– ట్రాన్స్‌జెండర్లపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు
లండన్ : మహిళల క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్లకు చోటు లేదని, తక్షణమే ఉమెన్ క్రికెట్ నుంచి నిషేధిస్తున్నామని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్పష్టం చేసింది. యునైటెడ్ కింగ్‌డమ్ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు మేరకు ఈసీబీ శుక్రవారం ఓ ప్రకటనలో ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. ఇప్పటికే ఇంగ్లాండ్‌లో ఫుట్‌బాల్ సమాఖ్య సైతం ట్రాన్స్‌జెండర్లను మహిళల గేమ్‌లో నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ‘మహిళల, గర్ల్స్ క్రికెట్‌లో కేవలం బయోలాజికల్ జెండర్ మహిళలు మాత్రమే పోటీపడేందుకు అర్హులు. ట్రాన్స్‌జెండర్ మహిళలు, అమ్మాయిలు ఓపెన్, మిక్స్‌డ్ ఫార్మాట్ క్రికెట్‌లో పాల్గొనవచ్చు. ఈ నిర్ణయం మహిళల క్రికెట్‌పై పెను ప్రభావం చూపిస్తుందని తెలుసు. ఈ మార్పుతో ప్రభావితమైన వ్యక్తులను మద్దతుగా రీక్రియేషనల్ క్రికెట్ బోర్డుతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈక్వాలిటీ, హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఈహెచ్‌ఆర్‌సి) మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నాం. క్రికెట్‌లో ఎటువంటి వివక్షకు తావులేకుండా స్పిరిట్ ఆఫ్ రెస్పెక్ట్‌తో ఆటను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామని’ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ఆ దేశంలో ఏ క్రీడల్లోనూ ట్రాన్స్‌జెండర్లు మహిళల విభాగంలో పోటీపడకుండా నిషేధించిన సంగతి తెలిసిందే.
మహిళల క్రికెట్‌లో వారికి చోటు లేదు
- Advertisement -