నీటి గుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి
నాగర్‌కర్నూల్ జిల్లా ముచ్చర్లపల్లిలో ఘటన
నవతెలంగాణ – ఊరుకొండ
వ్యవసాయ భూమిలో ఆడుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటి గుంటలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతిచెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. చిన్ననాటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన మాదు శ్రీకాంత్ రెడ్డి.. తల్లి మాదు సరస్వతమ్మ అనారోగ్యంతో ఉండటంతో అతని అక్క తన భర్త, పిల్లలతో కలిసి గ్రామానికి వచ్చింది. ఈ నేపథ్యంలో పిల్లలంతా కలవడంతో శ్రీకాంత్‌రెడ్డి, రజిని దంపతుల ఇద్దరు పిల్లలు సిరి(14), శ్రీమాన్యు(12), శ్రీకాంత్ రెడ్డి అక్క రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామానికి చెందిన వనజ, ప్రభాకర్ రెడ్డి దంపతుల కూతురు స్నేహ(17), శ్రీకాంత్‌రెడ్డి అన్న కూతురు విద్యాదరి.. కలిసి ఆడుకునేందుకు వారి వ్యవసాయ పొలానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు ఒకరు నీటి గుంటలో పడటంతో వారిని రక్షించేందుకు మరొకరు.. అలా నలుగురూ గుంటలో పడ్డారు. సిరి, శ్రీమాన్యు, స్నేహ నీటి గుంటలో మునిగిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందారు. విద్యాదరి.. ఒక చెట్టును పట్టుకొని ప్రాణాలతో బయటపడింది. తన కజిన్స్ చనిపోవడం ప్రత్యక్షంగా చూసిన విద్యాదరి.. ఉబికి వస్తున్న కన్నీటితో జరిగిన ఘటనను వివరించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్‌ఐ కష్ణదేవ, పోలీస్ సిబ్బంది.. మృతదేహాలను ఓ ప్రయివేట్ వాహనంలో కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు సాగునీటి గుంటలో పడి మృతిచెందిన చిన్నారుల మృతి పట్ల జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే హుటాహుటిన కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం నింపారు. గ్రామాల్లో ఉన్న ప్రమాదకర గుంతలు, బావులు, చెరువుల వద్ద తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఆడుకునేందుకు వెళ్లి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



