Friday, November 21, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఇది లొట్టపీసు కేసు : కేటీఆర్‌

ఇది లొట్టపీసు కేసు : కేటీఆర్‌

- Advertisement -

ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు : ఏసీబీ మాజీ డీజీ పూర్ణచందర్‌రావు

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై చార్జిషీటు వేసి ప్రాసిక్యూట్‌ చేయడానికి రాష్ట్ర గవర్నర్‌ అనుమతించటంతో అందిరి దృష్టి ఈ కేసుపై నిలిచింది. కాగా ఈ కేసులో ఇప్పటి వరకు నాలుగుసార్లు ఏసీబీ విచారణను ఎదుర్కొన్న కేటీఆర్‌.. ఈ నాలుగు సందర్భాల్లోనూ మీడియాతో మాట్లాడారు. ” ఇది కేవలం లొట్టపీసు కేసు. దీని వల్ల ఒరిగేదేమీ లేదు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ కేసును పెట్టించడం ద్వారా పైశాచిక ఆనందాన్ని పొందుతాడే తప్పించి అంతకు మించి ఫలితమేమీ లేదు” అని ఆ సందర్భంలో వ్యాఖ్యానించారు. అయితే ఈ కేసును విచారిస్తున్న ఏసీబీ మాత్రం ఇందులో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకొని, పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘన జరిగిందని పేర్కొన్నది.

అందేగాక ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ కేసులో సదరు విదేశీ కంపెనీకి రూ.48 కోట్లకు పైగా నిధులను చెల్లించటం ద్వారా కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీకి కోట్ల రూపాయల్లో క్విడ్‌ ప్రోకో జరిగిందని ఏసీబీ నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఫార్ములా ఈ-కార్‌ రేసింగ్‌ మొదటి వెర్షన్‌లో నిర్వాహణకు ముందుకు వచ్చిన ఓ కంపెనీ నష్టం వస్తున్నట్టు వెనక్కి వెళ్లిపోవటం, 2023లో నిర్వహించతలపెట్టిన ఈ ఈ-కార్‌ రేసింగ్‌ కోసం అవసరమైన నిధులను హెచ్‌ఎండీఏ ద్వారా పెట్టుబడిగా పెట్టించడంలో అప్పటి మంత్రి కేటీఆర్‌కు ఉన్న ఆసక్తి ఏమిటనే విషయమై కూడా ఏసీబీ ఆయనను గతంలో ప్రశ్నించింది. ఈ-కార్‌ రేసింగ్‌ నిర్వహణకు సంబంధించి తాను ప్రొసీజర్‌ ప్రకారమే నడుచుకున్నానని సమాధానమిచ్చిన కేటీఆర్‌.. ఇందుకు అవసరమైన అనుమతులను ఆర్థిక శాఖ నుంచి కానీ, ఆర్బీఐ నుంచి కానీ అప్పటి క్యాబినెట్‌ నుంచి కానీ ఎందుకు తీసుకోలేదనే విషయమై ఇతమిత్థమైన సమాధానాలివ్వలేదని తెలుస్తోంది.

అప్పటి హెచ్‌ఎండీఏ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అరవింద్‌ కుమార్‌ సైతం కేటీఆర్‌ ఆదేశాల మేరకే హెచ్‌ఎండీఏ నుంచి నిధులను విడుదల చేశామనీ, అంతకుమించి తన ప్రమేయమేమీ లేదని విచారణలో తెలిపాడు. ఈ నిధులను విదేశీ కంపెనీకి ఎస్బీఐ బ్యాంకు ద్వారా అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను పంపించానని అప్పటి హెచ్‌ఎండీఏ సీఈఓ బి.ఎల్‌.ఎన్‌ రెడ్డి వివరణ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో విచారణను సాగించిన ఏసీబీ మొత్తమ్మీద ఈ-కార్‌ రేసింగ్‌ వెనుక కోట్లాది రూపాయల క్విడ్‌ప్రోకో జరిగిందనటానికి అవసరమైన ఆధారాలను సేకరించినట్టు సమాచారం. అలాగే 2023లో ఈ-కార్‌ రేసును నిర్వహించే సందర్భంలో ఎన్నికల కోడ్‌ కూడా అమలులో ఉండగా.. దానిని కూడా ఉల్లంఘించారని ఏసీబీ విచారణలో తేలింది. వీటిన్నిటి నేపథ్యంలో ఏసీబీ.. కేటీఆర్‌తో పాటు ఇతర నిందితులపై చార్జిషీటు వేయడానికి అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేసుకొన్ని ఉన్నట్టు తెలిసింది. అదే సమయంలో కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయడానికి కూడా న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నట్టు సమాచారం.

ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు : ఏసీబీ మాజీ డీజీ పూర్ణచందర్‌రావు
ఈ-కార్‌ రేసింగ్‌ కేసులో దర్యాప్తు జరుపుతోన్న ఏసీబీ అధికారులు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై తీసుకునే తదుపరి చర్య విషయంలో ఏసీబీ మాజీ డీజీ పూర్ణచందర్‌ స్పందించారు. ఏసీబీ ఎలాంటి నిర్ణయాన్నైనా తీసుకోవచ్చని చెప్పారు. 25 ఏండ్ల క్రితం సీబీఐ కానీ, ఏసీబీ కానీ ఏదేనీ కేసులో చార్జిషీటు వేసి తర్వాత నిందితులను అరెస్ట్‌ చేసే నిబంధన ఉండేదనీ, కానీ ఐదేండ్ల కింద నుంచి నిందితులను ముందే అరెస్ట్‌ చేస్తున్నారని ఆయన తెలిపారు. ఏసీబీ కేసులో నిందితులను అరెస్ట్‌ చేయడానికి ఎవరి అనుమతీ తీసుకోవాల్సినవసరం లేదని అన్నారు. రానురానూ అవినీతి తారాస్థాయికి చేరుతోందనీ, పలు కేసులలో ముఖ్యమంత్రులు, మంత్రులు, సీనియర్‌ అధికారులు ఈ అవినీతికి పాల్పడుతున్నారనీ, ఇది దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. కొందరు అవినీతి అధికారులు వారి పిల్లల వివాహాలకు కోట్లాది రూపాయలను కాంట్రాక్టర్లు ఖర్చుబెట్టడాన్ని బట్టి పరిస్థితి తీవ్రత అర్థమవుతున్నదని ఆయన అన్నారు. ప్రస్తుత కేసులో కేటీఆర్‌ను అరెస్ట్‌ చేసే అవకాశం కూడా లేకపోలేదని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -