ఏడాదికాలంగా కాలయాపన
ఆశావహుల ఎదురుచూపులు
టీపీసీసీ కార్యవర్గంపై ఉత్కంఠ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఇదిగో నూతన కార్యవర్గం వస్తోంది…అదిగో నూతన కార్యవర్గం వస్తోంది…ఇది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ఒక సంకట పరిస్థితి. గత ఏడాది కాలంగా ఇదే తంతు. ఇదే ప్రచారం. ఇప్పటికీ కార్యవర్గం ఎప్పుడొస్తోందో తెలియక క్యాడర్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నది. ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని నియమించడంలో ఆలస్యం చేస్తోంది. పదవులను ఆశిస్తున్న నాయకులెంతో మంది పార్టీ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ అధిష్టానం అదిగో, ఇదిగో అంటూ కాలం వెల్లబుచ్చుతున్నది. ఏ రాజకీయ పార్టీకైనా కార్యవర్గం ఎంతో కీలకమైంది. సీనియర్లతోపాటు కొత్త నాయకత్వం కార్యవర్గంలోకి రావడంతో ఆ పార్టీ ఉత్సాహంగా ముందుకు పోతుంది. కానీ మహేష్‌కుమార్‌గౌడ్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది గడిచినా ఇంకా కార్యవర్గం కార్యరూపం దాల్చలేదు. దీంతో పార్టీ క్యాడర్ ఆవేదనలో ఉన్నది. ప్రతిసారి నాయకులు ఢిల్లీకి పోవడం, రావడమే తప్ప కొత్త కార్యవర్గాన్ని తీసుకు రాలేకపోతున్నారనే అసంతృప్తి వ్యక్తమవుతున్నది. కార్యవర్గంలోకి తమ తమ అనుచరులను తీసుకోవాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర అధ్యక్షుడిపై తీవ్రంగా ఒత్తిడి పెంచుతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా మంత్రులు కూడా పెద్ద జాబితానే ఇచ్చినట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తమకు తెలిసిన అధిష్టానం పెద్దల ద్వారా తమ అనుయాయులకు ఇవ్వాలని పైరవీ చేస్తున్నారు. అంతేకాకుండా ఏ మంత్రి సిఫారసు చేసినా…ఆ పేరుపై మరొక మంత్రి అభ్యంతరం చెబుతున్నారు. దీంతోపాటు ఆయా నియోజకవర్గాల్లో ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులకు పదవులు ఇవ్వాలనే ఉద్దేశంతో అధిష్టానం ఉన్నది. ముఖ్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ కూడా అధిష్టానం నిర్ణయాన్ని అమలు చేయాలనే తలంపుతో ఉన్నట్టు తెలిసింది. మీనాక్షి నటరాజన్ పెట్టుకున్న లక్ష్యాన్ని ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము పార్టీని నమ్ముకుని కాంగ్రెస్ కండువా కప్పుకున్నామనీ, తమకు పదవులు ఇవ్వకుంటే ఎలా అంటూ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు, డైరెక్టర్లు, వ్యవసాయ మార్కెట్ల కమిటీ చైర్మెన్లు, డైరెక్టర్లు, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మెన్లు, సహకార బ్యాంకులు డైరెక్టర్లు…ఇలా ఎన్నో ప్రభుత్వ పదవులు ఇవ్వాల్సి ఉన్నది. ఈ పదవులతోపాటు నూతన కార్యవర్గంలోకి తీసుకునే నాయకులను గుర్తించడం కూడా పార్టీకి పెద్ద సవాల్‌గా మారింది. పదేండ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో నేతల్లో పదవులపై ఆశలు కూడా పెరిగాయి. ఈనేపథ్యంలో ఎవరికి పార్టీ పదవిని ఇవ్వాలో, ఏ నాయకుడికి ప్రభుత్వ పదవి ఇవ్వాలో తేల్చలేక అధిష్టానం తలమునకలవుతోందని సమాచారం.
అదిగో…ఇదిగో…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES