– జర్నలిస్టుపై గుజరాత్ పోలీసుల దాష్టీకం
న్యూఢిల్లీ : గుజరాత్‌లోని రాజ్‌కోట్ పోలీసులు ఒక స్థానిక జర్నలిస్టును చిత్రహింసలకు గురి చేశారు. ప్రయివేట్ పార్టులపై పెట్రోల్ పోయడంతో పాటు తలకిందులుగా వేలాడి దీసి, జంతువుల్లా చితకబాదారు. దీంతో జర్నలిస్టు కాలు విరగడంతో సహా వీపు, తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. కస్టడీలో తీవ్రంగా హింసించడంతో పాటు తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని, ఇంటిని కూల్చివేస్తామని కూడా జర్నలిస్టును పోలీసులు బెదరించారు. తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలైన తరువాత కూడా జర్నలిస్టును పోలీసులు విడిచిపెట్టలేదు. జర్నలిస్టును ఆస్పత్రిలో చేర్చుకోవద్దని రాజ్‌కోట్ సివిల్ ఆస్పత్రి వైద్యులపై పోలీసులు ఒత్తిడి తెచ్చారు.ఈ ఘటన పూర్తి వివరాల ప్రకారం రాజ్‌కోట్‌కు చెందిన సుదేశ్ వదేచా అనే జర్నలిస్టు సొంతంగా ‘ఖబర్ రాజ్‌కోట్ కి న్యూస్’ అనే ఆన్‌లైన్ మీడియా సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ నెల 22న సుదేశ్‌ను పోలీసులు నిర్భంధంలోకి తీసుకున్నారు. తరువాత రాజ్‌కోట్ క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) జగదీష్ బంగద్వా, అతని బృందం జర్నలిస్టుపై కస్టడీలో హింసకు పాల్పడ్డారు. అసిమ్ అగమ్ అనే బిల్డర్‌కు సాగిస్తున్న అక్రమ నిర్మాణ కార్యకలాపాల గురించి వార్తలు రాస్తున్న కారణంగానే పోలీసులు తనపై దాడికి పాల్పడ్డారని జర్నలిస్టు విమర్శిస్తున్నారు. తనపై ఎలాంటి తీవ్రమైన ఫిర్యాదు లేవని, కేవలం బిల్డర్ ఆదేశాల మేరకే ఈ దాడి జరిగిందని తెలిపారు.
ఈ విమర్శలను డీసీపీ బంగద్వా ఖండించారు. జర్నలిస్టుపై ఎలాంటి దాడి చేయలేదని, అతనిపై ఎనిమిది కేసులు ఉన్నాయని, వాటి నుంచి విచారణను తప్పించుకోవడానికే ఇలాంటి నాటకం ఆడుతున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టుపై కేసుకు సంబంధించిన పత్రాలను డీసీపీ విలేకరులకు చూపించినా, అవి అధికారిక ఎఫ్‌ఐఆర్లు కాకపోవడం గమనార్హం. కాగా, జర్నలిస్టుపై దాడిని కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగేశ్ మేవానీ, మాజీ ఐపీఎస్ అధికారి రమేశ్ సవానీ తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కస్టడీ దాడులు : టాప్-5లో గుజరాత్
దేశవ్యాప్తంగా కస్టడీ మరణాలు, పోలీసుల క్రూరత్వంకు సంబంధించిన అంశంల్లో టాప్-5 రాష్ట్రాల్లో గుజరాజ్ ఒకటి. ఈ విషయాన్ని సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వివరాలే వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఈ నెల 15 వరకూ గుజరాత్‌లో 14 కస్టడీ మరణాలు నమోదయ్యాయి. గుజరాత్ కంటే ఎక్కువగా బీహార్‌లో 19, రాజస్తాన్‌లో 18, ఉత్తరప్రదేశ్‌లో 15 కస్టడీ మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో కూడా 14 కస్టడీ మరణాలు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలే కావడం విశేషం. ఈ ఏడాది కాదు గత కొన్నేండ్ల నుంచి గుజరాత్‌లో ఎక్కువగానే కస్టడీ మరణాలు సంభవిస్తున్నాయి. 2021-22లో ఏకంగా 24 మంది కస్టడీ సమయంలో మృతి చెందారు.
ప్రయివేట్ పార్టులపై పెట్రోల్ జంతువుల్లా చితకబాదారు
- Advertisement -
- Advertisement -



