Sunday, January 11, 2026
E-PAPER
Homeకథతిరుకార్తికై

తిరుకార్తికై

- Advertisement -

ఇంకో రెండు రోజుల్లో తిరుకార్తికై రాబోతోంది. మారుంధువాజ్‌ కొండపై ఒక పెద్ద దీపం వెలుగులు విరజిమ్మనుంది. కోళుకట్టై (దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధమైన స్వీట్‌) మధురమైన సువాసన పట్టణమంతా వెదజల్లనుంది. సైకిల్‌ షాప్‌ వద్ద పాత టైర్లు అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. ఈ పండుగకు చోక్కపనై అనే ప్రత్యేక సంప్రదాయం ఉంది. ఇందులో తాటిచెట్టు కొమ్మలు, ఎండిన తాటాకులతో కూడిన ఒక పెద్ద గోని రాశిని ఆలయ ప్రాంగణంలో తగలబెడతారు. సేంతామిస్‌ ఉండే హాస్టల్‌, మన్నదేవన్‌ ఆలయం వెనుక ఉంది. ఈ ఆలయం కోవలం, ముమ్మూర్తిపురం మధ్య, కన్యాకుమారికి సమీపంలో ఉంటుంది.

సేంతామిస్‌ ని ఐదేళ్ల వయసులోనే తల్లి హాస్టల్‌లో చేర్పించింది. ముమ్మూర్తిపురం ప్రాథమిక పాఠశాలలో చదివిన తరువాత, ఆరో తరగతి కోసం సలైయూర్‌ సెకండరీ స్కూల్‌కి వెళ్లాడు. స్నానం చేయకుండా తలకు నూనె రుద్దుకోవడంతో, బక్కపల్చని తన శరీరం నల్లగా మెరుస్తూ ఉండేది. చేతికి దొరికిన కాగితంతో ముఖాన్ని తుడుచుకునేవాడు. నాలుగు రోజులుగా వేసుకున్న తెల్ల చొక్కా నుండి ఒకటే చెమట వాసన ముసురుకుంది. మేమంతా క్లాస్‌కి ప్యాంట్‌ వేసుకు వెళ్లేవాళ్లం. తానొక్కడే ట్రౌజర్‌ వేసుకునేవాడు. చెప్పులు అరిగిపోయి, ముళ్ళులతో నిండి ఉండేవి.
క్లాస్‌లో నా పక్కనే కూర్చుండేవాడు, అందువల్ల అతనితో స్నేహం చేయడం కొంచెం కష్టంగా అనిపించింది. ఒకరోజు అతని కళ్లలోకి తొంగి చూసినప్పుడుుతనలోని విషాదాన్ని, మరేదో కోరికను గమనించాను. స్కూల్‌ భోజనం కూడా హాస్టల్‌ భోజనంలానే ఉండేదిుఅతను ఎప్పుడూ అసంతప్తిగానే తినేవాడు. మా నాన్న తాగి వదిలేసిన మందు బాటిల్‌ను కడుక్కొని, దాంట్లోనే చేపల పులుసు తెచ్చుకునే అలవాటు ఉండేది. కొన్నిసార్లు, అమ్మ ఇచ్చిన రూపాయితో ఉరగాయల ప్యాకెట్‌ కొనుక్కొని తినేవాడిని. మధ్యాహ్న భోజన సమయంలో, మందు బాటిల్‌ను తెరిచి అన్నంలో చేపల పులుసు పోసుకునేవాడిని. కొద్దిగా అతనికి కూడా వడ్డించేవాడిని. అతను చిరునవ్వుతో, ఎన్నో రోజులుగా భోజనం చేయని వ్యక్తిలా ఆబగా, ఇష్టంగా తినేవాడు. అది నాకు కొత్తగా, వింతగా, ఆశ్చర్యంగా అనిపించేది. అతనుండే హాస్టల్‌ విదేశీ క్రైస్తవుల ఆర్థిక సహకారంతో నడిచేది. కాలక్రమంలో క్రైస్తవత్వం వైపు అతను ఆకర్షితుడు అవుతాడనే భావన కలిగింది.
స్కూల్‌ దగ్గర ఉన్న పిళ్లయ్యార్‌ ఆలయం ముందు, కొత్తగా పెళ్లయిన జంట అంబాసిడర్‌ కారులో వచ్చారు. ఒకతను కారు దిగి, పెళ్లికూతురు, పెళ్లికొడుకు చుట్టూ మూడు సార్లు కొబ్బరికాయతో ప్రదక్షిణలు చేసి, ఆలయం గేటు ముందు పగలగొట్టాడు. నేను పరుగెత్తుకుని వెళ్లి, కొబ్బరి ముక్కలను ఏరుకున్నాను.
‘అయ్యో! దిష్టి తీయడానికి కొట్టారు, తినకూడదు’ సేంతామిస్‌ గద్దించాడు.
మరోరోజు, ఎవరో పిళ్లయ్యార్‌ ఆలయం వద్ద కొబ్బరికాయ పగలగొడుతుంటే, సేంతామిస్‌ పరుగెత్తుకుంటూ వెళ్లి.. కొబ్బరి ముక్కలను ఏరుకున్నాడు.
మా హాస్టల్‌లో ఉండే రాజన్‌ అక్కడే నిలబడి నన్ను గమనించాడు. నేను కొబ్బరికాయ తినడం చూస్తే హాస్టల్‌ వార్డెన్‌కి చెప్పేస్తాడు. ‘వార్డెన్‌ కొట్టడాన్ని నేను తట్టుకోలేను. అందుకే ఇలా చేశాను. పైగా, అతను నీతో బైబిల్‌, యేసు గురించి మాట్లాడమని చెప్పాడు. కానీ నేను నీకు చెప్పలేదు,’ సేంతామిస్‌ అయోమయంగా చూశాడు.
కొబ్బరి ముక్కలను ఇద్దరం తిన్నాం.

ఒకసారి, సైన్స్‌ క్లాస్‌లో సేంతామిస్‌, రతినరాజ్‌ సార్‌, నేను కలిసి ఉన్నప్పుడు, సరదాగా మా ఇంటి దేవుడు సుదలైమదన్‌ గుడిలో మేకను బలి ఇచ్చి, అందరం కలిసి భోజనం చేశామని చెప్పాను.
‘నేను ఇప్పటివరకు మటన్‌ తినలేదు. దాని ఖరీదు ఎక్కువ, మా హాస్టల్‌లో చికెన్‌ మాత్రమే పెడతారు. మటన్‌ రుచి చూడాలని ఉంది,’ సేంతామిస్‌ ఆశగా, కోరికగా అన్నాడు.
‘నీకు క్రైస్తవ పరంపర ఉంది కదా? మా దేవుడికి నైవేద్యంగా సమర్పించిన ఆహారాన్ని తింటావా?’ అని అడుగుతూ%ౌ% నీకు గుర్తుందా? సుదలై మదన్‌ ఆలయంలో మేము మేక బలిచ్చాం. మా మామయ్య దేవకున్రు.. సుదలై మదన్‌ ఆలయంలో మరో మేక బలి ఇవ్వబోతున్నారు. మటన్‌ తెస్తాను, రుచి చూద్దువులే.
‘నాకు అలా కుదరదు, ఎవరైనా చూసి హాస్టల్‌ లో ఫిర్యాదు చేస్తే, సమస్య అవుతుంది. నువ్వే తీసుకురా!’ తన కన్నుల్లో మటన్‌ తినాలనే కోరిక హరివిల్లులా ప్రకాశించింది.
నేను సుదలైమదన్‌ ఆలయానికి వెళ్లి, మధ్యాహ్న బలిపూజ పూర్తైన తర్వాత, మటన్‌ కూరను అరటి, టేకు ఆకులలో చుట్టి తీసుకువచ్చాను. స్కూల్‌ వెనుక ఉన్న.. డేనియల్‌ కొబ్బరితోటలో నేను నిలబడి ఉండగా, కట్టెతో పొదలను కొట్టుకుంటూ సేంతామిస్‌ వచ్చాడు. కొబ్బరి చెట్లకు నీళ్లు వెళ్లడానికి తవ్విన మట్టిగడ్డపై కూర్చున్నాడు. మటన్‌ ముక్కను పట్టుకున్నప్పుడు, అప్పుడే పుట్టిన బిడ్డను తండ్రి చేతుల్లోకి తీసుకున్నంత తన్మయత్వాన్ని పొందాడు. పరిశీలనగా, వింతగా, ఆశ్చర్యంగా చూశాడు.
అతని ఎడమ దవడ నుండి ఎముక కొరికిన శబ్దం వినపడింది.
‘అరే, జాగ్రత్తగా తినుుఅందులో ఎముకలు ఉంటాయి.’
‘నీకు కూడా కావాలా? తీసుకో!’ ఆకును కాస్త ముందుకు చూపాడు.
కారం వల్ల అతని పెదాలు, నాలుక మండిపోయాయి. కొబ్బరి తోటకు నీళ్లు సరఫరా చేసే వాగులోంచి నీళ్లు తాగి, మళ్లీ తినడం మొదలెట్టాడు. అప్పటికే ఒక తరగతి ముగిసింది. గంట శబ్దం వినపడగానే, చేతులు కడుక్కొని స్కూల్‌ వైపు పరిగెత్తాము. మటన్‌ వాసన వస్తోందేమోనని సేంతామిస్‌ పదే పదే చేతుల వాసన చూసుకున్నాడు.
‘ఇసుకతో చేతులు కడిగినా మటన్‌ వాసన పోవట్లేదు. మేకజుట్టు వాసన మటన్‌ ముక్కల నుంచి పోవట్లేదు! ఎందుకు?’ సేంతామిస్‌ ఆశ్చర్యంగా అడిగాడు.
‘అదే మటన్‌ సహజమైన వాసన’ రాయిని తీసుకుని, థనుమాలయ నాదార్‌ మామిడి తోటలోని మామిడి చెట్టుపై విసిరాను. మామిడికాయ కిందపడి పగిలింది. దాన్ని సేంతామిస్‌కి ఇచ్చాను.
అతనికి ఎంతో ఇష్టమైన మామిడికాయను చూస్తూనే, మొహం ఒక్కసారిగా వికసించింది.
మామిడికాయల రుచి గురించి అతనికన్నా బాగా తెలిసినవారు మరేవ్వరూ లేరు. ముమ్మూర్తిపురం నుంచి సలైయూర్‌ దాకా అటవీ ప్రాంతంలో పెరిగే మామిడికాయల రుచుల తేడాలను ఇట్టే పసిగట్టగలడు. కొన్నిసార్లు, రోడ్డు పక్కనున్న చెట్ల నుండి లేదా అడవిలో పెరిగిన మామిడిపండ్లు, ఉసిరికాయలు హాస్టల్‌కి తీసుకువచ్చేవాడు. ముక్కలుగా కోసి, చిటికెడు ఉప్పు చల్లి తోటి విద్యార్థులతో పంచుకునేవాడు.
హాస్టల్‌ లో ఉన్న పిల్లల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కారాలు, కరసేవ్‌ (బేసన్‌, మిరియాలు ప్రధానమైన పదార్థాలతో తయారు చేసే చిరుతిండి), మురుక్కు (బియ్యం పిండి, మినప పిండి మిశ్రమంతో తయారైన పద్ధారం) వంటి స్వీట్స్‌, స్నాక్స్‌ తీసుకువచ్చేవారు.
సేంతామిస్‌ తల్లి సంవత్సరంలో ఒకసారి మాత్రమే హాస్టల్‌ కి వచ్చేది. ఏదీ తెచ్చేది కాదుబీ కేవలం స్కూల్‌కు వచ్చి%-% వెళ్తుండేది. ఆ రోజు మాత్రం సేంతామిస్‌ చేతిలో మైసూర్‌ పాక్‌ ముక్క కనిపించేది. హాస్టల్‌ విద్యార్థుల తల్లిదండ్రులు తెచ్చిన పిండి వంటకాలను వార్డెన్‌ జార్జ్‌ అందరికీ పంచేవాడు.
‘నీ తల్లి ఇక్కడకు రావడం లేదు. వచ్చినా ఏమీ కొనివ్వదు. కానీ మిగిలిన పిల్లలు తమ ఇంటి నుంచి ఏమైనా తెచ్చుకుంటే, నువ్వు చేతిని చాచి అమాయకంగా, ఆశగా అడిగి తింటావు,’ అంటూ సేంతామిస్‌ను జార్జ్‌ తిట్టేవాడు. సేంతామిస్‌ కళ్ళల్లో కన్నీళ్ల వర్షం ఊరేది, ఎవరూ చూడకూడదని నెమ్మదిగా తలవంచి తీసుకునేవాడు. వార్డెన్‌ వెళ్లిన వెంటనే పక్కనున్న విద్యార్థికి మౌనంగా ఇచ్చేవాడు.
హాస్టల్‌ బయట ఉన్న దఢమైన చింతచెట్టు కొమ్మకు లోలకంలా ఊగుతూ, ఉత్తరం వైపు చూస్తూ ఏడ్చేవాడు. అతని కన్నీళ్లు ఎవరి చూపులకూ అందేవి కావు. రోడ్లకు ఇరువైపులా ఉన్న మామిడిపండ్లు, ఉసిరికాయలు, జామకాయలు దొంగతనం చేసి, హాస్టల్‌ విద్యార్థులతో పంచుకోవడానికి అదే కారణమై ఉండచ్చు.
సేంతామిస్‌ మూత్రవిసర్జన కోసం హాస్టల్‌ నుండి బయటకు వెళ్లాడు. గన్నేరు, చింతచెట్లుు చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ఆక్రమించి ఉన్నాయి. కార్తీకమాసం కావడంతో, తెల్లవారుజామునే నేలంతా మంచు తుప్పటి పరుచుకుంది. రెండు అడుగుల పొడవున్న లేత ఆకుపచ్చ మొక్కపై మంచుముద్దలు ముత్యాల్లా మెరుస్తున్నాయి. హఠాత్తుగా, సుడిగాలిలా ఎక్కడి నుంచి వచ్చాయో రంగురంగుల సీతాకోకచిలుకల గుంపు! ఎరుపు, నలుపు రంగుల పెద్ద రెక్కలతో, గాల్లో తేలుతూ అద్వితీయమైన సౌందర్యాన్ని సష్టించాయి. పక్కనే పడున్న కుండ ముక్కను తీసుకొని శుభ్రం చేసుకున్నాడు. నడుము చుట్టూ బిగించిన మొలతాడులో ట్రౌజర్‌ను సర్దుకొని, చెప్పులను వేసుకొని నిటారుగా నిలబడ్డాడు.
అసమానమైన అడవిలో, వర్షాకాలంలో మొలిచే ఒక చిన్న మొక్క చుట్టూ గుంపుగా చేరిన సీతాకోకచిలుకలు సేంతామిస్‌ను ఆకర్షించాయి. ఇంతవరకూ అంతపెద్ద సీతకోక చిలుకలను అతనెప్పుడు చూడనేలేదు. దగ్గరగా వెళ్ళి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. సేంతామిస్‌ అడుగుపెట్టగానే, అవి కొద్దిగా పైకి లేచి, అతని తలపై నాట్యం చేస్తూ వలయాకారంలో తిరిగాయి.
సేంతామిస్‌ మూడు అడుగుల ఎత్తులో నిలబడి ఉన్నాడు. అతని పాత చెప్పులు తెగిపోవడంతో, పరిగెత్తే సమయంలో చెప్పులకు ఉన్న ముళ్లు పాదాలతో యుద్ధం చేసి గాయపరచాయి. చొక్కా బటన్లు ఊడిపోవడంతో ఛాతీ బయటపడింది. చేతిని ముందుకు చాచి, సీతాకోకచిలుకలను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. పరిగెత్తుతున్నప్పుడు, మొక్కలపై ఉన్న మంచు బిందువులు సేంతామిస్‌ ముఖాన్ని ముద్దాడాయి. తడిసిన ఆకు కొమ్మలు నడుమును తాకి, చల్లదనాన్ని ఇచ్చాయి. ఒక్కసారిగా ఎగిరి, సీతాకోకచిలుకను పట్టుకోవాలని ప్రయత్నించాడు. పిడికిలి విప్పి చూసుకున్నాడుుకానీ చేతిలో సీతాకోకచిలుక లేదు. అది ఎగిరిపోతూ కనబడింది, దాని రంగులు అరచేతిపై ముద్రించాయి. ఆనందంగా, మొక్కల తడిని తన ముఖంపై తుడుచుకున్నాడు. చేతిపై ఉన్న రంగు ముఖానికి అంటుకోవడంతో, సేంతామిస్‌ ముఖం సీతాకోకచిలుకలా మారిపోయింది.
సేంతామిస్‌ హాస్టల్‌ నుంచి సలైయూర్‌ స్కూల్‌కు బయలుదేరాడు. అతని స్నేహితులు రాజా, సురేష్‌ కుమార్‌, మురుగన్‌ త్వరగా నడుస్తుంటే, సేంతామిస్‌ మాత్రం నెమ్మదిగా వాళ్లను అనుసరించాడు. ముమ్మూర్తిపురం దారిలో చిన్న కాలువ దాటి, ఒక పెద్ద వక్షం పక్క నుండి నడుస్తూ ఉండగా ముళ్ల కొమ్మ చొక్కాకు తగిలి చిరిగింది. దాన్ని తీసేందుకు వంగినప్పుడు, పక్కనే ఉన్న నారింజ చెట్టు పై భాగాన్ని ఆసక్తిగా పరిశీలించాడు.
చెట్ల కొమ్మలుుగొడుగుల్లా వెడల్పుగా విస్తరించాయి. ఓ చెట్టు పైభాగంలో బూడిద రంగు పాలిథీన్‌ కవర్‌ కనిపించింది. అందులో ఏదో ఉన్నట్లు అనిపించడంతో, మూడు రాళ్లు తీసుకున్నాడు. మొదటి రాయి చెట్టు పైభాగాన్ని తాకి తిరిగి అతని మీదే పడింది. కాస్త వెనక్కి వంగి, మరింత స్థిరంగా నిలబడి రెండో రాయిని విసిరాడు. అది కవర్‌ కి తగిలింది కానీ పెద్దగా కుదపలేకపోయింది. కవర్‌ చిరిగిన వెంటనే, చిన్న ఎర్ర – పసుపుగా ఉన్న ఒక ముక్క కిందకు పడింది. ఎడమ చేతితో అందుకున్నాడు. అది హల్వా ముక్కలా కనిపించింది. ”చెట్టు పైకి హల్వా ఎలా వెళ్లింది?” ఆశ్చర్యంగా పైకి చూస్తూ గొణుక్కున్నాడు.
స్కూల్‌ కు ఆలస్యం అవుతుందనే ఆలోచన లేకుండా చెట్టు కింద నిలబడి హల్వా ముక్కను కొరికాడు. బాగా రుచిగా అనిపించింది, అది ఎప్పుడో ఎండిపోయి ఉందని సేంతామిస్‌ కి అర్థం అవ్వలేదు. అర్థం అయినా తినడానికే మొగ్గు చూపుతాడు. ఎందుకంటే అతనికి హల్వా రుచి తెలియదు. కానీ ఒకరోజు నాగర్‌ కోవిల్‌ లోని బెస్ట్‌-బేకరీకి వెళ్లినప్పుడు, గ్లాస్‌ షెల్ఫ్‌లో అందంగా అమరిన ”హల్వా రూ. 75” అనే లేబుల్‌ ని ఆశగా చూశాడు. అంతలో బేకరీలోకి ఐదారు మంది రావడంతో, బేకరీ యజమాని సేంతామిస్‌ ని చొక్కా కాలర్‌ పట్టుకొని బేకరి నుండి బయటకు లాగేశాడు, గెంటాడు, ఈడ్చిపడేశాడు. సేంతామిస్‌ ఆశగా చివరిసారి బేకరీ వైపు చూశాడు. నేలపై పడివున్న రబ్బర్‌ బ్యాండ్‌ను చేతికి చుట్టుకుని, మౌనంగా బాధాతప్త చూపులను వదిలి వెళ్ళిపోయాడు.
సేంతామిస్‌ హల్వాను ఒక్కసారి నాకాడు. అది క్యాండీలా కరగలేదు. కాస్త ఆగి మళ్లీ నాకుతూ, దాని రుచిని ఆస్వాదిస్తూ స్కూల్‌కి వెళ్లాడు.
అక్కడికి చేరేసరికి అసెంబ్లీ మొదలైపోయింది. ఆలస్యంగా వచ్చినందున, గేటు బయట ఉన్న విద్యార్థుల పక్క నిలబడ్డాడు. అసిస్టెంట్‌ ప్రిన్సిపాల్‌ కుమార్‌ సార్‌, గంభీరంగా నిలబడి ఉన్నాడు. అసెంబ్లీ ముగిసిన వెంటనే గేటు బయట నిలబడ్డ విద్యార్థులందరినీ దగ్గరికి రమ్మని పిలిచాడు. బెత్తంతో ఒక్కొక్కరికీ రెండు దెబ్బలు వేశాడు. అందరూ చేతులను చాచారు, సేంతామిస్‌ మాత్రం వెనక్కి తిరిగి, వెనుక భాగాన్ని చూపించాడు. కుమార్‌ సార్‌ ఎలాంటి సంకోచం లేకుండా సేంతామిస్‌ ఖాకీ ట్రౌజర్‌ ని కొద్దిగా కిందకి లాగి, రెండు సార్లు గట్టిగా కొట్టాడు. అది చింతచెట్టు కొమ్మ కావడంతో తీవ్రంగా బాధ పెట్టింది. క్లాస్‌కి వచ్చి రాగానే సేంతామిస్‌ నాతో ఒక్క మాట అన్నాడుు ”నేను హల్వా తిన్నాను” ఆ మాట అంటున్నప్పుడు తన కన్నుల్లోని సంతోషం నా జీవితంలో మరెవరి కన్నుల్లో చూడలేదు.
నేను నవ్వి, ‘అబద్ధం చెప్పొద్దని!’ సూటిగా తన వైపు చూశాను.
సేంతామిస్‌ తన చేతిని నా ముక్కు దగ్గర పెట్టాడు. ముసిరిన నూనె వాసన వచ్చింది.
‘ఇది పాడైన హల్వా… చెడిపోయిన నూనె వాసన వస్తోంది’ వికారంగా ముఖం పెట్టాను. అతను నా మాట వినలేదు, వినే స్థితిలో లేడు కూడా. చిరునవ్వు చిందిస్తూ, మిగిలిన హల్వాను తినబోతున్నట్లు చూశాడు.
ఆ రోజు ఇంగ్లీష్‌ మాస్టర్‌ రాలేదు. నేను, సేంతామిస్‌ %ూు% గ్రౌండ్‌కి వెళ్లాం. అక్కడ కొబ్బరితోట పక్కన కొందరు తాటి ఆకులు కోస్తున్నారు. తిరుకార్తికై పండుగ సందర్భంగా, వారు కోమలమైన తాటి ఆకులను కోయడం మొదలెట్టారు. ఆ ఆకులతోనే కొబ్బరి, బెల్లంతో నిండిన సంప్రదాయ దక్షిణ భారతీయ వంటకుంతాటి ఆకు కోళుకట్టై తయారు చేస్తారు.
ఒక ముసలాయన మాకు కాస్త దూరంలో నిలబడి, ”తాటి ఆకులు కావాలా?” అని ప్రేమగా అడిగాడు.
‘కావాలని, తలలు ఊపి’ మాకు దగ్గరగా ఉన్న తాజా లేత ఆకులను తెంపి రుచి చూశాము.
‘కోళుకట్టై చేసేందుకు తాటి ఆకులు తీసుకెళ్లాలా?’ మళ్లీ అడిగాడు.
‘లేదు తాతయ్యా, మా మామయ్య చెట్టెక్కి తెస్తాడు’ హుషారుగా చెప్పాను.
ఆయన సేంతామిస్‌ వైపు తిరిగి ‘నీకు కావాలా?’ మురిపంగా అడిగాడు.
‘ఇతను హాస్టల్లో ఉండే క్రైస్తవుడు, వాళ్ల వద్ద తిరుకార్తిగైకి కోళుకట్టై చేయరు.’
‘తాటి ఆకుల కోళుకట్టై ఎలా చేస్తారు? రుచిగా ఉంటుందా?’ నన్ను ఆసక్తిగా సేంతామిస్‌ అడిగాడు.
‘యాలకలు, అల్లం, పచ్చి బియ్యం, చక్కెర, పెసరపప్పు, కొబ్బరితో మా అమ్మ తయారు చేసేదని’ చెప్పడం ప్రారంభించాను.
‘ముందుగా, పచ్చి బియ్యాన్ని రుబ్బి తక్కువ మంట మీద వేయించాలి. తర్వాత, పెసర పప్పును కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టి, పొట్టు ఊడిపోయే వరకు వేయించాలి. యాలకలు, అల్లంని మెత్తగా పొడి చేయాలి. ఈ మిశ్రమాన్ని బియ్యపు పిండిలో కలిపి, చక్కెర, తురిమిన కొబ్బరి వేసి బాగా కలపాలి. మెత్తగా అయ్యే వరకు వేయించాలి. ఆ తర్వాత, చపాతీ పిండిలా కలపాలి, నీళ్లు మాత్రం పోయకూడదు. కొన్ని తాటి ఆకులను తీసుకుని, మిశ్రమాన్ని కావాల్సిన పరిమాణంలో ఉండలుగా చేసి, వాటిని తాటి ఆకులతో కట్టాలి. ఆ తర్వాత, మంటపై ఉంచి ఉడకనివ్వాలి. ఇవన్నీ సాయంత్రం ఆరు గంటల సమయంలో జరుగుతాయి. మేము పొయ్యిపై ఉడకబెడతాం, ఆ సువాసన మా స్కూల్‌ నుంచి ముతారామన్‌ గుడివరకు వ్యాపిస్తుంది. మేము వాటిని బయటకు తీసుకెళ్లి తింటాం, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కోళుకట్టై ఇస్తామని,’ గర్వంగా చెప్పాను.
‘దాన్ని రుచి చూడడమంటే నాకు చాలా ఇష్టం’ సేంతామిస్‌ ఆశగా, కోరికగా నా వైపు చూశాడు.
సాయంత్రం, స్కూల్‌ అయిపోయిన తర్వాత.. నేను, సేంతామిస్‌ కలిసి స్లైయుర్‌ హాస్పిటల్‌ దగ్గరున్న బ్లెస్సింగ్‌ సైకిల్‌ షాప్‌కి వెళ్లాం. అక్కడ కొంతమంది విద్యార్థులు పాత టైర్లు కొనడానికి నిలబడ్డారు. నేను మూడు రూపాయలకు ఒక టైర్‌ కొని, చిన్న కర్రను తీసుకుని, రోడ్డుపై టైర్‌ ని కొడుతూ పరిగెత్తాను. సేంతామిస్‌ నా పక్కన పరుగెత్తుతూనే, ఆటలో భాగంగా అకస్మాత్తుగా టైర్‌ను చేత్తో తట్టాడు. ముమ్మూర్తిపురం మార్గం దగ్గరకు వచ్చాక, టైర్‌ను తిరిగి నాకు ఇచ్చి, తన చేతిని చూసుకున్నాడు. అది టైర్‌ దూళితో నల్లగా మారింది. నేను సరవనందేరి వైపుగా వెళ్లాను. సేంతామిస్‌ ముమ్మూర్తిపురం దారి పట్టాడు. అతని మనసు మాత్రం తాటి ఆకుల కోళుకట్టై గురించి ఆలోచించడం ఆపలేదు.
హాస్టల్‌కి వెళ్లి యూనిఫామ్‌ తీసేసి, మూడు రోజులుగా వేసుకున్న ఎరుపు గీతల మురికి షర్ట్‌, హుక్‌ – బటన్‌ లేని నల్లటి ప్యాంట్‌ తొడుక్కున్నాడు. మూత్ర విసర్జనకు హాస్టల్‌ వెనుకున్న చింత చెట్టు దగ్గరకు వెళ్లాడు. అక్కడ ముందే ఎవరో మూత్రవిసర్జన చేసి వెళ్లిపోయారు. అక్కడి నేలంతా తడిగా ఉంది. ఆ తడిలో చిలుక కొరికిన చింతపండు పడి వుంది. పండును తీసుకుని, షర్ట్‌తో తుడిచి నోట్లో వేసుకున్నాడు. మూత్రవిసర్జన చేస్తూ మరో చింతపండు రాలుతుందేమోనని చెట్టు పైకి చూశాడు. ఆ తర్వాత హాస్టల్‌ కిచెన్‌కి వెళ్లి, తన కప్పుతో నీళ్లు తాగి, ముందు గదికి నెమ్మదిగా నడిచాడు.
‘ఫ్యాషన్‌ షో జరుగుతోందా? అంత నెమ్మదిగా నడుస్తున్నావు?’ వార్డెన్‌ కోపగించుకున్నాడు.
చెమ్మగిల్లిన కళ్లతో మౌనంగా వార్డెన్‌ వైపు చూసాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా, స్కూల్‌ బ్యాగ్‌ నుండి తమిళ పుస్తకం, నోటుబుక్‌ బయటకు తీశాడు. సమయం 5:30 అయ్యింది. అతని ఆలోచనలన్నీ తాటి ఆకుల మీదే ఉన్నాయి. పుస్తకం తిరగేస్తూ గడియారం వైపు చూశాడు. 5:45 అయ్యింది. నెమ్మదిగా లేచి, భయం నిండిన ముఖంతో వార్డెన్‌ ముందు నిలబడ్డాడు.
‘ఏం… ఏం కావాలి?’ వార్డెన్‌ గద్దించాడు.
‘క్లాస్‌రూమ్‌లో పెన్ను మర్చిపోయాను. షాప్‌కు వెళ్లి కొనుక్కుంటానని’ బెదురుగా, ఒణుకుతూ అడిగాడు.
‘వెళ్లి, త్వరగా వచ్చి సావు’ వార్డెన్‌ అసహ్యంగా, కోపంగా ముఖం పెట్టాడు. ఆ ముఖంలో ఎన్ని అర్థాలో!
సూర్యడు కరిగిపోయాడు, నెమ్మదిగా చీకటి గడ్డకట్టడం మొదలయ్యింది. గుబురుగా ఉన్న చిక్కని చెట్ల సమూహాన్ని దాటి అర కిలోమీటరు నడిచి ముమ్మూర్తిపురం రోడ్డు చేరుకున్నాడు. కొండపై వెలిగే దీపం మరో సూర్యుడిలా అనిపించింది. అలాగే కాసేపు నడిచిన తర్వాత, ముమ్మూర్తిపురం %జూ×% టెంపుల్‌ దగ్గర ఎడమవైపు తిరిగిన వెంటనే, ముసలవ్వ అంగడి కనపడింది. ముసలవ్వ సేంతామిస్‌ కంటే బక్కచిక్కి ఉంది. ఆమె వక్షోజాలు కుంచించిపోయి, తల నుండి కాళ్ల దాకా సన్నని కర్రలా నాజూకుగా ఉంది. ఆమె మెడలో తాళి, కుడి చేతికి బంగారు గాజు ఉంది. ఆమె భర్త ముమ్మూర్తిపురం ప్రైమరీ స్కూల్‌ పేరెంట్స్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు. అందువల్ల, ఆ స్కూల్‌ విద్యార్థులు చేతులు కడుక్కోవడానికి బయటకు వెళ్లినప్పుడు, సేంతామిస్‌ ఇంటి ప్రాంగణంలోని ట్యాంక్‌ నుంచి బకెట్‌ లేదా కొబ్బరి చిప్పతో నీళ్లు తోడుకునేవారు.

‘ధనం’ అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్న వ్యక్తి పట్టణంలో తిరుగుతూ ఉంటాడు. ఆయన దగ్గర ఊపిరాడనంత దుర్వాసన వస్తుంది. ”ధనం, భోజనం చేశావా?” అని విద్యార్థులు అడిగితే, ”సిగరెట్‌ కాల్చా!” అంటాడు. ఒకప్పుడు ఆయన చాలా ధనవంతుడు. కానీ అకస్మాత్తుగా పిచ్చివాడయ్యాడు. ఆయనకు గంజి, అన్నం పెట్టే ఏకైక వ్యక్తి ముసలవ్వ. ఎవరైనా ఆయనకు డబ్బులు ఇస్తే, అవి ముసలవ్వకే ఇచ్చి, గంగిరేని పండ్లు, సిగరెట్‌ ఇవ్వమని అడుగుతాడు.
ముసలవ్వ సిగరెట్‌ ఇవ్వగానే, ఎలుకలా పెదువులు పెట్టిు సిగరెట్‌ వెలిగించుకోవడానికి కాస్త ముందుకు ముఖం పెట్టాడు. సిగరెట్‌ పొగను గుప్పుగా వదిలాడు. ముసలవ్వ చేయి పట్టుకొని కాంపౌండ్‌ లోకి తీసుకెళ్లింది. అతను వెనక్కి తిరిగి, మురికి పంచెను పైకెత్తి నిలబడ్డాడు. ముసలవ్వ ప్రేమగా నీళ్లు పోసి శుభ్రం చేసింది.
ముసలవ్వ అంగడి ముందున్న చెక్క బల్ల మీద వాలుతూ, ”ముసలవ్వ, నాకొక పెన్ను కావాలి. ఇప్పుడేం డబ్బుల్లేవు. క్రిస్మస్‌కి ఇంటికి వెళ్లినప్పుడు తప్పకుండా తీసుకువస్తానన్నాడు.” ముసలవ్వ ఒక్కమాట కూడా మాట్లాడకుండా మూడు రకాల పెన్నులు చూపించింది. సేంతామిస్‌ మూడున్నర్ర రూపాయలు విలువ చేసే పెన్ను తీసుకున్నాడు. ముసలవ్వకు వెళ్ళొస్తానని చెప్పగానే, ఆరెంజ్‌ క్యాండీ డబ్బాలోంచి రెండు విరిగిన క్యాండీలు ఇచ్చింది. వాటిని కొనుక్కొని నోట్లో వేసుకున్నాడు. ముమ్మూర్తిపురం రోడ్డుపై పడమటి దిశగా నెమ్మదిగా నడిచాడు.
ప్రతి ఇంట్లో నుండి పొగ ఎగసి పడుతోంది, తాటి ఆకుల సువాసన గాలిలో వ్యాపిస్తోంది. మొదట సేంతామిస్‌కు.. అదీ తాటి ఆకుల కోళుకట్టై వాసన అని అర్థం కాలేదు. కాసేపటి తర్వాత దాని పరిమళాన్ని గుర్తించాడు. దారికి ఎడమ వైపు ఉన్న ఇంటి తలుపు అరకొరగా మూసి ఉంది. లోపల నుండి ఒక అబ్బాయి, వేడిగా ఉన్న తాటి ఆకుల కోళుకట్టై పట్టుకుని బయటకు వచ్చాడు. కనుగుడ్లను పెద్దగా చేసి సేంతామిస్‌ అతడిని చూశాడు. మరికొంత దూరం నడిచే సరికి, కోళుకట్టై పరిమళం ఎక్కువైంది. రెండిళ్ల తర్వాత, కొంత మంది అబ్బాయిలు కొత్తగా ఆవిరి పొంగిన పసుపు రంగు తాటి ఆకుల కోళుకట్టైలు చేతిలో పట్టుకుని నిలబడి ఉన్నారు. కానీ, వారెవరూ సేంతామిస్‌ను గమనించలేదు.
సాధారణంగా ఎక్కువమంది జనం ఉండే ముమ్మూర్తిపురం రోడ్డు.. ఆ రాత్రి నిశబ్దంలో మునిగి ఉంది. కొన్ని ఇండ్ల తలుపుల దగ్గర మాత్రం దీపాల వెలుగు ఊగుతోంది. సేంతామిస్‌ ముందుకు నడుస్తూ, రహదారి ఇరుపక్కల ఇంటి గడపలను ఆసక్తిగా, కోరికగా, ఆశగా చూశాడు. ”కోళుకట్టై తింటున్నప్పుడు ఎవరొచ్చినా, వారితో పంచుకుంటాం” అని చెప్పిన.. నా మాట గుర్తొచ్చింది. ఆ ఆలోచనతోనే, ఒక్కో ఇంటి తలుపును ఆశగా చూశాడు. గ్రామం చివరికి చేరుకున్నప్పటికీ, ఎవరూ సేంతామిస్‌ను గమనించలేదు. కన్నులు తడిశాయి. తీవ్ర నిరాశ సేంతామిస్‌ను ముంచేసింది. మెల్లగా దక్షిణ దిశగా తిరిగి, తూర్పు వైపుకు నడిచాడు. కాసేపటి క్రితం నోట్లో ఊరిన లాలాజలం ఒక్కసారిగా స్థభించిపోయింది. శరీరమంతా కోళుకట్టై తినాలనే కోరిక కన్నులోకి చేరి కన్నీళ్ళలా రూపాంతరం చెంది ఆత్మహత్య చేసుకుంది. అందరూ తమ ఇళ్ల ముందు చేరి, వేడి వేడి కోళుకట్టైలను ముచ్చటిస్తూ తింటున్నారు. ఒక్కో ముక్కను ఒకరిపై ఒకరు విసురుకుంటున్నారు. సేంతామిస్‌ ఆశగా ఒక ముక్క అయినా తనవైపు పడకపోతుందా అని చూశాడు. ఆశ నెరవేరలేదు, విషాదం పోరాటంగా మారుతుంది.
భిక్షగాడిలా ప్రతి గడపను ఆశగా చూస్తూ ముందుకు నడిచాడు. చివరికి గ్రామం ముగిసి, హాస్టల్‌కి వెళ్లే చెట్ల దారి మొదలైంది. సేంతామిస్‌ చూపు మందగించింది, కన్నుల్లో ముల్లులు గుచ్చినట్టు అనిపించింది. తల కిందకు దించుకొని బిగ్గరగా ఏడ్చాడు. అతని ఏడుపును ఎవరూ వినలేదు. శరీరం మీద చెమట పువ్వులు వికసించాయి. అదే కదా తన చిరునామా! అంతటి ఏడుపులో కూడా, ఒక విషయం గుర్తుకు వచ్చింది. సేంతామిస్‌ తమిళ ఉపాధ్యాయుడు జగతీశన్‌ ఒకసారి నేర్పించిన భారతీయార్‌ రచించిన శక్తివంతమైన పాటు”ఒక వ్యక్తికి ఆహారం లేకపోతే, మేము ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తాం.”
తన ముఖాన్ని రెండు చేతులతో తుడుచుకుంటూ, వెనక్కి తిరిగి నిటారుగా, బలంగా నిలబడ్డాడు. ”నాకు ఒక్క ముక్క కోళుకట్టై కూడా ఇవ్వని ఈ ఊరు నాశనం కావాలి,” అని ముమ్మూర్తిపురాన్ని శపించాడు. కన్నీళ్లను తోడుకుంటూ హాస్టల్‌ వైపు నడిచాడు.
తమిళ కథ – రామ్‌ తంగం ( కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత)
ఆంగ్ల సేత – ఎస్‌. ధన ప్రభ
తెలుగు సేత – జాని తక్కెడశిల (కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత )

ఆంగ్ల సేత – ఎస్‌. ధన ప్రభ
తెలుగు సేత – జాని తక్కెడశిల

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -