Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంపాకిస్తాన్‌ మాటైతే వింటారు.. మాతో చర్చలకు మాత్రం ఒప్పుకోరు…

పాకిస్తాన్‌ మాటైతే వింటారు.. మాతో చర్చలకు మాత్రం ఒప్పుకోరు…

- Advertisement -

– ఆపరేషన్‌ కగార్‌ అసలు ఉద్దేశం తెలుసుకోండి : ప్రజలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

పొరుగు దేశం పాకిస్తాన్‌ విజ్ఞప్తి మేరకు కాల్పుల విరమణకు అంగీకరించిన కేంద్రం.. తమతో శాంతి చర్చలకు మాత్రం ఒప్పుకోవటం లేదని కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మావోయిస్ట్‌) ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేసింది. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో జరుగుతున్న ఊచకోత వెనకున్న ప్రభుత్వ అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ పేరిట మావోయిస్టులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా అది సోమవారం సామాజిక మాధ్యమాల ద్వారా బయటకొచ్చింది. మన దేశాన్ని, మన సంపదను, ఇక్కడి పర్యావరణాన్ని కాపాడటానికి తమ ప్రాణాలను త్యాగం చేసే నిజమైన దేశభక్తుల భావజాలానికి, అలాంటి రాజకీయాలకు మద్దతునివ్వాలంటూ మావోయిస్టు పార్టీ ఆ లేఖలో ప్రజలను కోరింది. ఈ క్రతువులో అమరులైన వీరులకు వందనమని పేర్కొంది. దేశాన్ని, దాని ఆస్తులను అమ్మేస్తున్న వారికి వ్యతిరేకంగా సంఘటితమవ్వాలని పిలుపునిచ్చింది. పాకిస్తాన్‌తో కాల్పుల విరమణకు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం, మనదేశంలో శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామంటూ తాము చేసిన విజ్ఞప్తులను ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించింది. ఈ క్రమంలో వందలాది అమాయక గిరిజనులను, విప్లవకారులను హత్య చేసేందుకు వీలుగా ప్రణాళికను అమలు చేస్తోందని పేర్కొంది. ఇలా ఎందుకు జరుగుతోందని నిలదీసింది. పాకిస్తాన్‌తో కాల్పుల విమరణ అంశంపై మోడీ నోరు మూయించిన శక్తి ఏది? ఇప్పుడు మళ్లీ దేశంలో దేని కోసం తిరంగ యాత్రను నిర్వహిస్తున్నారు? ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కాదా? అని ప్రశ్నించింది. ఇలా చెప్పడమంటే తాము పాకిస్తాన్‌తో యుద్ధం కోరుకుంటున్నామని కాదు.. దేశంలో అధికారంలో ఉన్న వ్యక్తులు, పెద్ద పెద్ద కార్పొరేట్లు, సామ్రాజ్యవాదుల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవాలని సూచించటానికేనని మావోయిస్టు పార్టీ తెలిపింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad