– ఆరోసారి టైటిల్ భారత్ వశం
– ఫైనల్లో 100 పరుగులతో ఘన విజయం
– సూర్యవంశీ విధ్వంసక శతక జోరు
– ఐసీసీ అండర్-19 ప్రపంచకప్
యువ భారత్ సిక్సర్. వరుసగా ఆరోసారి టైటిల్ పోరులో తలపడిన టీమ్ ఇండియా.. ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌ను ఆరోసారి సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్‌పై భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
వైభవ్ సూర్యవంశీ (175) వీర బాదుడు బాదాడు. 80 బంతుల్లోనే 15 సిక్స్‌లు, 15 ఫోర్లతో విశ్వరూపం చూపించిన వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆయుశ్ (53), అభిజ్ఞాన్ (40), కనిష్క్ (37 నాటౌట్) మెరవటంతో యువ భారత్ తొలుత 411 పరుగుల రికార్డు స్కోరు చేసింది.
రికార్డు ఛేదనలో ఇంగ్లీశ్ బ్యాటర్ ఫాల్కోనర్ (115) అసమాన పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించటంతో 177/7తో ఓటమి లాంఛనం చేసుకున్న ఇంగ్లాండ్.. ఫాల్కోనర్ పోరాటంతో ఓటమి అంతరం తగ్గించుకుంది. 40.2 ఓవర్లలో ఇంగ్లాండ్ 311 పరుగులకే కుప్పకూలింది. వంద పరుగుల తేడాతో భారత్ అద్వితీయ విజయం అందుకుంది.
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్ ఆధిపత్యం సుస్పష్టం. ఏకంగా 11 పర్యాయాలు ఫైనల్లో ఆడిన మన కుర్రాళ్లు రికార్డు ఆరు సార్లు విజేతలుగా నిలిచారు. గత ఆరు ప్రపంచకప్ ఫైనల్స్‌లోనూ పోటీపడిన యువ భారత్.. జూనియర్ క్రికెట్ సర్క్యూట్‌లో తిరుగులేని శక్తిగా అవతరించింది.
హరారే (జింబాబ్వే):- కుర్రాళ్లు కుమ్మేశారు. బ్యాట్‌తో, బంతితో ఇంగ్లాండ్‌ను ఇరగదీశారు. అన్ని రంగాల్లోనూ అసమాన ప్రదర్శనతో రాణించిన యువ భారత్ ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. శుక్రవారం హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన టైటిల్ పోరులో ఇంగ్లాండ్-19పై యువ భారత్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 412 పరుగుల రికార్డు ఛేదనలో ఇంగ్లాండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకే చేతులెత్తేసింది. కాలెబ్ ఫాల్కోనర్ (115, 67 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లు) ధనాధన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ బెన్ డాకిన్స్ (66, 56 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), బెన్ మేయస్ (45, 28 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-19 నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగులు చేసింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (175, 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్‌తో వీరవిహారం చేశాడు. ఆయుశ్ మాత్రె (53, 51 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), అభిజ్ఞాన్ కుందు (40, 31 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్‌స), కనిష్క్ చౌహాన్ (37 నాటౌట్, 20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అసమాన ఇన్నింగ్స్‌తో కదం తొక్కిన వైభవ్ సూర్యవంశీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందుకున్నాడు. కెప్టెన్ ఆయుశ్ మాత్రె ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ ట్రోఫీ అందుకోవటంతో భారత శిబిరంలో సంబురాలు అంబరాన్నంటాయి.
సూర్యవంశీ అదరహో
వైభవ్ సూర్యవంశీ (175) ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికారేశాడు. ఆఫ్‌సైడ్ బౌండరీలతో పరుగుల వేట మొదలెట్టిన సూర్యవంశీ.. లెగ్‌సైడ్ సిక్సర్‌తో సునామీకి శ్రీకారం చుట్టాడు. 15 ఫోర్లు, 15 సిక్సర్లతో కేవలం బౌండరీల రూపంలోనే 30 బంతుల్లో 150 పరుగులు పిండుకున్నాడు. యూత్ వన్డేల్లో బౌండరీల రూపంలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ సూర్యవంశీ రికార్డు నెలకొల్పాడు. 32 బంతుల్లో అర్థ సెంచరీ, 55 బంతుల్లో సెంచరీ సాధించిన వైభవ్.. 71 బంతుల్లో 150 మైలురాయి అందుకున్నాడు. సూర్యవంశీ మెరుపులతో భారత్ ఇన్నింగ్స్ రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్లింది. ఓపెనర్ అరోన్ జార్జ్ (9) నిరాశపరిచినా.. కెప్టెన్ ఆయుశ్ మాత్రె (53), వేదాంత్ త్రివేది (32)తో కలిసి సూర్యవంశీ భారీ భాగస్వామ్యాలు నమోదు చేశాడు. సూర్యవంశీ అవుటయ్యే సరికి భారత్ 25.3 ఓవర్లలో 251/3తో నిలిచింది. ఆ తర్వాత వేగం తగ్గినా.. భారత్ 411 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిజ్ఞాన్ కుందు (40), అంబ్రిశ్ (18), కనిష్క్ చౌహాన్ (37 నాటౌట్) ఆఖర్లో రాణించారు.
ఫాల్కోనర్ పోరాినా
రికార్డు ఛేదనలో ఇంగ్లాండ్ చతికిల పడింది. భారత బౌలర్లు రాణించటంతో 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ టైటిల్‌పై ఆశలు వదులుకుంది. టాప్ ఆర్డర్‌లో బెన్ డాకిన్స్ (66), మిడిల్ ఆర్డర్‌లో కాలెబ్ ఫాల్కోనర్ (115) రాణించినా.. ఇతర బ్యాటర్లు తేలిపోయారు. బెన్ మేయస్ (45), థామస్ (31) అంచనాలను అందుకోలేదు. 7 సిక్స్‌లు, 9 ఫోర్లతో మెరిసిన ఫాల్కోనర్.. 63 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఆఖర్లో సిక్సర్ల వర్షం కురిపించినా.. మరో ఎండ్ నుంచి సహకారం కొరవడింది. 40.2 ఓవర్లలోనే ఇంగ్లాండ్-19 కథ ముగిసింది. 2022 ప్రపంచకప్ ఫైనల్లోనూ భారత్ చేతిలో ఓడిన ఇంగ్లాండ్.. 2026లోనూ భారత్‌ను అధిగమించటంలో విఫలమైంది.
సంక్షిప్త స్కోరు వివరాలు
భారత్-19 ఇన్నింగ్స్ : 411/9 (వైభవ్ సూర్యవంశీ 175, ఆయుశ్ మాత్రె 53, అభిజ్ఞాన్ 40, జేమ్స్ మింటో 3/63)
ఇంగ్లాండ్-19 ఇన్నింగ్స్ : 311/10 ( ఫాల్కోనర్ 115, బెన్ డాకిన్స్ 66, అంబ్రిశ్ 3/56, కనిష్క్ చౌహాన్ 2/63)



