చరవాణికి వేలాడదీయకండిఆకాశాన్ని ఆటస్థలంగా… అమ్మవొడిలో కొత్త లోకాన్ని స్వప్నిస్తూ…
విచ్చుకుంటున్న పసి మొగ్గలు
కల్లాకపటం అంటని పసి హదయాన్ని
మన సంక్లిష్ట బంధనాల పంజర ఊచలకు కట్టెయ్యకండి
ఈ విశాల విశ్వ దార్శనికతకు దారులు మూసివేస్తూ..
ఆ మెత్తని మస్తిష్కములో మొలిచే ప్రశ్నల చిగుళ్ళను తుంచెయ్యకండి
విజ్ఞానపు అంచులనధిరోహించాలనే తష్ణాలోచనలకు సహనపు సోపానాలను పట్టండి
అంబరంలో నక్షత్రాలకు వేలాడతున్న ఆనందాలకోసం
ప్రాకుతున్న చిన్ని మనసుకు సత్తువల ఊతాలను పేర్చండి
మీ సంతోషాల వరదలను పారించడానికి
చిట్టి అడుగుల ప్రవాహాలకు ఆనకట్టలు వేయకండి
అలలై ఉవ్వెత్తున ఎగిసే చిట్టి తలపులను ఉప్పెనని
ఆందోళనలో కొట్టుకుపోకుండా నిశ్చింతంగా నిలబడండి
అవి ప్రశ్నల పరవళ్ళు, కొడవళ్ళు కావు
అవి చిలిపితనపు చిగుళ్ళు, మొండి తనపు పగుళ్ళు కావు
వారి పోరు పొడుస్తున్న పొద్దు, రేపటి వెలుగుల తోరణం
వారి అల్లరి అరాచకం కాదు, ఆనందడోలికల హారం
కురిసే అల్లరి గుళికలను రాసులుగా పోసి
వారి అడుగులకు దారులను చదును చేయండి
కానీ… ఆ అల్లరిని ఆగడాలుగా పొరబడి
మీ తాత్కాలిక వెసులుబాటు కోసం వారిని చరవాణికి వేలాడదీయకండి
- యాదయ్య కొప్పోలు