మూడు రీజియన్లుగా రాష్ట్రాభివృద్ధి
కొత్త రంగాల్లో, కొంగొత్త మార్గాల అన్వేషణ
చైనా, జపాన్‌ల స్థాయే లక్ష్యం
మన యువత ప్రపంచంతోనే పోటీపడాలి
అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ : సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ మేరకు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. అది వాస్తవిక దృక్పథాన్ని ప్రతిబింబించేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించాలని కోరారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్), పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ (ప్యూర్), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్)గా వాటిని విభజించాలని దిశా నిర్దేశం చేశారు. వీటితోపాటు రాష్ట్రాభివృద్ధిని ప్రతిబింబించేలా ‘తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్’ను రూపొందించాలని ఆదేశించారు. 2034 నాటికి ఒక ట్రిలియన్, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను పాలసీ డాక్యుమెంట్‌లో పొందుపరచాలని కోరారు.
‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ పై గురువారం హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, అజహరుద్దీన్, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్-2047కు ప్రభుత్వం సిద్ధమవుతోందని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. అందరికీ సమాన అవకాశాలు, సమీకృత అభివృద్ధే లక్ష్యంగా రానున్న 22 ఏంఢ్లకు ఈ భవిష్యత్ కార్యాచరణ ఉండబోతోందని తెలిపారు. డిసెంబరు 8,9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్‌తో రాష్ట్ర భవిష్యత్‌ను కొత్త పుంతలు తొక్కించబోతున్నామని వివరించారు.
ఆ సందర్భంగా తెలంగాణలో ఉన్న అపారమైన పెట్టుబడుల అవకాశాలను ప్రపంచ పెట్టుబడిదారుల ముందు ఉంచబోతున్నామని సీఎం తెలిపారు. తద్వారా ఇక్కడ పెట్టుబడులు పెట్టటం వల్ల కలిగే ప్రయోజనాలపై రెండు రోజులపాటు విస్తృతంగా ప్రచారం చేస్తామని చెప్పారు. అందుకే ఆ కార్యక్రమానికి భవిష్యత్ వేదికను కూడా ఫోర్త్ సిటీలోనే ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. విభిన్న రంగాల్లో పారిశ్రామిక అభివృద్ధికి గల అవకాశాలను వివరించి, వివిధ రూపాల్లో ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ రైజింగ్ విజన్-2047 డాక్యుమెంట్ దార్శనిక భవిష్యత్ పత్రమని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్తుకు అది సమగ్ర రూపమని చెప్పారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ఈ డాక్యుమెంట్‌ను తయారు చేయబోతున్నామని అన్నారు. సమాన వృద్ధి, మహిళా సాధికారత, యువశక్తి, స్థిరమైన అభివృద్ధి.. ఇలా ఈ మూడు ప్రధాన రంగాలపై వ్యూహాన్ని రూపొందించబోతున్నామని విశదీకరించారు.
తెలంగాణను భారత దేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దడం తమ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని సీఎం తెలిపారు. చిన్న రాష్ట్రమైనా ఇక్కడ ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి తెలిపేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అభివృద్ధిలో పక్క రాష్ట్రాలతో కాదు… చైనా, జపాన్‌లతోనే పోటీ పడే లక్ష్యాలతో తెలంగాణ దూసుకుపోతోందని అన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, క్వాంటమ్ టెక్నాలజీ, కత్రిమ మేధస్సు, స్టార్టప్‌లు, టూరిజం, ఎగుమతుల్లాంటి రంగాలు రానున్న రెండు దశాబ్దాల్లో ఆర్థిక వృద్ధికి కీలకమని సీఎం తెలిపారు. తమ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, సులభ అనుమతులు, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు రాష్ట్రాన్ని పెట్టుబడిదారులకు మొదటి గమ్యస్థానంగా నిలబెట్టనున్నాయని వివరించారు. ఈ బలాలే పునాదిగా, మరిని పెట్టుబడులను ఆకర్షించే విధంగా విజన్ డాక్యుమెంట్ ఉండబోతోందని సీఎం తెలిపారు.
హైదరాబాద్ కోర్ అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ తెలంగాణ… ఇలా మూడు జోన్లుగా మార్చి, సమతుల్యాభి వృద్ధిని సాధించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం చెప్పారు. అదే సమయంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనీ, ఆ మేరకు వ్యవసాయ కార్యాచరణ కూడా విజన్ డాక్యుమెంట్‌లో భాగం కాబోతోందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో మహిళా సాధికారత కూడా అత్యంత ప్రధానమైన అంశమని వివరించారు. అందుకే కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. డెవలప్‌మెంట్ ఎకానమీలో కాలుష్యం వల్ల కలిగే నష్టాలపై కూడా దృష్టి సారిస్తామని తెలిపారు. అందుకే ‘నెట్-జీరో’ తెలంగాణను ఆవిష్కరించబోతున్నామని చెప్పారు. బ్లూ అండ్ గ్రీన్ హైదరాబాద్ లక్ష్యంగా తెలంగాణ-2047 డాక్యుమెంట్‌లో మూసీ పునరుజ్జీవం, అందులో భాగంగా 2,959 చెరువులు, పార్కులు, అటవీ ప్రాంతాలను వాటి పూర్వ స్థితికి తీసుకురావటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
అదే సమయంలో గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన రోడ్లు, సౌర విద్యుత్ వెలుగులతో విలేజ్ 2.0 లక్ష్యంతో పని చేయనున్నామని వివరించారు. ఇక మరో లక్ష్యంగా ఆధునిక రవాణా, మౌలిక సదుపాయాల కల్పనను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో తెలంగాణకు మణిహారంలా రీజనల్ రింగ్ రోడ్డును ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని తెలిపారు. హై-స్పీడ్ మొబిలిటీ కారిడార్లను ప్రభుత్వం నిర్మించనుంది. రీజనల్ రింగ్ రైల్, నాలుగు ఇండిస్టియల్ కారిడార్లు, 11 రేడియల్ రోడ్లను నిర్మించనుంది. వరంగల్, నిజామాబాద్, అదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెంలో కొత్త విమానాశ్రాయాలను ఏర్పాటు చేయబోతోందని వివరించారు. హైదరాబాద్ నుంచి బందరు పోర్టు వరకు అత్యాధునిక హైవేను నిర్మించి సీపోర్టుకు అనుసంధానం చేయబోతున్నామని అన్నారు.
గ్లోబల్ వర్క్ ఫోర్స్‌తో పోటీపడేలా ప్రతీ యేడాది రెండు లక్షల తెలంగాణ యువతకు, లక్షమంది నిపుణులకు, విదేశీ ఉపాధికి అవసరమైన నైపుణ్య అభివృద్ధి టార్గెట్‌గా ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ కేంద్రాలుగా స్పోర్ట్స్ విలేజీలను నిర్మిస్తామన్నారు. మానసిక ఆరోగ్యం, యోగా, ధ్యానం, క్రీడలు, సాంస్కృతిక అవగాహనతో సమతుల్య యువత అభివృద్ధి కోసం హౌలిస్టిక్ వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించటమే లక్ష్యంగా టూరిజం ప్రాంతాల అభివృద్ధి, నైట్ ఎకానమీ సిటీగా హైదరాబాద్ ఇమేజ్‌ను క్రియేట్ చేయటం, బతుకమ్మ, బోనాలు, డెక్కన్ క్రాఫ్ట్స్ గ్లోబల్ పండుగలతో బ్రాండ్ తెలంగాణను విశ్వవ్యాప్తం చేయబోతున్నామని తెలిపారు. ప్రపంచ సినిమా రంగాన్ని ఆకర్షిస్తూ యానిమేషన్, గేమింగ్, ఫిలిం-టెక్ పరిశ్రమలకు తెలంగాణను కొత్త గమ్యంగా రూపొందే లక్ష్యంతో ముందుకెళుతున్నామని వివరించారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామంతోపాటు గ్లోబల్ సిటీ హైదరాబాద్ దాకా సమాన అవకాశాలు, స్థిరమైన అభివృద్ధి అనే లక్ష్యంతో ఈ విజన్ డాక్యుమెంట్ -2047 మార్గదర్శకంగా ఉండబోతోందని సీఎం తెలిపారు.
పాలసీ పెరాలసిస్ ఉండొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



