– ‘సర్’పై తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపాటు
– నవంబర్ 2న అఖిలపక్ష సమావేశానికి పిలుపు
చెన్నై : ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్) ద్వారా లక్షలాది ఓటర్లను తొలగించాలని బీజేపీ కుట్ర పన్నుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఆరోపించారు. దీనిపై తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు నవంబర్ 2న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. మామళ్లపురంలో జరిగిన పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ కార్మికులు, ఎస్సీలు, మైనారిటీలు, మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి ఓట్లను తొలగించడం ద్వారా ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ, అన్నా డీఏంకే ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. ‘ప్రజల వద్దకు వెళ్లే ధైర్యం వారికి లేదు. మన పక్షాన నిలబడే వారి ఓట్లను తొలగించాలని వారి ఆలోచన. అయితే ఇందుకు తమిళనాడు అనుమతించదు’ అని అన్నారు. ఇలాంటి ప్రక్రియను చేపట్టి బీహార్‌లో ఎన్నికల కమిషన్ 65 లక్షల మంది ఓటర్ల హక్కులను నిరాకరించిందని ఆయన గుర్తు చేశారు.
రాబోయే శాసనసభ ఎన్నికలను సాటి లేని సమర్ధ పాలనను అందిస్తున్న డీఎంకేకు, ఢిల్లీ ముందు మోకరిల్లిన బానిసలకు మధ్య జరుగుతున్న పోరుగా స్టాలిన్ అభివర్ణించారు. తమిళనాడు ఆత్మ గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడేందుకు పోరు జరగబోతోందని చెప్పారు. రాష్ట్ర సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక నిర్మాణం దాడిని ఎదుర్కోబోతోందని హెచ్చరించారు. హిందీ, సంస్కృతం, జీఎస్టీ, గవర్నర్ రూపంలో తమను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. వారిని ఓడించే సత్తా తమకు మాత్రమే ఉన్నదని, ఆర్‌ఎస్‌ఎస్ కుట్రలు ఇక్కడ సాగవని చెప్పారు. డీఏంకే బలమేమిటో బీజేపీకి తెలుసునని, అందుకే తమను ఇబ్బంది పెట్టడానికి కొత్త దారులు వెతుకుతోందని అన్నారు. ‘ఎన్నికల కమిషన్ సర్‌ను ప్రకటించి దానితో మనల్ని బెదిరించాలని ప్రయత్నిస్తోంది. కానీ మేము తలవంచే ప్రసక్తే లేదు. శాసనసభ ఎన్నికలు బీజేపీ-అన్నా డీఎంకే కూటమి నుంచి రాష్ట్రాన్ని కాపాడతాయి’ అని స్టాలిన్ చెప్పారు.
ఈసీ అనుమానాస్పద ప్రవర్తన
ఎన్నికల కమిషన్ అనుమానాస్పదంగా, విచిత్రంగా వ్యవహరిస్తోందని డీఎంకే, దాని మిత్రపక్షాలైన కాంగ్రెస్, సీపీఐ (ఎం), సీపీఐ, ఎండీఎంకే ఒక సంయుక్త ప్రకటనలో విమర్శించాయి. బీహార్ ఉదంతాన్ని అవి ఉదహరిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్కడ లక్షలాది అర్హులైన ఓటర్లను జాబితాల నుంచి తొలగించారని తెలిపాయి. తమిళనాడులో కూడా అలాంటి అప్రజాస్వామిక కుట్ర జరుగుతోందని ఆరోపించాయి. ఇదిలావుండగా సర్ ప్రక్రియపై చర్చించేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అర్చన పట్నాయక్ బుధవారం గుర్తింపు పొందిన పార్టీలతో సమావేశాన్ని నిర్వహించారు.
తొలగింపులతో గెలవాలని అనుకుంటున్నారు
- Advertisement -
- Advertisement -


