గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే కుట్రలు
చిత్తశుద్ది ఉంటే విచారణ చేసి దోషులను శిక్షించాలే
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
నవతెలంగాణ – మల్హర్ రావు
కాంగ్రెస్ నాయకులు తమ ఇసుక దందాను కొనసాగించుకునేందుకే అడవిసోమన్‌పల్లి మానేరుపై నిర్మించిన చెక్‌డ్యాంను బ్లాస్ట్ చేసి కూల్చివేశారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. గురువారం కూలిపోయిన అడవిసోమన్‌పల్లి చెక్‌డ్యాంను ఆయన పరిశీలించారు. అక్కడి నుంచే మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావుతో వీడియో కాల్ మాట్లాడి చెక్‌డ్యాం పరిస్థితిని వివరించారు. చెక్‌డ్యాంతో అనేక మంది రైతులు,మత్స్యకారులకు ఉపాది లభించేదని, దాన్ని కూల్చివేయడంతో వారంతా ఉపాధిని కోల్పోయారని మాజీ మంత్రికి వివరించారు. దీంతో త్వరలోనే వచ్చి చెక్‌డ్యాంను సందర్శిస్తానని తెలిపారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ..క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్లు పూర్తిగా బ్లాస్టింగ్‌చేసినట్లుగా కన్పిస్తోందన్నారు.తాము ఎవరిపై వృధాగా ఆరోపణలు చేయడం తమ ఉద్దేశ్యం కాదన్నారు. చెక్‌డ్యాం కట్టినప్పుడు ప్రస్తుత మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇక్కడ చెక్‌డ్యాంలు కట్టవద్దని, ఇక్కడ ఉండవద్దని పదేపదే ప్రెస్‌మీట్‌లలో చెప్పాడని అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెక్‌డ్యాం ఉంటే ఇసుక తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పినట్లుగానే ఎన్నికల తర్వాత కూల్చివేశారన్నారు. వెంకటాపూర్,అడవిసోమన్‌పల్లి, నాగేపల్లి సర్పంచ్‌లు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడంతో ఈ పని సునాయసంగా చేసి అనుకున్నది నెరవేర్చే అవకాశం దొరికిందని తాను బావిస్తున్నట్లు చెప్పారు.
12లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహన్ని తట్టుకుని నిలబడ్డ చెక్‌డ్యాం ఈనాడు ఎలాంటి ప్రవాహం లేకుండా కేవలం లక్ష క్యూసెక్కుల నీళ్లు నిలకడగా ఉంటే ఎలా కూలిపోతుందో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. ఓడేడ్ బ్రిడ్జి వద్దకు వెళ్లి నాణ్యతలోపం అని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పటి వరకు ఎలా గ్లడ్డర్లు కూలిపోయాయో నిర్థారించలేదని,కాళేశ్వరం ప్రాజెక్టును నిర్థారించలేదన్నారు. కేవలం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి బ్లాస్టింగ్‌లతో ప్రాజెక్టులను కూల్చివేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు.శత్రుదేశాలు సైతం ఇలాంటి ధ్వంసాలు చేయలేదని, ప్రాజెక్టులు, డ్యాంల మీద ఏనాడు దాడులు చేయలేదని, మన రాష్ట్రంలో ఉన్న మన నాయకులే ప్రజలను ధ్వంసం చేసే విధంగా వారి వ్యవహారిశైలి ఉందని మాజీ మంత్రి చెప్తున్నట్లు ఆయన తెలిపారు.
చెక్‌డ్యాంలో నీరు సంవృద్దిగా ఉండటంతో సుమారు రెండు వందల కుటుంబాలు చేపలు పట్టి జీవనోపాధి పొందారని, రోజుకు వేయి రూపాయలు సంపాదించుకునేవారన్నారు. అలాగే భూగర్బజలాలు పెరిగి రైతుల పంటలకు సాగు నీరు అందేదన్నారు. ఇంత ప్రయోజనం చేకూర్చే చెక్‌డ్యాంను కాంగ్రెస్సోళ్లు ఇసుక దందా కోసం బ్లాస్టింగ్ చేశారన్నారు. ఈ విషయంపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లే మా పరిధి కాదని మంథని పోలీసులు, నాణ్యత లోపం అని రాసిస్టేనే దరఖాస్తు తీసుకుంటామని కొయ్యూరు పోలీసులు చెప్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అధికారులు నాణ్యతా లోపమని ఎలా దరఖాస్తు చేస్తారో పోలీసులకే తెలియాలన్నారు, దరఖాస్తును సైతం పోలీసులే డిజైన్ చేసే పరిస్థితులు వచ్చాయన్నారు. మంథని ఎమ్మెల్యేకు చిత్తశుద్ది ఉంటే ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసి దోషులను శిక్షించాలని, వెంటనే చెక్‌డ్యాం పునర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.



