జుట్టుపోలుగాడు : కుక్కో కుక్కో కుక్కా… నువ్ యంత్రపు బొమ్మవు కుక్కా… యంత్రపు బొమ్మవు కుక్కా… నువ్ భలే చిత్రాలు వేసేవు కుక్కా…
కేతిగాడు : ఏందిరా ఆ పాటేంది. ఆ డాన్స్ ఏంది?
జుట్టు : యస్. యంత్రం కుక్క. రోబో డాగ్. అచ్చం కుక్కలాగే మనతో ముచ్చట్లాడుద్ది. మన మధ్యనే తచ్చాడుద్ది. ఏ పని చెప్తే ఆ పని చేసుద్ది. డిల్లీ ఎ.ఐ.సమ్మిట్‌లో ఎలా హల్ చల్ చేసిందో చూడ్లేదా..?
కేతిగాడు : చూడకే.. దాని బాగోతం అంతా ప్రపంచానికే తెలిసిపోయింది.
జుట్టుపోలిగాడు : ఏం బాగోతం?
కేతిగాడు : నీవు చెప్పిన రోబోడాగ్‌ను మా గల్గోటియా యూనివర్సిటీ విద్యార్థులే తయారు చేశారని, దాని పేరు ‘ఒరియన్’ అని చాలా గొప్పగా ఆ యూనివర్సిటీ ప్రొఫెసరే చెప్పాడు. వెంటనే అది కాస్త వైరల్ అయింది. ఒకతను నెట్‌లోకి వెళ్లి చెక్ చేస్తే.. అది ఇండియా తయారీ కాదు. చైనా తయారీ, యునైట్రీ రోబోటెక్ అని తేలిపోయింది. మళ్లీ అంతే స్పీడుగా తిరిగి వైరల్ అయింది. చైనా నుండి కొనుగోలు చేసిన రోబోడాగ్‌ను తమదిగా ఘనత వహించిన గల్గోటియా యూనివర్సిటీ చెప్పుకోవడంతో దేశం పరువంతా గోవిందా… గోవిందా…
జుట్టు పోలుగాడు : అదిగో అదే నేను మొత్తుకునేది. ఎవడో ఏదో చేస్తే అది దేశానికి, ప్రధాని మోడీకి అంటగడ్తావేంటి?
కేతిగాడు : అరె, నేనటం కాదురా. నెటిజన్లే అంటున్నారు. ఆ గోలపడలేక ఆ గల్గోటియా యూనివర్సిటీని సమ్మిట్ నుండి బహిష్కరించారు తెలుసా…
బంగారక్క (ప్రవేశం) : అరె జట్టుపోలుగా.. నీ వుడుకుమోత్తనం కాసేపు ఆపుకో. ఇంకా ఈ సమ్మిట్ లీలలు చాలా వున్నాయి. చెప్తా వినండి.
1. సమ్మిట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవాల్సిన మైక్రోసాఫ్ట్ వ్వవస్థాపకుడు బిల్‌గేట్స్ కీనోట్ అడ్రస్ ఇవ్వాలి. కానీ ఆయన గైర్హాజరు. ఇంటర్నేషనల్ క్రిమినల్ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బిల్‌గేట్స్ పేరుండటం.. దాంతో సమ్మిట్ వెబ్‌సైట్ నుండి ఆయన పేరును తొలగించడం.. అంతా గందరగోళంగా మారింది.
2. పేరుకు ఎ.ఐ.సమ్మిట్. కానీ అక్కడ ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేదు. దాంతో డిజిటల్ పేమెంట్స్ సరిగా జరగలా… చాలామంది క్యాషే సర్దుబాటు చేయాల్సి వచ్చింది.
3. ప్రధాని మోడీ హాజరవుతున్నారని సమ్మిట్‌కు హాజరైన ప్రతినిధులను, ఎగ్జిబిటర్లను భద్రతా తనిఖీ పేరుతో అర్థంతరంగా ఖాళీ చేయించడంతో తిండీతిప్పలు లేక వాళ్లు గంటల సేపు అలా బయటే నిరీక్షించాల్సి వచ్చింది.
4. ఇక ప్రధాని మోడీ ప్రముఖ సంస్థల అధినేతలతో అభివాదం చేయడం కొందిరికి ఇష్టమై, కొందరికి ఇష్టంకాక చేతులు కలపడంతో ఇబ్బంది పడ్డారు. అది కూడా వైరల్ అయింది. చివరకు ఐ.టి.మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్వహణ లోపాలపై బహిరంగ క్షమాపణ చెప్పడంతో కథ ఆ మాత్రం సుఖాంతమైంది.
జుట్టుపోలుగాడు : ఏది ఏమైనా ఎ.ఐ.లో భారత్ సాధించిన విజయాలు చూసి ప్రపంచమే నివ్వెరపోతుందని మోడీ చెప్పారు తెలుసా. అసలు ఇండియా ఎ.ఐ.సమ్మిటే ఓ టర్నింగ్ పాయింట్ అన్నాడు. మరిచారా… హు.
బంగారక్క : అవును, టర్నింగ్ పాయింటే. ఫ్రాన్స్, బెజిల్, భూటాన్, స్విట్జర్లాండ్ వంటి దేశాధినేతలు. ఎ.ఐ.సంస్థల కుబేరులు హాజరయ్యారు. కళ్లకు కడుతున్న భవిష్యత్ ప్రమాదాన్ని కొందరు పరిశీలకులు హెచ్చరిస్తున్నారు కూడా.
ఇద్దరూ : ప్రమాదమా… ఏంటది?
బంగారక్క : సమాజ గమనాన్ని తీవ్రతరం చేసే ఎ.ఐ.వ్యవస్థ గుప్పెడు మంది కుబేరుల చేతుల్లో బందీ కాబోతుంది. ఫలితంగా ఆర్థిక అంతరాలు మరింత తీవ్రమౌతాయి. ఇప్పటికే సైబర్ క్రైమ్ పెచ్చుమీరిపోయింది. డిజిటల్ మోసాలను ఆపలేక ప్రధాని మోడీ వంటి వారే చేతులెత్తేస్తున్నారు. ఆర్థిక మోసాలపట్ల అప్రమత్తంగా వుండమని ప్రజలనే ఆయన హెచ్చరిస్తున్నారు. ఏది అసలో, ఏది నకలో తేడా లేకుండా పోతుంది. గోప్యత గల్లంతు అవుతుంది. తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని అవుతుంది. దొంగలు దొరలైపోతారు. దొరలు దొంగలవుతారు. అంతా కలగాపులగం, భయంకర గందరగోళం.
కేతిగాడు : అమ్మీ, నీవు చెప్తున్నదంతా ఇప్పుడే జరుగుతుందిగా.
బంగారక్క : అవును, తొండముదిరి ఊసరవెల్లి అవుతుంది. పారిశ్రామిక విప్లవాన్ని చేజిక్కించున్న ఇంగ్లాండు, ఐరోపాదేశాలు కొన్ని 19, 20 శతాబ్దాల్లో ఇతర దేశాలను వలస దేశాలుగా మార్చుకుని సామ్రాజ్యవాద దేశాలుగా ఎదిగాయన్న చరిత్రను మనం మరిచిపోకూడదు. వలస దేశాల సంపదను, శ్రమను కొల్లగొట్టడంతో అవి చాలా మటుకు కోలుకోలేని స్థితికి నెట్టబడ్డాయి. సంపద కొంతమంది కుబేరులు గుప్పెట్లోకి చేరడమంటే సామ్రాజ్యవాద క్రూరమైన దోపిడీకి మళ్లీ మళ్లీ తెర తీయడమే. ఆ సంపన్నులకు మిగిలిన దేశాలు బానిస దేశాలుగా మారిపోతాయి. ఆధిపత్యం ఓ వైపు, విముక్తి మరో వైపుగా యుద్ధాలు జరుగుతాయి. ఎ.ఐ. ప్రజల పరంకాగా కేవలం సంపన్నుల పరం అయితే జరిగే ప్రమాదం ఇదే మరి!
– కె.శాంతారావు, 9959745723



