నవతెలంగాణ – మల్హర్ రావు
భారతదేశంలో ప్రముఖ సంఘ సంస్కర్తలలో సావిత్రీబాయి ఫూలే ఒకరు. ఆమె దేశంలో తొలి మహిళ ఉపాధ్యాయురాలు. 1848లో మహారాష్ట్రలోని పుణేలో బాలికల పాఠశాలను ప్రారంభించారు. దీంతో సావిత్రీ బాయిపై అగ్రవర్ణాలవారు వేధింపులు, భౌతికదాడులు చేసేవారు. పాఠశాలకు వెళ్లేప్పుడు ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలంతో దూషించడం చేసేవారు. ఇలా ఎన్నో అవమానాలను ఎదుర్కొని సావిత్రీబాయి అనేక సంస్కరణలు చేశారు. అయితే సావిత్రీ బాయితో పాటు ఫాతిమా షేక్ కూడా బాలికల విద్యకు కృషి చేశారు. జ్యోతిబా ఫూలే దంపతులను గృహ బహిష్కరణ చేస్తే వారికి ఉస్మాన్ షేక్ ఆశ్రయమిచ్చారు.
ఆయన చెల్లెలే ఫాతిమా షేక్. వారి ఇంటి ప్రాంగణంలో బడి నడుపుకునే అవకాశం ఇచ్చి, సావిత్రితో పాటు తన చెల్లికీ చదువు చెప్పాలని ఉస్మాన్ కోరారు. తర్వాత సావిత్రి, ఫాతిమాలు మరో బడిని ప్రారంభించి బోధించేవారు, బడి సమయం తర్వాత ఇంటింటికీ వెళ్లి.. బాలికల చదువు ఎంత ముఖ్యమో వివరించేవారు. 1856లో సావిత్రి బాయి అనారోగ్యంతో పుట్టింట్లో ఉన్నప్పుడు ఫాతిమా పాఠశాలల నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. సావిత్రీ బాయి సహాధ్యాయిగా మొదలైన ఫాతిమా.. ఈ దేశపు తొలి ముస్లిం టీచర్గా విశేష సేవలందించారు.