Sunday, November 9, 2025
E-PAPER
Homeచైల్డ్ హుడ్ఇది పిల్లల ప్రపంచం

ఇది పిల్లల ప్రపంచం

- Advertisement -

అనుబంధాలు, విలువలు మృగ్యమైపోతున్నాయి. సమాజంలో మనుషులన్నవారు మాయమవుతున్నారు. ఇటువంటి తరుణంలో మానవ విలువలను పెంపొందించడం, బాలల్లో కలిసి ఉండాలనే తపనను తరగిలించడం నేటి కర్తవ్యం. తోటి మనుషుల పట్ల సానుభూతిని కలిగి ఉండడం, ఆధిపత్యం, పీడనలు లేని, రాజ్యాంగ స్ఫూర్తి అయిన స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం సమాజం కోసం కృషి చేయడం చాలా అవసరం. అలాంటి బాధ్యతనే తన భుజాలకెత్తుకుంది తెలంగాణ బాలోత్సవ్‌.

నేటి బాలలే రేపటి పౌరులు. అలాంటి బాలల్లోని సృజనాత్మక సామర్థ్యాలను వెలికితీయాలి. వైజ్ఞానిక నైపుణ్యాలను సమర్థవంతం చేయాలి. సమైక్యతా స్ఫూర్తిని పెంపొందించాలి. వారిలో ప్రశ్నించేతత్వాన్ని అలవరచాలి. అలా వాళ్లను తయారు చేయాలంటే పరిశీలనాత్మకంగా ఆలోచించే విధంగా మెదళ్లకు శిక్షణ ఇచ్చినపుడే మేధోవికాసం జరుగుతుంది. ఆట, పాట, సాంస్కృతిక కార్యక్రమాలు పాఠ్యప్రణాళికలో భాగమైతేనే పిల్లల్లో తేజోవంతమైన మేధోవికాసం సాధ్యమవుతుంది. అలాంటి ప్రయత్నమే చేస్తుంది గత ఐదేండ్ల నుండి తెలంగాణ బాలోత్సవ్‌. ఆందులో భాగంగానే నవంబర్‌ 6,7 తేదీల్లో 5వ పిల్లల జాతరను ఘనంగా నిర్వహించింది.

విలువలు పెంచేలా…
మార్పు ఏదైనా మొదట పిల్లల నుండే రావాలి. ఆ ఆలోచన నుండే 2021లో తెలంగాణ బాలోత్సవం అంకురించింది. రేపటి పౌరుల ఉత్సవ వేదికగా ‘పిల్లల జాతర’ను వారు ప్రతి ఏడూ క్రమం తప్పకుండా జరుపుతున్నారు. సంబరాల అధ్యయన వేదికలుగా బాలోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51(ఏ)లో చెప్పబడిన పౌరుల ప్రాధమిక బాధ్యతలు ముఖ్యంగా ఐక్యత, సమగ్రతా, సామరస్యతా, సౌభ్రాతృత్వం, భిన్నత్వంలో ఏకత్వం అనే స్ఫూర్తిని పిల్లల్లో పెంచాలి. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, వైజ్ఞానిక దృకథంను ప్రోత్సహిస్తూ సమాజంలో బలహీన పడుతున్న నైతిక విలువలు, సహకారగుణం కాపాడుతూ ఉన్నతంగా జీవించే పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే తన లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ బాలోత్సవ్‌.

సామాజిక చైతన్యంతో…
పిల్లల్లో సోదరత్వం వెల్లివిరిసేలా.. మూఢనమ్మకాలకు దూరంగా.. సైంటిఫిక్‌ టెంపర్‌కు దగ్గరగా తీర్చిదిద్దుతుంది తెలంగాణ బాలోత్సవ్‌. ఈ పిల్లల జాతరకు చెట్టా పట్టాలు పట్టుకుని బాలలంతా బారులుదీరారు. పిల్లల్లో దాగిన అద్భుత అసమాన పాఠవాలకు వేదికగా ఈ ఉత్సవం జరుగుతోంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా పదివేల మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు, రెండు రోజులు దాదాపు మూడు వందలకు పైగా పాఠశాలల నుండి హాజరయ్యారు. వేల మంది పిల్లలు ఒక చోట చేరితే.. ఆనందం, నవ్వులు, కేరింతలు, ఒకరిని చూసి మరొకరు ఉత్తేజాన్ని పొందడం ఎన్నో పాటలు, ఎన్నెన్నో చిన్నారి పొన్నారి కథలు, నెమలి నాట్యాలు, రామచిలుక పలుకులు, చిన్నిచిన్ని నాటికలు, సైన్స్‌ వండర్‌ షోలు, పిల్లల నేస్తాలు, పెద్దల మురిపాలు, పసిబిడ్డల పాదాలతో బాలోత్సవ ప్రాంగణమంతా సంతోష సంబరమయింది.

జాతీయ పండుగలు సమైక్యతా పర్వాలు
జనవరి 26 గణతంత్ర దినోత్సవం, ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం, ఆక్టోబర్‌ 2 గాంధీ జయింతి, నవంబర్‌ 14 బాలల దినోత్సవం, మార్చి 23 భగత్‌సింగ్‌, రాజగురు, సుఖదేవ్‌ల వర్ధంతులు ఇవన్నీ కుల, మత, ప్రాంతాలకతీతంగా భారతీయులంతా ఐక్యంగా జరుపుకుని మన సమైక్యతా శక్తిని చాటేవి. బాలోత్సవం ఆధ్వర్యంలో ఈ జాతీయ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పిల్లలు, ఉపాధ్యాయులు ఈ సంబరాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా దేశ సమగ్రత, సమైక్యతా స్ఫూర్తిని బాలబాలికల్లో నింపే ప్రయత్నం చేస్తున్నారు.

ద్వేషాలు, విద్వేషాలు లేని ఏకత్వ భావన సామర్థ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. జాతీయ ఉద్యమంలో నాటి విద్యార్థులు బాలలు కూడా ఎంతో తెగువను ప్రదర్శించి పాల్గొన్నారు. పాఠశాలల్లో జాతీయ పతాకాలను ఎగరవేశారు. పెద్దలకు ఏమాత్రం తీసిపోని పోరాట పటిమను చాటారు. జాతి సమైక్యతకు ప్రతీకలుగా నిలిచారు. ఆనాటి స్ఫూర్తిని నేటి తరానికి అందించి దేశ సమైక్యత సమగ్రత రక్షకులుగా బాలలను రూపొందించే వేడుకలుగా ఈ జాతీయ పండుగలను మేమ నిర్వహిస్తున్నారు.

విజ్ఞానోత్సవాలు
ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా సైన్స్‌ను, వైజ్ఞానిక ఆలోచనలను విద్యార్థుల వద్దకు తీసుకుపోవాలని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సైన్స్‌ మన జీవితాలను సుఖమయం చేసేదని, ఏ సమస్య ఎదురైనా వైజ్ఞానిక పద్దతులలోనే, ప్రశ్నించేతత్వంతోనే ఎదుర్కోవాలనే లక్ష్యంతో సైన్స్‌ఫెయిర్స్‌ నిర్వహిస్తున్నారు. ‘సైన్స్‌ ఎక్స్పరిమెంట్స్‌, మిరాకిల్‌ ఎక్స్‌పోజర్‌’ ద్వారా సైన్స్‌ ప్రయోగాల పట్ల అవగాహన కల్పించేందుకు సైన్స్‌ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. స్వయంగా పిల్లలో రకరకాల ప్రయోగాలు చేయిస్తున్నారు. చదువులంటే చాదస్తం కాదని, వైజ్ఞానిక జీవనమని పిల్లలకు తెలియజేసే కర్తవ్యంతో ముందుకెళుతున్నారు.

టీచర్ల వర్క్‌షాప్‌
ఉపాధ్యాయులు విద్యార్థుల భవితకు రూపశిల్పులు. వారి బోధన ఎంత సృజనాత్మకంగా ఉంటే పిల్లలు అంతటి విజ్ఞానవంతులు అవుతారు. బోధన వైజ్ఞానికం-బోధన కళాత్మకం అయితే తరగతి గదుల నుండి వచ్చే ప్రతి విద్యార్ధి మేధో సంపన్నులై వస్తారు. అందుకే బాలోత్సవ కమిటీ వారు టీచర్ల వర్కషాప్‌లు సైతం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. తరగతి గది బోధన విద్యార్థుల్లో ఆసక్తిని రగుల్కొలుపుతూ ఎలా ఉండాలో, బోధన అనేది సమాచారాన్ని బుర్రల్లో నింపేదిగా కాకుండా వారిలోని సామర్థ్యాలను వెలికితీసే ఫెసిలిటేటర్లుగా టీచర్లు ఎలా మారాలి అనే విషయాలపై అనుభవజ్ఞులు, మేధావులు ఈ వర్క్‌షాప్‌లో బోధిస్తారు.

ప్రతిభాపురస్కారాలు
ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు తమ ప్రతిభాపాఠవాలను వెలికి తీసేందుకు, విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతీ ఏడాదీ ‘విజయీభవ’ సభ ద్వారా ఉత్తమ విద్యార్థులకు ప్రతిభాపురస్కారాలు అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నావా అంటూ ఎగతాళిగా మాట్లాడే వారి ముందు తలెత్తుకునేలా 10కి 10 జి.పి.ఏ. ప్రభుత్వ స్కూల్స్‌ సాధించి చూపించాయి. ప్రభుత్వ బడులలో మరిన్ని సదుపాయాలు కల్పిస్తే అద్భుతాలు సాధిస్తారంటూ ప్రభుత్వానికి బాలోత్సవ్‌ విజ్ఞప్తి చేస్తోంది.

ఉపాధ్యాయ దినోత్సవం వేళ
బాలబాలికలను తీర్చిదిద్దే గురుతర బాధ్యత గురువులకు ఉంది. విద్యతో పాటు సృజనాత్మకతను పెంచడానికి ఆట-పాటలు అవసరం. ఉపాధ్యాయుల ముఖంలో ఆనందాలు విరిసినప్పుడే విద్యార్థులు ఆహ్లాదకరంగా నేర్చుకోగలరు. తమ భవితను తీర్చిదిద్దే మార్గదర్శకులు మా టీచర్లని వారి బోధనను ఆస్వాదించగలరు. నేర్చుకోవడం మమేకం కాగలరు. అలా కాకుండా ఎప్పుడూ సీరియస్‌గా ఉంటూ చిటపటలాడే ముఖాలతో టీచర్లు ఉంటే పిల్లలు భయస్తులుగా తయారవుతారు. అందుకే ఉపాధ్యాయులు కూడా ఆటపాటలతో ఉల్లాసభరితంగా ఉండాలంటే వారిలోని కళలను ప్రదర్శించే అవకాశాలు ఉండాలి. ఆ బాధ్యతను కూడా బాలోత్సవ్‌ తన భుజాలకెత్తుకుంది. పాటలు, నృత్యాలు వంటి పోటీలను టీచర్లకు నిర్వహస్తుంది. ప్రతి ఏడాది ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్‌లో టీచర్లకు ‘ఆటపాటల మేళ’ను నిర్వహిస్తున్నారు.

బాలికా సాధికాతర ప్రగతి చోదకం
బాలికలు నేడు అన్ని రంగాల్లో రాణిస్తూ తమ సత్తాను చాటుతున్నారు. అద్వితీయ సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నారు. కానీ మరోవైపు అమ్మాయిల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. సమాజంలో సగభాగంగా ఉండాల్సిన అమ్మాయిల సంఖ్య తగ్గిపోతున్నది. ఉన్నత చదువుల కోసం ఇంకా ఎంతో ఘర్షణ పడాల్సివస్తున్నది. అన్ని రంగాల్లో దూసుపోతున్నా ఆరోగ్యకర అపోహలతో ఇక్కట్ల పాలవుతున్నారు. ఎదిగే అమ్మాయిలు తమ శరీరంలో కలిగే మార్పుల గురించి, పరిశుభ్రత గురించి వైజ్ఞానిక అవగాహన కలిగి ఉండాలి. అందుకే అమ్మాయిల ఆరోగ్య పరిశుభ్రత అవగాహనకు సైతం బాలోత్సవ్‌ విభిన్న కార్యక్రమాలను రూపొందిస్తున్నది.

పిల్లల గ్రంథాలయం
పుస్తక ప్రపంచాన్ని పిల్లల దగ్గరికి చేర్చడం కోసం తెలంగాణ బాలోత్సవ్‌ కమిటీ గ్రంథాలయాలను నిర్వహిస్తుంది. టెక్ట్స్‌బుక్స్‌తో పాటు విద్యా, వికాసం పెంచే మంచి పుస్తకాలను పిల్లలకు అందుబాటులో ఉంచుతుంది. పిల్లలతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పుస్తకాలు చదువుతూ పల్లలను చదివించే ఉద్దేశంతో ఈ గ్రంథాలయాలను నిర్వహిస్తున్నారు.

అధ్యయన వేదికలుగా…
పిల్లలు ఆనందడోలికల్లో తేలియాడుతూ నేర్చుకోవడంలోని మజాను అనుభవించడమే బాలోత్సవం ముఖ్య లక్ష్యం. వీటిల్లో ఎంతో ఉత్సాహ భరితంగా, ఉత్తేజ పూరితంగా పాల్గొంటున్న విద్యార్థుల నగుమోములు భావిభారత ఉజ్వల వైజ్ఞానిక భవితవ్యాన్ని సాక్షాత్కరింప చేస్తున్నాయి. చదువుల బడి బాలల సంతోషకర అధ్యయన వేదికలుగా ఎలా మారాలో ప్రత్యక్షంగా దర్శింపచేసే వేదికలుగా బాలోత్సవం చేస్తున్న కార్యక్రమాలు నిలిచాయి. అవకాశాలు కల్పిస్తే మన పిల్లలు ఎంతటి అద్భుతాలు సృష్టించగలరో చూపించే తార్కాణాలే ఈ సంబరాలు.
కె.సుజావతి, ఉపాధ్యక్షులు, తెలంగాణ బాలోత్సవ్‌

పిల్లలతో మమేకమై…
ఏ దేశానికైనా అసలైన సహజ వనరులు ఆ దేశపు పిల్లల మెదడులే. మార్పు ఏదైనా మొదట పిల్లల నుండే రావాలి. ఆ దిశగా పిల్లలను తీర్చిదిద్దేందుకే విద్యా వికాసం, ఆటపాటలు, పిల్లల్లో దాగిన అసమాన ప్రతిభా పాఠవాలకు వేదికగా తెలంగాణ బాలోత్సవ్‌ నిలుస్తుంది. శాస్త్ర విజ్ఞానానికి సైన్స్‌ వండర్‌ షోలు, ఉపాధ్యాయులకు ఆధునికతపై అవగాహన తరగతులు, ప్రభుత్వ, బడి పిల్లల్లో ప్రతిభగల పిడుగులకు ప్రతిభా పురస్కారాలు, ప్రతి ఉపాధ్యాయుడు ఒక కళాకారుడే, పిల్లలకు వేసవి సెలవుల్లో సమ్మర్‌ క్యాంపులు, సైన్సు ఎగ్జిబిషన్లు, క్విజ్‌ పోటీలు, సైన్సు డాక్యుమెంటరీలు, శాస్త్రీయ ఆలోచనల దిశగా పిల్లల్లో నిరంతరం పని చేస్తున్న ఏకైక సంస్థ తెలంగాణ బాలోత్సవం. మనకు ఎంతో ఇస్తున్న సమాజానికి కొంతయినా తిరిగి ఇవ్వాలన్న సామాజిక చైతన్యం పెరగాలి. కులమత తారతమ్యాలు పోయి, మనుష్యులంతా ఒక్కటనే విశాల భావనలు తేవాలి. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. –ఎన్‌.సోమయ్య, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ బాలోత్సవ్‌

సలీమ
94900 99083

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -