Sunday, February 15, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంతప్పు చేశారు…ఆ విద్యార్థిని వెనక్కి రప్పించండి

తప్పు చేశారు…ఆ విద్యార్థిని వెనక్కి రప్పించండి

- Advertisement -

ట్రంప్‌ ప్రభుత్వాన్ని ఆదేశించిన జిల్లా జడ్జి
వాషింగ్టన్‌ : గత సంవత్సరం పొరబాటున దేశం నుంచి పంపేసిన బాబ్సన్‌ కళాశాల విద్యార్థిని ఏనీ లుసియా లొపెజ్‌ బెల్లోజా (19)ను తిరిగి రప్పించే ఏర్పాటు చేయాలని అమెరికా న్యాయస్థానం ట్రంప్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం రెండు వారాల గడువు ఇచ్చింది. జరిగిన ‘తప్పు’ను సరిదిద్దుకునేందుకు ఈ అవకాశం ఇస్తున్నానని జిల్లా జడ్జి రిచర్డ్‌ స్టెయర్న్‌ తన ఆదేశాలలో తెలియజేశారు.

అయితే ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టని పక్షంలో తీసుకోబోయే తదుపరి చర్యను ఆయన వెల్లడించలేదు. తప్పు జరిగిందని ప్రభుత్వం అంగీకరించిందని, కాబట్టి దానిని సవరించుకునేందుకు సమయం వచ్చిందని చెప్పారు. ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇలాంటి ఉదంతాలు ఎన్నో జరిగాయి. వలసదారులను పొరబాటుగా బలవంతంగా స్వస్థలాలకు పంపడం ఇది మొదటిసారి కాదు. అనేక సందర్భాలలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం బేఖాతరు చేసింది.

ఏం జరిగిందంటే…
లొపెజ్‌ బెల్లోజాను గత నవంబర్‌ 20న బోస్టన్‌లోని లోగాన్‌ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ ఏజెంట్లు అరెస్ట్‌ చేశారు. కళాశాలలో కొత్తగా చేరిన బెల్లోజా టెక్సాస్‌లోని తన కుటుంబాన్ని కలుసుకునేందుకు విమానం ఎక్కబోతుండగా ఈ ఘటన జరిగింది. విమానాశ్రయంలో తనను నిర్బంధించిన తర్వాత న్యాయవాదిని కలుసుకునేందుకు కూడా అనుమతించలేదని ఆమె అసోసియేటెడ్‌ ప్రెస్‌ వార్తా సంస్థకు తెలిపారు. ముందుగా డిపోర్టేషన్‌ పత్రంపై సంతకం చేయాలని ఇమ్మిగ్రేషన్‌ ఏజెంట్‌ చెప్పాడని, అందుకు తాను నిరాకరించానని అన్నారు.

ఆ తర్వాత రెండు రాత్రులు ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) కార్యాలయంలోని ఓ గదిలో మరో 17 మంది మహిళలతో కలిపి నిర్బంధించారని, కనీసం కూర్చోవడానికి కూడా అక్కడ స్థలం దొరకలేదని వాపోయారు. ఆ తర్వాత తనను ఓ విమానంలో టెక్సాస్‌ పంపారని, అక్కడి నుంచి నవంబర్‌ 22న తన స్వస్థలమైన హోండురస్‌కు చేర్చారని వివరించారు. కాగా గత రెండున్నర నెలలుగా ఆమె హోండురస్‌లోనే ఉంటూ న్యాయపోరాటం జరిపారు. జరిగిన పొరబాటుకు విచారణ సందర్భంగా ట్రంప్‌ ప్రభుత్వం క్షమాపణ చెప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -