Friday, November 7, 2025
E-PAPER
Homeఆటలుగోల్డ్‌కోస్ట్‌లో తిప్పేశారు

గోల్డ్‌కోస్ట్‌లో తిప్పేశారు

- Advertisement -

168 ఛేదనలో ఆసీస్‌ 199 ఆలౌట్‌
48 పరుగులతో భారత్‌ ఘన విజయం
అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌, వరుణ్‌ మాయాజాలం

గోల్డ్‌కోస్ట్‌ (ఆస్ట్రేలియా) : గోల్డ్‌కోస్ట్‌లో భారత స్పిన్నర్లు మాయాజాలం సృష్టించారు. ఛేదనలో 67/1తో గెలుపు దిశగా సాగుతున్న ఆతిథ్య కంగారూలను స్పిన్‌ వలలో పడేశారు. 18.2 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూల్చి నాల్గో టీ20లో 48 పరుగుల తేడాతో భారత్‌కు ఘన విజయాన్ని కట్టబెట్టారు. వాషింగ్టన్‌ సుందర్‌ (3/3), అక్షర్‌ పటేల్‌ (2/20), వరుణ్‌ చక్రవర్తి (1/26) మాయ ముంగిట కంగారూ బ్యాటర్లు తేలిపోయారు. కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (30, 24 బంతుల్లో 4 ఫోర్లు), మాథ్యూ షార్ట్‌ (25, 19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (46, 39 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), అభిషేక్‌ శర్మ (28, 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), శివం దూబె (22), సూర్యకుమార్‌ యాదవ్‌ (20), అక్షర్‌ పటేల్‌ (21 నాటౌట్‌) రాణించారు. స్పిన్‌ త్రయం మాయతో నాల్గో టీ20లో గెలుపొందిన భారత్‌.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. సిరీస్‌లో ఆఖరు మ్యాచ్‌ శనివారం బ్రిస్బేన్‌లో జరుగనుంది. ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

స్పిన్‌ మాయాజాలం
168 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియా ఓ దశలో 67/1తో పటిష్టంగా కనిపించింది. ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌ (30), మాథ్యూ షార్ట్‌ (25) తొలి వికెట్‌కు ధనాధన్‌ ఆరంభాన్ని అందించారు. పవర్‌ప్లేలోనే బంతి అందుకున్న అక్షర్‌ పటేల్‌.. మాథ్యూ షార్ట్‌ వికెట్‌తో భారత్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. జోరుమీదున్న జోశ్‌ ఇంగ్లిశ్‌ (12) సైతం అక్షర్‌ మాయలో పడినా.. ఆసీస్‌ దూకుడు తగ్గలేదు. ఈ సమయంలో శివం దూబె వరుస వికెట్లతో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ మెరుపు క్యాచ్‌తో మిచెల్‌ మార్ష్‌ నిష్క్రమించగా..ఓ సిక్స్‌, ఫోర్‌తో దూకుడుమీదున్న టిమ్‌ డెవిడ్‌ (14) సైతం దూబె ఓవర్లో అవుటయ్యాడు. 11.3 ఓవర్లలో 91/4తో కష్టాల్లో కూరుకున్న ఆసీస్‌ను వాషింగ్టన్‌ సుందర్‌, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రాలు కోలుకోనివ్వలేదు. జోశ్‌ ఫిలిప్‌ (10), మార్కస్‌ స్టోయినిస్‌ (17), మాక్స్‌వెల్‌ (2), బెన్‌ (5), జేవియర్‌ (0), జంపా (0)లు భారత బౌలర్లకు దాసోహం అయ్యారు. 8 బంతుల్లో 3 పరుగులకు 3 వికెట్లు పడగొట్టిన వాషింగ్టస్‌ తోక కత్తిరించాడు.

రాణించిన గిల్‌
తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (28), శుభ్‌మన్‌ గిల్‌ (46) తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించి శుభారంభం అందించారు. జంపా ఓవర్లో అభిషేక్‌ నిష్క్రమించినా.. శివం దూబె (22), సూర్యకుమార్‌ యాదవ్‌ (20) దూకుడుగా ఆడారు. సూర్య రెండు సిక్సర్లతో చెలరేగినా.. నిలకడ చూపించలేదు. మిడిల్‌ ఆర్డర్‌లో తిలక్‌ వర్మ (5), జితేశ్‌ శర్మ (3), వాషింగ్టన్‌ సుందర్‌ (12) నిరాశపరిచారు. అక్షర్‌ పటేల్‌ (21 నాటౌట్‌) ఆఖర్లో విలువైన పరుగులు జోడించాడు. ఆసీస్‌ బౌలర్లలో ఆడం జంపా (3/45), నాథన్‌ ఎలిస్‌ (3/21) మూడేసి వికెట్లు పడగొట్టారు.

సంక్షిప్త స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌ : 167/8 (శుభ్‌మన్‌ గిల్‌ 46, అభిషేక్‌ శర్మ 28, నాథన్‌ ఎలిస్‌ 3/21, జంపా 3/45)
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ : 119/10 (మిచెల్‌ మార్ష్‌ 30, మాథ్యూ షార్ట్‌ 25, వాషింగ్టన్‌ సుందర్‌ 3/3, అక్షర్‌ పటేల్‌ 2/20)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -