Saturday, February 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉద్యోగాన్వేషకుల నుంచి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

ఉద్యోగాన్వేషకుల నుంచి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

- Advertisement -

కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి
టి-హబ్‌, కె-హబ్‌ సంయుక్తంగా కార్యక్రమాలు.. కేయూలో ఓరియంటేషన్‌ సెషన్‌
నవతెలంగాణ- హనుమకొండ చౌరస్తా

ఉద్యోగాన్వేషకుల నుంచి ఉద్యోగార్థులుగా, పారిశ్రామికవేత్తలుగా, ఇన్నోవేటర్లుగా విద్యార్థులు ఎదగాలని కాకతీయ యూనివర్సిటీ(కేయూ) వైస్‌ ఛాన్స్‌లర్‌ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కేయూ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో శుక్రవారం కేయూ- హైదరాబాద్‌ టి-హబ్‌ సంయుక్తంగా నిర్వహించిన ‘ఓరియంటేషన్‌ సెషన్‌’లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల లక్ష్య సాధనకు టి-హబ్‌, కె-హబ్‌లు శిక్షణ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయని, ఇందుకు సంబంధించిన అవగాహనా ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్టు చెప్పారు. రానున్న రెండేండ్లలో ‘విద్యార్థులు ఏస్థానంలో ఉండాలి- తదనుగుణంగా వారి ఆలోచనలు ఎలా ఉండాలి’ అనే అంశాలపై దృష్టి సారిస్తూ, ఇన్నోవేషన్‌, ఇంక్యుబేషన్‌, స్టార్టప్స్‌ స్థాపనకు టి-హబ్‌, కె-హబ్‌లు సమగ్ర శిక్షణ అందించనున్నట్టు తెలిపారు. ప్రతి విద్యార్థీ ప్రారంభంలో సాధారణ వ్యక్తులుగానే ఉంటారని, వారి లక్ష్యాలు, నిబద్ధత, అంకితభావమే వారిని అసాధారణ వ్యక్తులుగా మారుస్తాయని అన్నారు. గ్రామీణ, పట్టణ, ధనిక, పేద అనేవి ఎలాంటి అడ్డంకులూ కావని స్పష్టం చేశారు. ఇన్నోవేటర్లు, పారిశ్రామికవేత్తలుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా, వారిని భవిష్యత్‌లో ఉద్యోగదాతలుగా మార్చే దిశగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుందని తెలిపారు. వరంగల్‌ వంటి ద్వితీయ శ్రేణి (టయర్‌-2) నగరాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి, స్థానికంగా నవీన ఆలోచనలతో కూడిన వ్యాపార సంస్కృతిని పెంపొందించడమే లక్ష్యంగా యూనివర్సిటీ కె-హబ్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. వ్యవసాయం, ఇందనం, బయోటెక్నాలజీ, ఫార్మసీ, ఎడ్యుకేషన్‌, ఆటోమేషన్‌, ఏరో స్పేస్‌ రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయని, చదువుతోపాటు స్టార్టప్స్‌ స్థాపనకు విద్యార్థులు ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ టి-హబ్‌ ప్రతినిధులు చైతన్య శ్రవణ, మహమ్మద్‌ హఫీజుద్దిన్‌, శ్రవణ ఏర్గల, ఎ .సిద్ధార్థ, బొల్లం కిరణ్‌, విశ్వవిద్యాలయ అధికారులు, బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -