Sunday, February 8, 2026
E-PAPER
Homeసోపతిఇదో గొప్ప రాజకీయ నాటకం

ఇదో గొప్ప రాజకీయ నాటకం

- Advertisement -

జుట్టుపోలుగాడు : అరె మావా కేతిగా! అందరికీ చదువు వస్తదేరా?
కేతిగాడు : ఆ వస్తుంది. చదువుకుంటే ఎవరికైనా వస్తుంది.
జట్టుపోలుగాడు : రాదెహె. అందరికీ రాదెహె. చదువు కేవలం గొప్పోళ్లకే వస్తుంది. పెద్ద పెద్ద చదువులు చదవాలంటే పెట్టిపుట్టాల్రా. తెలిసిందా.
కేతిగాడు : అరె అది ఒకప్పటి మాటరా. ఇప్పుడు ఎవరైనా శ్రద్ధగా చదువుకుంటే అందరికీ వస్తుంది.
జుట్టుపోలుగాడు : లేదెహె. మనలాంటోళ్లకు అస్సలు రాదెహె. ఎందుకంటే మనం తోలుబొమ్మలాడించేటోళ్లం. ఊరూరూ తిరిగి కథలు చెప్పుకుని బతికేటోళ్లం.
కేతిగాడు : అంటే మనం బడికెళ్లలేదని తెలుస్తుంది కదా. చిన్నప్పటి నుండి మనం కూడా చక్కగా బడికెళ్లి చదువుకుంటే మనక్కూడా మంచి చదువులొచ్చేయి.
జుట్టుపోలుగాడు : అంటే నువ్వు పెద్ద డాక్టర్‌వైపోతావా? నేనో కలక్టర్‌నైపోతానా? (నవ్వు)
కేతిగాడు : ఎందుక్కాకూడదు. మన తాతలకు కూడా పెద్దపెద్దోళ్ల మాదిరి సొంత భూములు సొంత భవనాలు, స్థిరనివాసం వుంటే మనం కూడా చక్కగా పెద్ద పెద్ద చదువులు చదువుకునే వాళ్లం.
జుట్టుపోలుగాడు : అంటే ఏంట్రా నువ్వనేది?
కేతిగాడు : మనలాంటి పేదోళ్లు అంటే ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడిన బడుగుజీవులకు అవకాశాలు వుంటే చక్కగా చదువుకుంటారూ అని.
జుట్టుపోలుగాడు : అబ్బ చ్ఛ… అందరూ మరి చదువుకుని ఉద్యోగాలు చేద్దామంటే ఎట్టా కుదురుద్ది? ఎవసాయం ఎవరు చేయాలా? పంటలు ఎవరు పండించాలా? కృష్ణ పరమాత్ముడు గీతోపదేశంలో ఏం చెప్పాడో తెలుసా… చాతుర్‌వర్ణం మాయాసృష్టి. బ్రహ్మముఖం నుండి బాపనోళ్లు, భుజాలనుండి రాజులు, తొడల నుండి కోమట్లు, పాదాల నుండి శూద్రులు అంటే తక్కువ జాతోళ్లు పుట్టారని చెప్పాడా లేదా.. కావాలంటే ఘంటసాల రికార్డింగ్‌ వినుకో.
కేతిగాడు : భారతం, రామాయణం పురాణాలురా. వర్ణాశ్రమ ధర్మాలు బోధిస్తాయి. వేల సంవత్సరాల క్రితం రాసినవి. మనం కూడా వాటిని కథలు కట్టి కథలు కథలుగా చెపుతున్నాంగా..
జుట్టుపోలుగాడు : అయితే ఏటంటావ్‌?
కేతిగాడు : కథ వేరు, జీవితం వేరు. మానవ జీవితంలో అందరికీ సమన్యాయం దక్కాలి. 1947లో మనకు బ్రిటీషోళ్ల నుండి స్వాతంత్య్రం వచ్చాక అంబేద్కర్‌ నాయకత్వాన మనకు మనం రాజ్యాంగం రాసుకుని పాలించుకుంటున్నాం. దాని ప్రకారం దళితులకు, ఆదివాసులకు, వెనుక బడిన వారికి, రిజర్వేన్లు కల్పించుకున్నాం. అవి అందిపుచ్చుకున్న కొందరు మంచి చదువులు చదువుకుంటున్నారు.
బంగారక్క (ప్రవేశం) : ఇప్పుడా రిజర్వేషన్‌లకు బిజెపి పాలకులు మరింతగా తూట్లు పొడుస్తున్నారు. తెలుసా?
ఇద్దరూ : ఎలా..?
బంగారక్క : శ్రద్ధగా వినండి. ఇటీవల ఉన్నత విద్యాలయాల్లో కుల వివక్షను నివారించాలని చెబుతూ ఆ సంస్థ యు.జి.సి. (యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌) కొన్ని నియమ నిబంధనలు విడుదల చేసింది. అదిగో అప్పటినుండి తక్కువ జాతోళ్లకు పెద్ద చదువులా.. అంటూ మళీ రిజర్వేషన్‌ల వ్యతిరేక ఉద్యోగం లేవదీశారు.
కేతిగాడు : అంటే రిజర్వేషన్‌లు ఇచ్చినట్టు పైకి ఫోజు పెడుతూనే దానికి వ్యతిరేకంగా మళ్లీ వాళ్లే ఉద్యమాలు చేస్తున్నారన్నమాట. ఎంత నాటకం?
బంగారక్క : అవును, ఇదో గొప్ప రాజకీయ నాటకం. పాపం రిజర్వేషన్లు పొందేవాళ్లను నానారకాలుగా తిడుతున్నారు. ‘దొంగ బ్రాహ్మలు, సర్కారీ దామాద్‌లు, అందలాలెక్కే పందులు’ అంటూ నానా యాగీ చేస్తూ అవమానిస్తూన్నారు.
కేతిగాడు : విన్నావురా జుట్టుపోలిగా. మనలాంటోళ్లుపై చదువులు చదవాలంటే ఎన్ని అవమానాలు పడాలో. ఎన్నెన్ని బాధలు పడాలో తెలిసిందా..?
జుట్టుపోలుగాడు : మరి బి.జె.పి వాళ్లు ఎందుకిలా చేస్తున్నారు.
బంగారక్క : ఎందుకంటే సనాతన ధర్మం పేరుతో వారు వర్ణాశ్రమ ధర్మం బలపరుస్తారు. కులాలు అలా ఎప్పటికీ వుండాలని కోరుకుంటారు. అదీకాక మనదేశంలో దళితులు, ఆదివాసుల కన్నా బడుగు బలహీనవర్గాల వారే ఎక్కువ. మరి వారి ఓట్లు కావాలంటే వారిని ఎలాగో అలా మసిపూసి మారేడు కాయ చేసి మచ్చిక చేసుకోవాలి. చివరికిప్పుడు ఆ అల్లర్ల కారణంగా యు.జి.సి. నిబంధనలు అమలు కాకుండా సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది.

– కె.శాంతారావు, 9959745723

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -