జాన్ బ్రిట్టాస్
ఓటర్ల జాబితా సవరణలు, ఓట్ల చోరీ అంశాలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని సీపీఐ(ఎం) రాజ్యసభ పక్షనేత జాన్ బ్రిట్టాస్ అన్నారు. బీహార్‌లో ఓటర్ల జాబితాల సవరణ పేరుతో లక్షలాది అసలైన ఓటర్లను తొలగిస్తున్నారనీ, ఈ మోసం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియాసులే మాట్లాడుతూ తాము మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకొని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని చెప్పారు. ప్రతిపక్ష ఎంపీలను బలవంతంగా నిర్భంధించడాన్ని టీఎమ్‌సీ ఎంపీ సాగరిక ఘోష్ ఖండించారు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు పార్లమెంటు సభ్యులను నిర్బంధించడం అంటే తమ హక్కుల్ని హరించడమేననీ, ఇది రాజ్యాంగ, చట్ట విరుద్ధమని ఆమె అన్నారు.
రాజ్యాంగ రక్షణ కోసమే ఈ పోరాటం: రాహుల్‌గాంధీ
తమ పోరాటం రాజకీయం కోసం కాదనీ, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ఓటు హక్కు రక్షణ కోసమని రాహుల్ గాంధీ అన్నారు. దీన్ని ప్రతిపక్షాలు ఐక్యంగా కలిసి సాధిస్తాయని చెప్పారు. నిజాలు యావత్ దేశం ముందు ఉన్నాయన్నారు. తమ పోరాటం ‘ఒక మనిషి, ఒకే ఓటు’ (వన్ మ్యాన్ వన్ ఓట్) కోసమని స్పష్టం చేశారు. తమవద్ద ఉన్న డేటా ఎన్నికల సంఘం ఇచ్చిందేననీ, తనది కాదని తేల్చిచెప్పారు. ఎన్నికల సంఘం ఓటర్ల డేటాను తక్షణం వెబ్‌సైట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇదేతరహాలో ఓట్ చోరీ జరిగిందని చెప్పారు. కర్ణాటకలో బహుళ వ్యక్తులు, బహుళ ఓట్ల వివరాలను ప్రత్యక్షంగా దేశ ప్రజలకు చూపించామనీ, కేంద్ర ఎన్నికల సంఘానికి మాత్రం అవి కనిపించట్లేదని ఎద్దేవా చేశారు. బీహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై ఓటర్ల జాబితాను సవరిస్తున్నాయని విమర్శించారు.
రాజ్యాంగాన్నిఅణగదొక్కే కుట్ర : ఖర్గే
రాజ్యాంగాన్ని అణగదొక్కడానికి బీజేపీ చేసిన కుట్రను ఇండియా బ్లాక్ పార్టీలు బహిర్గతం చేస్తాయని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. అసలు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళితే, ఈ ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. వాళ్లు దేనికో భయపడుతున్నారని అన్నారు. తమది శాంతియుత ఆందోళన మాత్రమేనని, ఎన్నికల కమిషన్ దీన్ని మరింత సున్నితంగా నిర్వహించాలని చెప్పారు. ఎంపీలను అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని తెలిపారు.