ఏ దేశానికైనా, ఏ సమాజానికైనా జీవశక్తిని ఇచ్చేది దాని పౌరుల మధ్య జరిగే ఆరోగ్యకరమైన సంవాదం (dialogue). భిన్నమైన అభిప్రాయాలు, విభిన్నమైన దక్కోణాలు స్వేచ్ఛగా వ్యక్తీకరించబడినప్పుడు, చర్చించబడినప్పుడు మాత్రమే ఆ సమాజం పరిణతి చెందుతుంది. ఇది మన రాజ్యాంగం మనకు ఇచ్చిన ప్రాథమిక వాగ్దానం. అయితే, ప్రస్తుత కాలంలో మనం ఏమి చూస్తున్నాం? వేగవంతమైన జీవితం, డిజిటల్ హౌరులో, లోతైన ఆలోచన, నిలకడగా సాగే చర్చలకు అవకాశం తగ్గుతోంది. విశ్వవిద్యాలయాలు ఏ సమాజానికైనా మేధోపరమైన దిక్సూచులు.
అయితే ప్రస్తుతం కేవలం ఉపాధి నైపుణ్యాలను అందించే కేంద్రాలుగా మారిపోతూ, వాటి అసలైన లక్ష్యమైన ‘విమర్శనాత్మక చింతన’ (Critical Thinking) కు దూరం అవుతున్నాయా అనే సందేహం కలుగుతోంది. భిన్నాభిప్రాయాన్ని శత్రుత్వంగా కాకపోయినా, కనీసం అసౌకర్యంగా చూసే వాతావరణం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో యువత తమ చుట్టూ ఉన్న సంక్లిష్ట ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తమ గొంతుకను, తమ ప్రత్యేకమైన అనుభవాన్ని ఎలా పంచుకోవాలి? తమ అస్తిత్వాన్ని ఎలా నిర్వచించుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ఒక సామూహిక ప్రయత్నమే ”సమూహ సెక్యులర్ రైటర్ ఫోరం” నిర్వహిస్తున్న ”యూత్ లిటరేచర్ ఫెస్టివల్”. ఇది కేవలం ఒక ఉత్సవం అనుకోవద్దు ఇది మన ప్రజాస్వామ్య, లౌకిక పునాదులను బలోపేతం చేసుకునే ఒక మేధోపరమైన ప్రక్రియ అంటున్న యూత్ లిటరేచర్ ఫెస్టివల్ కన్వీనర్ మెర్సీ మార్గరెట్ తో నవతెలంగాణ జోష్ తో పంచుకున్న విషయాలు…
అసలు సాహిత్యం ఏం చేస్తుంది?
ఈ ఉత్సవం ఆవశ్యకతను అర్థం చేసుకోవాలంటే, సాహిత్యం మన సమాజంలో పోషించే పాత్రను మనం పునర్మూల్యాంకనం చేసుకోవాలి. సాహిత్యం కేవలం కాలక్షేపం కాదు, పదాల గారడీ అంతకన్నా కాదు. సాహిత్యం ఒక వంతెన. మనకు ఏ మాత్రం పరిచయం లేని జీవితాల్లోకి, మనం ఎన్నడూ అనుభవించని వేదనల్లోకి, మనం ఊహించని సంతోషాల్లోకి మనల్ని తీసుకువెళ్లే వంతెన. ఇది మనలో ‘సానుభూతి’ ని నిర్మిస్తుంది. ‘ఇతరుల’ స్థానంలో మనల్ని మనం ఉంచి చూసుకోగలిగే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఈ సానుభూతి, ఈ పరస్పర అవగాహన లేనిదే ప్రజాస్వామ్యం మనలేదు. ఎందుకంటే, ‘ఇతరుల’ ఉనికిని, వారి హక్కులను గౌరవించడమే ప్రజాస్వామ్యానికి పునాది. సాహిత్యం మనల్ని అంతర్ముఖులను చేస్తుంది . మన నమ్మకాలను, మన అభిప్రాయాలను మనమే ప్రశ్నించుకునేలా చేస్తుంది. ఒక సమస్యను నలుపు-తెలుపుల్లో కాకుండా, దానిలోని అనేక పార్శ్వాలను అర్థం చేసుకునే వివేచనను ఇస్తుంది.
యువతకు, సాహిత్యానికి ఉన్న సంబంధం ఏమిటి?
యువత అంటే కేవలం వయసు కాదు. అదొక శక్తివంతమైన చైతన్య స్థితి. కొత్తదనాన్ని ఆశించే, నిలకడగా ఉన్న స్థితిని ప్రశ్నించే, మెరుగైన ప్రపంచం కోసం తపించే తత్వం అది. సాహిత్యం ఈ తపనకు, ఈ అన్వేషణకు ఒక దారి చూపుతుంది. ఒక భాషను ఇస్తుంది. ఒక యువకుడు తన చుట్టూ ఉన్న కుల, మత, లింగ వివక్షలను చూసినప్పుడు కలిగే ఆవేదనకు, అసంతప్తికి ఒక రూపాన్ని ఇవ్వడానికి సాహిత్యం సహాయపడుతుంది. తన అనుభవం కేవలం తన ఒక్కడిదే కాదని, తనలాంటి లక్షలాది మంది గొంతుక అందులో ప్రతిధ్వనిస్తుందన్నప్పుడు ధైర్యం వస్తుంది. సాహిత్యం యువతకు చారిత్రక స్పృహను అందిస్తుంది. మనం ఈరోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ, హక్కులు ఊరికే రాలేదని, వాటి కోసం తరతరాలుగా ఎందరో మేధావులు, సామాన్యులు చేసిన పోరాటాలు, చర్చలు ఉన్నాయని గుర్తుచేస్తుంది. ఈ చారిత్రక అవగాహన, వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికీ, భవిష్యత్తును నిర్మించుకోవడానికీ అవసరమైన పునాదిని ఇస్తుంది.
‘సమూహ’ ఈ ఉత్సవాన్ని ఎందుకు ఒక ‘ఆవశ్యకత’గా తీసుకుంది?
”సమూహ సెక్యులర్ రైటర్ ఫోరం” ఈ పేరులోనే మా లక్ష్యం స్పష్టంగా ఉంది. ‘సెక్యులర్’ (లౌకిక) అనేది మన రాజ్యాంగ ఆత్మ. ఇది కేవలం మత ప్రమేయం లేకపోవడం కాదు. ఇది ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే మన ఉనికికి, మన బహుళ సంస్కృతులకు ఇచ్చే హామీ. ప్రస్తుతం ఈ బహుళత్వాన్ని ప్రశ్నించి, ఏకశిలా సదశమైన గుర్తింపులను, ఆలోచనలను రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు, ‘సమూహ’ లాంటి సంస్థల బాధ్యత పెరుగుతుంది. యువతను సంకుచిత భావజాలాల వైపు కాకుండా, విశాలమైన, మానవతా విలువలున్న పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఈ ‘యూత్ లిటరేచర్ ఫెస్టివల్’ ఆ లక్ష్యంతోనే రూపుదిద్దుకుంది. ఇది ఒక వేడుక. మన భిన్నత్వాన్ని, మన బహుళ స్వరాలను జరుపుకునే వేడుక. యువతకు ఒక స్వేచ్ఛా వేదికను ఇచ్చి, వారి ఆలోచనలను, వారి సృజనాత్మకతను, వారి సందేహాలను ఎలాంటి భయం లేకుండా పంచుకునే వాతావరణాన్ని కల్పించడమే ఈ ఉత్సవం ముఖ్య ఉద్దేశం. ఇది మన లౌకిక, ప్రజాస్వామ్య విలువలను తర్వాతి తరానికి అందించే ఒక నిర్మాణాత్మక ప్రయత్నం.
ఈ ఉత్సవాన్ని మన బాధ్యతగా ఎందుకు చూడాలి?
మన పిల్లలు కేవలం ఇంజనీర్లుగా, డాక్టర్లుగా స్థిరపడితే సరిపోదు. వారు వివేచన కలిగిన, సామాజిక స్పహ ఉన్న, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలి. మార్కెట్ ఒత్తిళ్లకు, మూస ఆలోచనలకు లొంగిపోకుండా, స్వతంత్రంగా ఆలోచించగలిగే సామర్థ్యాన్ని వారికి అందించాలి. ఆలోచించే తరాన్ని నిర్మించడం కేవలం ప్రభుత్వాల బాధ్యతే కాదు. అది పౌర సమాజ ప్రాథమిక బాధ్యత. మనం ప్రతిరోజూ మన ఇళ్లలో, మన కార్యాలయాల్లో, మన స్నేహితులతో ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని ఆచరించాలి. ఆ ఆచరణలో భాగమే ఇలాంటి ఉత్సవాలకు అండగా నిలబడటం. ఈ యూత్ లిటరేచర్ ఫెస్టివల్‌ను ప్రోత్సహించడం అంటే, ఏదో ఒక కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం కాదు. అది మన భవిష్యత్ సమాజపు మేధోపరమైన ఆరోగ్యానికి మనం చేస్తున్న పెట్టుబడి. మన పిల్లలు రేపటి సమాజంలో కేవలం వినియోగదారులుగా కాకుండా, చైతన్యవంతమైన పౌరులుగా జీవించాలని మనం కోరుకుంటే, వారు భిన్నత్వాన్ని గౌరవిస్తూ, మానవీయ విలువలతో ఎదగాలని ఆశిస్తే, మనం ఇలాంటి వేదికలను నిర్మించాలి, వాటిని ప్రోత్సహించాలి.
ప్రపంచ సాహిత్యంలో తెలుగు యువత స్థానం ఏమిటి?
ఈ ప్రశ్నకు మనం నిజాయితీగా సమాధానం చెప్పుకోవాలి. ప్రపంచ సాహిత్యం అటుంచి, కనీసం భారతీయ సాహిత్యంలోనైనా మన యువత గొంతుక బలంగా వినిపిస్తోందా? మన సమాజంలో ఉన్నన్ని కథలు, సంఘర్షణలు మరెక్కడా ఉండవు. కులం, అధికారం, భూమి, లింగ వివక్ష, ఆధునికతకూ సంప్రదాయానికీ మధ్య నలిగిపోతున్న జీవితాలు, ఇవన్నీ అద్భుతమైన కథా వస్తువులు.
కానీ, ఆ కథలను ప్రపంచానికి చెప్పే వేదికలు ఎక్కడ ఉన్నాయి? మన యువ రచయితలను ప్రోత్సహించే, వారి రచనలపై లోతైన విమర్శనాత్మక చర్చ జరిపే వ్యవస్థ ఎక్కడ ఉంది? నాణ్యమైన అనువాదాల ద్వారా మన కథలను దేశంలోని ఇతర భాషలకు చేరవేసే ప్రయత్నం ఎంతవరకు జరుగుతోంది? ఈ శూన్యతను భర్తీ చేసే దిశగా ‘సమూహ’ వేస్తున్న ఒక ముఖ్యమైన అడుగు ఇది. యువ రచయితలకు కేవలం ఒక వేదికను ఇవ్వడమే కాదు, ”మీరు రాసేది ముఖ్యమైనది, మీ గొంతుకకు విలువ ఉంది, మీ అనుభవం ఈ దేశానికి అవసరం” అని చెప్పే ఒక బలమైన భరోసా. మన యువతను జాతీయ స్థాయి సంవాదంలో భాగస్వాములను చేసే ప్రయత్నం.
ఆలోచనలను పంచుకోవడం, భవిష్యత్తును నిర్మించడం దీంతో సాధ్యమేనా?
ఈ ఉత్సవం ఒక్కరోజులో సమాజాన్ని మార్చేస్తుందని ఎవరూ అనుకోరు. మార్పు ఒక నిరంతర ప్రక్రియ. కానీ, ఈ ఉత్సవం కొన్ని వందల మంది యువకుల మెదళ్లలో కొత్త ఆలోచనల విత్తనాలను నాటగలదు. సజనశీలతను మేల్కొలపగలదు. భిన్నమైన నేపథ్యాల నుండి వచ్చిన యువకులు ఒకచోట కూర్చుని, తమ అనుభవాలను, తమ కలలను, తమ భయాలను పంచుకున్నప్పుడు, వారి మధ్య ఒక కొత్త అవగాహన ఏర్పడుతుంది. అదే మన లౌకిక సమాజానికి రక్షణ కవచం. ప్రశ్నించే గొంతుకలను ప్రోత్సహించడం, భిన్నాభిప్రాయాన్ని గౌరవించే సంస్కృతిని నిర్మించడం, సానుభూతి కలిగిన సమాజాన్ని సష్టించడం ఇదే ఈ ‘సమూహ యూత్ లిటరేచర్ ఫెస్టివల్’ అంతిమ లక్ష్యం. అందుకే, ఈ ఉత్సవంలో యువత కేవలం ప్రేక్షకులు కారు. భాగస్వాములు. ఆలోచించే, ప్రశ్నించే, అర్థం చేసుకోగలిగే యువతరం ఉన్న సమాజం మాత్రమే ఆరోగ్యంగా మనగలుగుతుంది. అందుకే యువతకు ఆహ్వానం పలుకుతున్నాం. ఈ యువ సాహిత్యోత్సవంలో మీరు కూడా భాగస్వాములు కండి. రండి మీ స్వరాలు తీసుకు రండి, మీ గళాలు తీసుకు రండి , మీ కలాలు తీసుకు రండి.
ఉత్సవంలో ముఖ్యాంశాలు:
ఈ లక్ష్యాలను ఆచరణలో పెట్టడానికే, ”సమూహ యూత్ లిటరేచర్ ఫెస్టివల్” ఒక విస్తతమైన చర్చా వేదికను సిద్ధం చేసింది. ”గోడల్ని ఛేదించే అక్షరాలు” (Words Against Walls) అనే ప్రధాన నినాదంతో ఈ సాహిత్యోత్సవం జరగనుంది.
‘దిక్సూచి’, ‘ఆవాజ్’ అనే రెండు వేదికల ద్వారా సమాంతరంగా అనేక అంశాలపై లోతైన సంభాషణలు జరగనున్నాయి.
విద్వేష కాలంలో రచయితలు (The Writer in Times of Hate): ప్రస్తుత క్లిష్ట సమయంలో రచయితల పాత్ర, బాధ్యత, మరియు వారు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ ప్యానెల్ దృష్టి సారిస్తుంది.
ప్రతిఘటన రూపంలో రచన (Writing as Resistance): ముఖ్యంగా మహిళా కవులు, రచయిత్రుల గొంతుకను, వారి రచనల ద్వారా వ్యక్తమవుతున్న ప్రతిఘటనను ఈ సెషన్ చర్చిస్తుంది.
బహుళ అస్తిత్వాలు – నిరసన గళాలు (Plural Identity – Voices of Dissent): మన సమాజంలోని విభిన్న అస్తిత్వాల నుండి వెలువడుతున్న నిరసన స్వరాలను, వాటి ప్రాముఖ్యతను ఈ చర్చ అన్వేషిస్తుంది.
భాష, అస్తిత్వం – ప్రతిఘటన స్వరాలు (Language, Identity & Resistance): భాషకు, అస్తిత్వానికి, ప్రతిఘటనకు మధ్య ఉన్న విడదీయరాని సంబంధాన్ని ఈ ప్యానెల్ విశ్లేషిస్తుంది.
ప్రచురణ రంగంలో సవాళ్లు (Challenges in Publication): యువ రచయితలు తమ రచనలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రచురణా రంగంలో ఎదుర్కొంటున్న అడ్డంకులపై ఇది చర్చిస్తుంది.
ఈ మేధోమథనంతో పాటు, సజనాత్మక ప్రక్రియలపై కూడా ప్రత్యేక సెషన్లు ఉన్నాయి:
కవిత్వంతో సంభాషణ (A dialogue with Poetry): ప్రముఖ కవులు యాకూబ్, ఆర్. సీతారాం వంటి వారు కవితా నిర్మాణం, వస్తు నిర్వహణపై తమ అనుభవాలను పంచుకుంటారు.
కథతో ప్రయాణం (Journey with story): బియస్ రాములు, బమ్మిడి జగదీశ్వర రావు, వేంపల్లె షరీఫ్ వంటి కథకులు కథా రచనలోని వివిధ అంశాలపై చర్చిస్తారు.
ధిక్కార కవి స్వరం(Voice of Defiance): నేపాలీ కవి మనోజ్ బోగటితో ప్రత్యేక సంభాషణ ఉంటుంది.
పుస్తకంతో కాసేపు (Book Talks): లౌకిక, ప్రజాస్వామిక భావనలకు దగ్గరగా ఉన్న పుస్తకాలపై ప్రత్యేక చర్చలు జరుగుతాయి.
వీటికి అదనంగా, JNTU ఫైన్ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థుల ఆర్ట్ ఎగ్జిబిషన్, మరియు సాయంత్రం ”లయాత్మక ప్రతిఘటన” (Rhythm of Resistance) పేరుతో పాట, ఆట, మాటలతో కూడిన సాంస్కతిక కార్యక్రమం ఈ ఉత్సవంలో భాగం. ఈ చర్చలు, సంభాషణలు కేవలం వినడానికే కాదు, యువత చురుకుగా పాల్గొనడానికి, ప్రశ్నించడానికి, వారి ఆలోచనలను పంచుకోవడానికి ఒక వేదికను అందిస్తున్నాయి. ఇది మనందరి సామూహిక బాధ్యత.

అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417


