Sunday, January 18, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఇవీ పురపోరు రిజర్వేషన్లు

ఇవీ పురపోరు రిజర్వేషన్లు

- Advertisement -

121 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లకు ఖరారు
మహిళలకు 50 శాతం
రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ
ఎన్నికలు జరిగేది 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లలోనే
మిగిలినవాటికి కాలపరిమితి ముగిశాకే…
నేడు ఈసీకి రిజర్వేషన్ల జాబితా
వివరాలు వెల్లడించిన మున్సిపల్‌ డైరెక్టర్‌ టీకే.శ్రీదేవి
19న ఎన్నికల షెడ్యూల్‌ విడుదల?


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్లు, చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బీసీ రిజర్వేషన్లను డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక ఆధారంగా 2019 తెలంగాణ మున్సిపల్‌ చట్టం ప్రకారం ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించారు. శనివారం హైదరాబాద్‌లోని పురపాలకశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రిజర్వేషన్ల వివరాలను ఆ శాఖ డైరెక్టర్‌ టీకే శ్రీదేవి వెల్లడించారు. మొత్తం కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో కేటగిరీల వారీగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. 10 కార్పొరేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి ఖరారయ్యాయి. బీసీ మహిళలకు మూడు మేయర్‌ పోస్టులు దక్కాయి. ఐదు కార్పొరేషన్లు జనరల్‌ కేటగిరిలో ఉన్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్‌ (ఎస్టీ జనరల్‌) రామగుండం కార్పొరేషన్‌ (ఎస్సీ జనరల్‌), మహబూబ్‌ నగర్‌ కార్పొరేషన్‌ (బీసీ మహిళ), మంచిర్యాల, కరీంనగర్‌ కార్పొరేషన్లు (బీసీ జనరల్‌), వరంగల్‌ కార్పొరేషన్‌ (జనరల్‌), ఖమ్మం, నిజామాబాద్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ (మహిళా జనరల్‌)కు కేటాయించారు.

121 మున్సిపాల్టీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 15, బీసీలకు 38 ఖరారు చేశారు. వాటిలో బీసీ మహిళలకు 19 రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మిగిలిన ‘పుర’పాలికలు జనరల్‌కు కేటాయించారు. కాల పరిమితి ముగియని జీహెచ్‌ఎంసీ, వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు కొత్తూరు, జడ్చర్ల, అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్‌ మున్సిపాల్టీలకు సైతం రిజర్వేషన్లు ఖరారు చేశారు. అయితే వాటిలో వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లను మాత్రం ఖరారు చేయలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించామని శ్రీదేవి తెలిపారు. డిసైండింగ్‌ (అవరోహణక్రమం) ఆర్డర్లో రాజకీయ పార్టీల సమక్షంలో రిజర్వేషన్లను లాటరీ ద్వారా ఎంపిక చేశామని ఆమె వివరించారు.

ఉదాహరణకు.. గతంలో ఎస్సీగా ఎంపికైన స్థానాన్ని తిరిగి ఆ కేటగిరిలో రాకుండా చూశామని స్పష్టత ఇచ్చారు. అయితే కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో గ్రామాల విలీనం లేదా తొలగింపులను కొత్త వాటిగానే పరిగణించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ స్థానాల్లో ఇదే విధానాన్ని అవలంభించారు. ప్రస్తుతం 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటిలో శనివారం సాయంత్రానికి వార్డులు, డివిజన్ల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు. ఆదివారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల జాబితా అందజేస్తామన్నారు. కాలపరిమితి ముగియని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో విలీనం లేదా తొలగింపు ప్రక్రియను తాము అంచనా వేయలేమనీ, వాటి కాలపరిమితి ముగిశాక అప్పటి నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయన్నారు.

నేడు మేడారంలో రాష్ట్ర మంత్రి వర్గం
మేడారంలో నేడు జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ ఖరారు, ఎంపీటీసీ, జెడ్‌పీటీల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. మున్సిపల్‌ ఎన్నికలకు మంత్రివర్గం గ్రీన్‌ సిగల్‌ ఇస్తే, ఈనెల 19న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మంత్రివర్గంలో 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ రూపకల్పన కోసం శాఖల వారీగా కేటాయింపులపైనా చర్చించనున్నారు. దానితోపాటు గోదావరి-కృష్ణా జలవివాదాలపై అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చిస్తారు. ఈనెల 30న ఢిల్లీలో జరిగే జలవివాదాల పరిష్కార ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో నల్లమలసాగర్‌పై రాష్ట్ర డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటేనే హాజరవ్వాలనే అంశంపై కూడా చర్చించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -