ లో పెద్ద ఎత్తున ధాన్యం వస్తున్నందున జిల్లా అధికార యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని, అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని, ప్రత్యేకించి ధాన్యం రవాణాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఎక్కడ రవాణా సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు.
రైతులు నాణ్యతా ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చే విధంగా అవగాహన కల్పించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యం అమ్మేందుకు నిరీక్షించే పరిస్థితి తీసుకురావద్దని అన్నారు.కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాలని, ఈ విషయంలో మిల్లర్లతో సమన్వయం చేసుకోవాలని, రైతులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. గత యసంగిలో అధికారులు, మిల్లర్లు , ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల సమన్వయంతో సత్ఫలితాలను సాధించడం జరిగిందని ఆయన తెలిపారు .
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలు ధాన్యం సేకరణను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా 2025- 26 ఖరీఫ్ ధాన్యం సేకరణను పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యంతో పాటు, పత్తి, మొక్కజొన్న, సోయా పంటల సేకరణ పై కూడా దృష్టి సారించాలని అన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు అదనపు ఎస్పీ రమేష్, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశం, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ ,వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ ,జిల్లా సహకార అధికారి పత్యానాయక్, మార్కెటింగ్ శాఖ ఏడి ఛాయాదేవి, తదితరులు హాజరయ్యారు .