Thursday, July 10, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్వాళ్లు చనిపోయారు

వాళ్లు చనిపోయారు

- Advertisement -

– ‘సిగాచి’లో ఆచూకీ లభించని 8 మంది మరణించినట్టు అధికారిక ప్రకటన
– కాలిబూడిదైనట్టు నిర్ధారణ
– ప్రభుత్వానికి నివేదించిన జిల్లా అధికారులు
– అంత్యక్రియలు చేసుకోవాలని బంధువులకు సమాచారం
– 52కి చేరిన మృతుల సంఖ్య
– ఆచూకీ లభించని కుటుంబాలకు రూ.15 లక్షలు ఇవ్వడం అన్యాయం
– పరిశ్రమ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలి : సీఐటీయూ
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి

పాశమైలారం మృత్యు సిగాచి పరిశ్రమ మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. పేలుళ్ల దాటికి కొందరు తునాతునకలవ్వగా.. ఇంకొందరి శరీరాలు తెగిపడి మొండాలయ్యాయి. చెయ్యెత్తు మనుషులు చిన్న పెట్టేలో పట్టే మాంసం ముద్దలయ్యారు. పూర్తిగా కాలిపోయి తనువు చాలించారు. 44 మంది శరీర అవశేషాలను గుర్తించడంతో వారి బంధువులు అశ్రునయాలతో కనీసం అంత్యక్రియలైనా చేసుకునే వీలేర్పడింది. కానీ.. ఆచూకీ లభించని మరో 8 మంది మంటల్లో మాడి మసైనట్టు చెబుతున్నారు. బూడిద కూడా లభించకపోవడంతో కన్నవాళ్లు, కట్టుకున్నవాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఆచూకీ లభించని వాళ్లంతా చనిపోయి ఉంటారని, మంటల్లో బూడిదైనందునే శరీర అవశేషాలేవీ లభించలేదంటూ అధికారులు నిర్ధారించారు.


ఆచూకీ లభించని వారిలో.. రాహుల్‌కుమార్‌ శర్మ (ఉత్తర ప్రదేశ్‌), జి.వెంకటేశ్‌ (ఆంధ్రప్రదేశ్‌), సిల్వేరు రవి (తెలంగాణ), శివాజీకుమార్‌ (బీహార్‌), విజరుకుమార్‌ నిషాద్‌ (యూపీ), అఖిలేష్‌కుమార్‌ (యూపీ), ఇర్ఫాని అన్సర్‌ (జార్ఖండ్‌), జస్టిన్‌ (తెలంగాణ) 8 మంది ఉన్నారు. సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి 10 రోజులు దాటింది. శిథిలాల తొలగింపు పూర్తయినా ఈ 8 మందికి సంబంధించిన శరీర అవశేషాలేమీ లభించకపోవడంతో వీరంతా ప్రమాదంలో భారీగా ఎగసిపడిన మంటల్లో కాలి బూడిదై ఉంటారని అధికారులు భావిస్తున్నారు.


40 మంది కార్మికుల శవాలకు సంబంధించిన అవశేషాలు శిథిలాల కింద లభ్యమయ్యాయి. వాటిని డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. మరో నలుగురు మంటల్లో తీవ్రంగా కాలిపోయి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించడంతో వారి మృతదేహాలను బంధువులకు అప్పజెప్పారు. చివరి వరకూ మరో 8 మంది ఆచూకీ లభించకపోవడంతో వారి బంధువులు పది రోజులుగా కంపెనీ వద్దే పడిగాపులు కాస్తున్నారు. హెల్ప్‌లైన్‌ సెంటర్‌ వద్ద ఏదైనా సమాచారం చెబుతారనే ఆశతో ఎదురు చూశారు. కాగా, శిథిలాల కింద సేకరించిన సుమారు 100పైగా నమునాలను ఫోరెన్సిక్‌ లాబోరేటరీకి పంపగా.. ఆ 8మంది కుటుంబసభ్యుల డీఎన్‌ఏతో సరిపోలలేదు. దాంతో వారంతా ఈ ఘటనలో పూర్తిగా కాలి బూడిదైనట్టుగా అధికారులు నిర్ధారించారు. ఈ విషయాన్ని వారి బంధువులకు తెలిపారు. వారి అంత్యక్రియల కార్యక్రమాలు నిర్వహించుకోవాలని అధికారులు సమాచారమివ్వడంతో ఆశలు వదులుకోవాల్సి వచ్చింది.


మృతులందరికీ రూ.కోటి పరిహారమివ్వాలి:సీఐటీయూ
సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మరణించిన వాళ్లందరికీ రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్‌ డిమాండ్‌ చేశారు. ఆచూకీ లభించని కార్మికుల కుటుంబాలకు కేవలం రూ.15 లక్షలిచ్చి చేతులు దులిపేసుకుంటే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. ఇప్పటి వరకు 44 మంది మృతి చెందారని, ప్రమాదం జరిగి 10 రోజులైనా ఇంకా 8 మంది కార్మికుల ఆచూకీ దొరకలేదని అధికారులు చెప్పడం సరైంది కాదన్నారు. అత్యాధునిక టెక్నాలజీ ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లనే 8 మంది కార్మికుల ఆచూకీ లభించకుండా పోయిందన్నారు. ఆచూకీ లేని వాళ్లు కూడా చనిపోయినట్టు చెబుతున్నందున సిగాచి మృతుల సంఖ్య 52కు చేరుతుందని, వారందరి కుటుంబాలకు కూడా కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకు మూడు స్థాయిలో వేసిన కమిటీలు విచారణ జరిపినప్పటికీ తుది నివేదిక ఎందుకివ్వలేదన్నారు. వెంటనే సిగాచి పరిశ్రమ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -