Monday, February 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇది సంపద సృష్టిని శిక్షించే బడ్జెట్‌..

ఇది సంపద సృష్టిని శిక్షించే బడ్జెట్‌..

- Advertisement -

భారత్‌పే మాజీ కో ఫౌండర్‌ అష్నీర్‌ గ్రోవర్‌

హైదరాబాద్‌ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భారత్‌పే మాజీ కోఫౌండర్‌ అష్నీర్‌ గ్రోవర్‌ ఘాటుగా స్పందించారు. ఇది ఒక్క టైం వేస్ట్‌ బడ్జెట్‌ అని తెలిపారు. ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ బడ్జెట్‌ను ఆయన సంపద సృష్టిని శిక్షించే ప్రక్రియగా సోషల్‌ మీడియాలో అభివర్ణించారు. గ్రోవర్‌ చేసిన విమర్శలు ఇప్పుడు ట్రేడర్లు, స్టార్టప్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. స్టాక్‌ మార్కెట్లో అదృష్టాన్ని పరీక్షించుకునే చిన్న ట్రేడర్ల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందని అష్నీర్‌ వాపోయారు. ముఖ్యంగా డెరివేటివ్స్‌పై సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ టాక్స్‌ పెంచడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

”ప్రభుత్వం కేవలం ప్రజలు ఎలా సంపాదిస్తున్నారనే దానిపైనే కన్నేస్తోంది తప్పా వారికి తిరిగి ఏమి ఇస్తున్నామనేది మర్చిపోయింది. ట్రేడింగ్‌ను ఒక వ్యాపారంగా చూడటం మానేసి, కేవలం పన్నులు వసూలు చేసే ఏటీఎం మెషిన్‌లా ప్రభుత్వం భావిస్తోంది” అంటూ ఆయన ఎద్దేవా చేశారు. కంపెనీలు తమ షేర్లను బైబ్యాక్‌ చేసినప్పుడు వచ్చే ఆదాయాన్ని డివిడెండ్‌గా పరిగణించి పన్ను వేయాలన్న నిర్ణయం అష్నీర్‌ను మరింత అసహనానికి గురిచేసింది. దీనివల్ల స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు. మధ్యతరగతి ప్రజల కష్టార్జితం పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరుతుంటే, ప్రతిఫలంగా వారికి దక్కేది శూన్యమని గ్రోవర్‌ కుండబద్దలు కొట్టారు. మధ్యతరగతి వారు ఎంత రక్తం చిందించినా, ప్రభుత్వం తన సింహభాగాన్ని పక్కన పెట్టుకుంటుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో డబ్బు సంపాదించడం పెద్ద విషయం కాదని… సంపాదించిన దానిని పన్నుల నుండి కాపాడుకోవడమే అతిపెద్ద సవాలు కాబోతోందన్నారు.

పారిశ్రామిక సంఘాల హర్షం..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌పై పారిశ్రామిక వర్గాలు సానుకూలంగా స్పందించాయి. దేశీయ తయారీ రంగం, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ అభివృద్ధికి ఈ బడ్జెట్‌ పెద్దపీట వేసిందని ఫిక్కీ, ఎఫ్‌టీసీసీఐ, సీఐఐ, అసోచామ్‌ తదితర ప్రముఖ పారిశ్రామిక సంఘాలు అభిప్రాయపడ్డాయి.

పన్ను శ్లాబులు తగ్గిస్తారని ఆశించాం : ఎఫ్‌టీసీసీఐ
”పారిశ్రామిక కారిడార్ల వెంబడి యూనివర్సిటీ టౌన్‌షిప్‌ల ఏర్పాటు నిర్ణయం బాగుంది. అయితే.. ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మధ్యతరగతికి మరిన్ని రాయితీలు ఇస్తారని ఆశించాము. పరిశ్రమలకు విద్యుత్‌ చార్జీల తగ్గింపు వంటి చర్యలు ఉంటే బాగుండేది” అని తెలంగాణ వాణిజ్య మరియు పారిశ్రామిక మండలి (ఎఫ్‌టీసీసీఐ) అధ్యక్షుడు సురేష్‌ కుమార్‌ సింఘాల్‌ పేర్కొన్నారు.

వృద్ధికి రోడ్‌మ్యాప్‌ : ఫిక్కీ
”ఈ బడ్జెట్‌ సుస్థిర ఆర్థిక వృద్ధికి రోడ్‌ మ్యాప్‌ లాంటిది. ముఖ్యంగా సెమీకండక్టర్‌ మిషన్‌ (ఐఎస్‌ఎం 2.0) కోసం రూ.40,000 కోట్లు కేటాయించడం, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం భారత్‌ను గ్లోబల్‌ టెక్‌ హబ్‌గా మారుస్తుంది” అని ఫిక్కీ అధ్యక్షుడు అనంత్‌ గోయెంకా పేర్కొన్నారు.

ఎంఎస్‌ఎంఈలకు ఊరట : సీఐఐ
”మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.12.2 లక్షల కోట్లు కేటాయించడం ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్నిస్తుంది. ఎంఎస్‌ఎంఇల కోసం ప్రకటించిన ‘స్పెషల్‌ క్రెడిట్‌ గ్యారెంటీ స్కీమ్‌’ చిన్న పరిశ్రమలకు ఎంతో ఊరటనిస్తుంది” అని సీఐఐ అధ్యక్షుడు రాజీవ్‌ మోమాని అన్నారు.

గ్రీన్‌ ఎనర్జీకి మద్దతు : అసోచామ్‌
”ఇది చాలా సమతుల్యమైన బడ్జెట్‌. ద్రవ్యలోటును 4.2 శాతానికి కట్టడి చేస్తూనే, ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించడం మంచి విషయం. గ్రీన్‌ ఎనర్జీకి ఇచ్చిన ప్రోత్సాహకాలు అభినందనీయం” అని అసోచామ్‌ సెక్రెటరీ జనరల్‌ సౌరభ్‌ సన్యాల్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -