బీజేపీ,ఆర్‌ఎస్‌ఎస్, ఈసీల కుట్రలు: రాహుల్ గాంధీ
బీహార్ ర్యాలీలో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్
ఆరా: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, కేంద్ర ఎన్నికల సంఘం కలిసి దేశంలో ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా బీహార్‌లోని ఆరాలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో కలిసి రాహుల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీహార్‌లో నిర్వహించిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిపిన దాడిగా రాహుల్ అభివర్ణించారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా బీహార్‌లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర దేశవ్యాప్తంగా ఉద్యమంగా మారుతుందన్నారు. మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలలో ఓట్లు చోరీ చేయడంలో ఎన్‌డీఏ ప్రభుత్వం విజయవంతమైందని ఆరోపించారు. కానీ బీహార్‌లో మాత్రం బీజేపీ, ఈసీ ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వబోమని చెప్పారు. ఓటు అనేది దళితులు, మైనారిటీలు, మహిళలకు ఒక హక్కు అని రాహుల్ గాంధీ అన్నారు. కానీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం వారి ఓట్లను చోరీ చేస్తోందని ఆరోపించారు.
భారత రాజ్యాంగం ఓటు హక్కును హామీని ఇస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుని ప్రజల ఓటు హక్కును తొలగించడం ద్వారా బీజేపీ రాజ్యాంగంపై దాడి చేస్తోందని విమర్శించారు. ఇకపై దేశంలోని ఏ ప్రాంతంలోనూ బీజేపీ ఓట్లను దొంగిలించడానికి మేం అనుమతించమని పేర్కొన్నారు. తాము చేపడుతున్నకార్యక్రమాలతో ప్రజలు బీజేపీ నాయకులను ఓటు దొంగలుగా పిలుస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు.
‘బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతారు’
ఈ యాత్రలో పాల్గొన్న అఖిలేశ్ యాదవ్, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పచ్చి బూటకపు నిర్ణయంగా అభివర్ణించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకానికి భయపడుతోందని అన్నారు. ‘బీజేపీకి రోజులు ముగిశాయి. ప్రజలు గద్దె దింపుతారు. బీహార్ ఎన్నిక కీలకం కానున్నాయి. దేశం మొత్తం దీనిని గమనిస్తోంది. మీ ఉత్సాహం చూస్తుంటే మీరు బీజేపీని గద్దె దించుతారని స్పష్టంగా తెలుస్తోంది.
ప్రజలను వాడుకుని నాశనం చేసే పార్టీ బీజేపీ. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేయాలని ఆశించాం. కానీ అది ఇప్పుడు బీజేపీకి జుగాడ్ కమిషన్‌గా మారిపోయింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాల్లో బీజేపీ కేవలం 33 సీట్లు మాత్రమే గెలిచింది. అవధ్ (ఉత్తరప్రదేశ్ పాత పేరు) ప్రజలు ఇప్పటికే బీజేపీని గద్దె దించారు. ఇప్పుడు మగధ్ (బీహార్ పాత పేరు) ప్రజల వంతు వచ్చింది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలపై బీజేపీ ప్రభుత్వం భయపడుతోంది. ట్రంప్‌నకు వీరు భయపడ్డారు. సుంకాలతో వ్యాపారులను కష్టాల్లోకి నెట్టారు. బీజేపీ నోరు మూయించబడినందువల్ల మౌనంగా ఉంది’ అని అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఇక జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఇతర మిత్ర పక్షాల ప్రతినిధులు, టీఎంసీ నుంచి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, లలితేశ్ త్రిపాఠి సెప్టెంబర్ 1న జరిగే యాత్ర చివరి రోజు కార్యక్రమంలో పాల్గొననున్నారు.