Sunday, October 5, 2025
E-PAPER
Homeసోపతిఒక్క క్షణం ఆలోచించండి..!

ఒక్క క్షణం ఆలోచించండి..!

- Advertisement -

సృష్టిలో ఏ జీవికిలేని ప్రత్యేకత మనిషికి మాత్రమే కల్పించబడింది. పుట్టినప్పటి నుండి మొదలుకుంటే చనిపోయేంత వరకు అందమైన జీవితాన్ని మనిషి దశలవారీగా ఆస్వాదించాల్సి వుంటుంది. బాల్యం, కౌమారం, వయోజన దశ, వద్ధాప్యం, మొదలైన దశలతో తన జీవిత ప్రస్థానాన్ని కొనసాగిస్తాడు. ఇందులో ఏ దశలో వుండే ఆనందాలు, అనుభూతులు, సంఘర్షణలు ఆ దశలోనే ఉంటాయనే విషయం మనందరికి తెలిసినదే. కాబట్టి కాలాన్ని అనుసరిస్తూ కాల ప్రవాహంలో కొట్టుకొనిపోకుండా మనం జీవించిన కాలంలో కొన్ని ముద్రలు ఉండేలా జీవించాలి.

ప్రణాళికబద్దమైన కార్యాచరణ రూపొందించుకొని దానికనుగుణమైన విధానాల ద్వారా దశల వారి జీవితాన్ని ఆనందమయం చేసుకొని మనపై ఆధారపడిన వారిని, స్వయంగా మనం కూడా మన జీవితాన్ని రంగులమయం చేసుకోవాలి. అంతేకాని అంత మాత్రానికే కుంగుబాటుకు గురైతే ఎలా? మీరు బాల్యంలో సైకిల్‌ నేర్చుకునే క్రమంలో కింద పడకుండానే నేర్చుకున్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి? జీవిత ప్రయాణంలో గెలుపోటములు సహజం. అంత మాత్రానికే దిగులుపడితే ఎలా? ఓటమి చెందని మనిషి ఈ ప్రపంచంలో ఎవరైనా వున్నారా? గెలిచిన ప్రతివారిని అడిగి చూడండి… వారి గెలుపుకు విజయ సూత్రాలేమిటో పుఠలు పుఠలుగా చెప్తారు.

గెలుపు అంత సులువుగా లభించదు. కాబట్టి ఓటమిని ఓ చిన్న అనుభవంగా స్వీకరించండి. ఆ ప్రయత్నంలో మీరు చేసిన లోపాలను సవరించుకొని మళ్లీ మళ్లీ ప్రయత్నం చేయండి. తప్పక గెలుపు పిలుపు వినిపిస్తుంది. అంతేకాని డిప్రెషన్‌, కుంగుబాటుకు, నిరాశకు గురికావొద్దు. ఇక్కడ ఓ చిన్న కథ మీలాంటి వారి కోసమే చదవండి. ఒక రోజు ఒక యువకుడు సోక్రటీస్‌ దగ్గరికి వచ్చి గురువు గారు నా జీవితంలో అన్నీ కష్టాలు కన్నీళ్ళే. ఈ జీవితాన్ని భరించలేకపోతున్నాను. ఇక నాకు చావే శరణ్యం. దయచేసి ఓ మంచి సలహా ఇచ్చి నా జీవితాన్ని నిలబెట్టమని ప్రాధేయపడతాడు. గురువు వెంటనే తన వైపు తదేకంగా చూసి సరే నాయనా రేపు వచ్చేటప్పుడు ఒక గ్లాసెడు నీటిలో పిడికెడు ఉప్పు వేసుకొని తీసుకొనిరా అంటాడు. గురువు చెప్పిన ప్రకారం మరుసటి రోజు గురువు దగ్గరికి ఉప్పు కలిపిన మంచినీళ్ళు తీసుకొని వస్తాడు. గురువు ఆ గ్లాసును తీసుకొని బాగా ఊపి శిష్యుడికి ఇచ్చి తాగమని ఆదేశిస్తాడు.

సరేనని గురువు వైపు చూస్తు ఆ గ్లాసును తీసుకొని రెండు గుటకలు వేసి ఛీ భరించలేనంత ఉప్పుగా ఉన్నాయి, ఎలా తాగుతాం వీటిని అంటాడు. వెంటనే గురువు అదే పిడికెడు ఉప్పును తీసుకొని శిష్యుడితో ఊరి బయట వున్న చెరువు వద్దకు వెళతాడు. తన చేతిలో వున్న ఆ ఉప్పును చెరువులో కలిపి ఇప్పుడు శిష్యుడిని మళ్ళీ నీళ్ళు తాగమని చెప్తాడు. వెంటనే ఆ నీటిని తన దాహం తీరేంతవరకు తాగుతాడు. అప్పుడు గురువు శిష్యుడిని గ్లాసులో వున్న నీరు బాగున్నాయా? చెరువులో వున్న నీరు బాగున్నాయా? అని అడుగుతాడు. దానికి శిష్యుడు గ్లాసులో వున్న నీరు ఉప్పుగా, చెరువులోని నీరు తియ్యగా వున్నారు. పిడికెడు ఉప్పు గ్లాసెడు నీటిని ఉప్పగా చేసింది. చెరువులో ఎక్కువ నీరు వుండడం వల్ల పిడికెడు ఉప్పు తన ప్రభావాన్ని చూపించలేకపోయింది అంటాడు. అప్పుడు గురువు శిష్యుడితో జీవితంలో సమస్యలు పిడికెడు ఉప్పు లాంటివి. జీవితాన్ని నువ్వు గ్లాసెడు నీటిలా చూడాలా చెరువు నీటిలా చూడాలా అనేది నీ ఆలోచనలపై ఆధారపడి వుంటుంది. అలాగే నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టి కూడా వుంటుంది అంటాడు.

జీవితంలో కష్టాలు ఎప్పటికి మన వెన్నంటే ఉంటారు. కష్టం దరిచేరని జీవి ప్రపంచంలో ఏదీ ఉండదు. మనిషి వాటిని వ్యక్తం చేయగలడు. మిగతా జీవులు వ్యక్తం చేయలేవు. ప్రకతిలో నివసించే ఏ జీవి ఐనా మనుగడ కోసం తనను తాను రక్షించుకోవాలి, రెండవది బతకటం కోసం ఆహారాన్ని అన్వేషించుకోవాలి. మనిషికి రెండవది చాలా సులభమైనప్పటికి కష్టంగా భావిస్తాడు. అందుకే సమస్యలు, కష్టాలు చూసే దక్పధంను బట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. శిశువుగా వున్నప్పుడు తల్లిపాలతో పొట్ట నిండితే, పెద్దైన తర్వాత శరీరానికి కావలసిన ఆహారం తీసుకోవలసి వుంటుంది. అలా పెరుగుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లు మారుతున్నట్లుగానే జీవనశైలి, దక్పధాలు, ఆలోచనలు మారుతూ ఉంటారు. ఫలితంగా సంఘర్షణ ఏర్పడుతుంది. దీనిని సమన్వయం చేసుకోగలిగితే సమస్యల నుండి తేలికగా బయటపడతారు. సమన్వయము కోల్పోతే ఆలోచనలు అదుపుతప్పుతాయి ఫలితంగా ఆత్మహత్యా, డ్రగ్స్‌ లాంటి ఆలోచనలు దరి చేరతాయి. అందుకే మీ సహనం నీళ్ళ గ్లాసులా సంకుచితంగా కాకుండా చెరువులాగా విస్తారంగా వుంటే సమస్యలు పెద్దవిగా కాకుండా చిన్నగా కనిపిస్తాయి. కాబట్టి సమస్యను చిన్న గ్లాసులో బంధించకూడదు. విశాలమైన ప్రపంచంలో మీ ఆలోచనలు, వైఖరులు విశాలంగా తెరుచుకొని వుండాలి.

అలాంటి వారు ఎప్పటికప్పుడు చెరువులోని నీరులా తియ్యగా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటారు. మీ శరీరం హార్డ్‌వేర్‌ ఐతే మీ మెదడు సాఫ్ట్వేర్‌ లాంటిది. మీ శరీరం మొత్తానికి మీ మెదడే కేంద్ర బిందువు. మెదడు ఎలాంటి ఆదేశాలిస్తే వాటిని కళ్లు, చేతులు, కాళ్ళ ద్వారా చేస్తారు. కాబట్టి మీ మెదడును ఎప్పటికప్పుడు నియంత్రణలో వుంచుకుంటే శరీరం మొత్తం అదుపులో ఉంటుంది. రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణం మానుకోలేం కదా. జీవితం కూడా అంతే ఎప్పటికప్పుడు కొత్త సవాళ్ళను, సమస్యలను ముందుంచుతుంది. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళితే రంగురంగుల ప్రపంచం మీ ముందుంటుంది. భయపడితే మీ ఎదురుగా వున్న వానపాము కూడా అనకొండలా లాంటి మింగేస్తున్నట్లు వుంటుంది. పెనుగాలి వీసున్నప్పుడు వక్షానికి వున్న ఆకులు తన బలాన్నంతా కూడ దీసుకొని ఆ వక్షం కొమ్మకు అంటి పెట్టుకొని వుంటాయి. అవే ఆకులు శిశిర రుతువు రాగానే వాటంతట అవే రాలిపోతాయి. ఇక్కడ సమస్యలు కూడా పెనుగాలి లాంటివే. అలాంటివి మీ జీవితంలో సహజం. వాటికి భయపడకూడదు.

అంతెందుకు నదీ ప్రవాహానికి ఏదైనా ఆటంకం వస్తే అది తన శక్తినంతా కూడ దీసుకొని అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తుంది. సాధ్యం కాకపోతే తన ప్రవాహ దిశను మార్చుకుంటుంది. కానీ తన ప్రయాణాన్ని మాత్రం ఆపదు. అది ఎన్ని అవాంతరాలైన ఎదుర్కొని చివరకు సముద్రాన్ని చేరుతుంది. మీరు కూడా నదిని ఆదర్శంగా తీసుకొని ముందుకు కదలాలి. మీ ప్రయాణంలో ఎన్ని అవాంతరాలెదురైనా ఆత్మ విశ్వాసంతో అదిగమిస్తూ ముందుకు కదలాలి. కానీ ప్రయాణాన్ని లక్ష్యం చేరేదాకా ఆపకూడదు. విమర్శలకు, వీధి కుక్కలకు భయపడితే గమ్యం కాదు కదా గుమ్మం కూడా దాటలేం. అలిసేంత వరకు ఆడితే అది ఆట. గెలిచేంత వరకు చేస్తే అది యుద్ధం. చచ్చేంత వరకు బతికితే అది జీవితం.

చచ్చిన తర్వాత బతికితే అది నీ మంచితనం. సమస్య వచ్చినప్పుడు భయపడకుండా పరిష్కార మార్గాలు వెతకండి. ఆలోచిస్తే దారులు కచ్చితంగా దొరుకుతాయి. భయపడితే సమస్య కొండలా పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. మీ ప్రయాణంలో ఎక్కడా సమస్య అనేది రాకుండానే ఇంత దూరం ప్రయాణించారా? మీరు రాసిన పరీక్షలు, ఎదుర్కొన్న ఇంటర్వూలు, పెట్టిన బిజినెస్‌… ఏదైనా కావొచ్చు. అందులో మీరు విజయం సాదించకపోవచ్చు. గెలవకపోవచ్చు. కానీ అసలైన జీవితం ఓటమి తర్వాతే ప్రారంభమవుతుందని తెల్సుకోవాలి. ఎందుకంటే గెలుపు మజా మొదటి ప్రయత్నంలోనే దొరికితే అది మీ ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసి ఉండొచ్చు. కానీ అందులో కిక్‌ ఉండదు. ఓటమి తర్వాత వచ్చే గెలుపులో మజా వుంటుంది. అప్పుడు చుట్టూవున్న పరిసరాలే మారిపొతాయి.

ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తే…
మనిషి నిరంతర సంఘర్షణ జీవి. ఈ ప్రపంచంలో సంఘర్షించని జీవి ఉండదు అని. దీనికి మనిషి మినహాయింపేమీ కాడు. కాబట్టి విజయమైనా, ఓటమైనా సమానంగా స్వీకరించే మానసిక పరిపక్వతను అవవర్చుకోవాలి. కానీ అందరికీ ఒకే రకమైన ఉద్వేగ పరిపక్వత, ఉద్వేగ స్థిరత్వం వుండదు. కాబట్టి నెగెటివ్‌ ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేయాలనేది అందరినీ తొలుస్తున్న ప్రశ్న. దానికి కొన్ని పరిష్కార మార్గాలు…
మిత్రులతో సమస్యలు పంచుకోండి
మీ వ్యక్తితం ఎలాంటిదో మీ మిత్రులకు తెలుస్తుంది. మిమ్మల్ని కష్టాల నుండి గట్టెక్కించేవాడే నిజమైన స్నేహితుడు. సమస్యల వంకతో లేని చెడు అలవాటత్లో మిమ్మల్ని చెడగొట్టి ఇంకాస్త అయోమయంలో పడేసేవాడు స్నేహితుడు కాదు.

పుస్తకాలు ధ్యానం, పర్యటనలు :-
ఏదైనా మానసిక సమస్యతో కుంగుబాటుకి గురైతే మీ మనసు సమతౌల్యంలో ఉంచుకోవడానికి యోగ, ధ్యానం సాధన చేయండి. చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించండి. వీటి ద్వారా మీరు తిరిగి రీచార్జ్‌ అవుతారు. నెగిటీవ్‌గా మాట్లాడే వ్యక్తుల నుండి, అలాంటి వాతావరణం నుండి దూరంగా ఉండండి. చరిత్రను ప్రభావితం చసిన వ్యక్తుల జీవితాలను, వ్యక్తిత్వ వికాస సూత్రాలను, వీలైతే అలాంటి వారిని కలవండి. ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లో వుండొద్దు. అది సమస్యను మరింత జటిలం చేస్తుంది. సమూహంలో ఉంటే పునరుత్తేజితులు అయ్యే సమాచారాన్ని పొందగలరు, తెల్సుకోగలరు. సమస్యల నుండి విముక్తులు కాగలరు.
(త్వరలో రాబోతున్న కెరీర్‌ గైడెన్స్‌ పుస్తకంలో నుండి)

డా||మహ్మద్‌ హసన్‌,
9908059234

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -