మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభ
నవతెలంగాణ – ముషీరాబాద్
పెన్షనర్ల హక్కుల విషయంలో రాజీపడేది లేదని, అవసరమైతే పోరాటానికి సిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ జనరల్ సెక్రెటరీ కె.రాఘవేంద్రన్ అన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభ సోమవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఎంఎన్ రెడ్డి స్వాగత ఉపన్యాసంతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నాగేశ్వర్ మాట్లాడుతూ.. ఉద్యోగులుగా ఉన్న సమయంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, డైలీవేజ్ విధానాల ద్వారా విభజించిన ప్రభుత్వాలు, ఉద్యోగ విరమణ అనంతరం కూడా పెన్షనర్లను ఈపీఎఫ్, స్టేట్, సెంట్రల్ వంటి విభాగాలుగా చీల్చుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షనర్ల సమస్యలతోపాటు సీనియర్ సిటిజన్ల సమస్యలను కూడా కలుపుకొని పోరాటం చేస్తేనే ప్రభుత్వాలు స్పందిస్తాయన్నారు.
జనరల్ సెక్రెటరీ కె.రాఘవేంద్రన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. పెన్షనర్లను వివిధ విభాగాలుగా విభజిస్తూ చట్టాలు తీసుకురావడం అన్యాయమని, పెన్షన్ కమ్యూటేషన్‌పై అధిక వడ్డీ వసూలు చేయడం ద్వారా వారిని ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు మారకపోతే ఉద్యమానికి సిద్ధం కావాల్సిందేనని పిలుపునిచ్చారు. అలాగే, తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు ఈ సభకు హాజరై మహాసభ విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన అనంతరం పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఉద్యమం ఉధృతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పి.నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి పి. కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.



