Saturday, May 24, 2025
Homeతాజా వార్తలుబీమా రంగ చరిత్రలో ఇది ఒక సరికొత్త అధ్యాయం: ఎల్‌ఐసీ

బీమా రంగ చరిత్రలో ఇది ఒక సరికొత్త అధ్యాయం: ఎల్‌ఐసీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అరుదైన ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. కేవలం 24 గంటల వ్యవధిలో అత్యధిక సంఖ్యలో బీమా పాలసీలను విక్రయించి గిన్నిస్ వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది జనవరి 20వ తేదీన ఈ అసాధారణ విజయాన్ని అందుకున్నట్లు ఎల్‌ఐసీ తాజాగా ఓ ప్రకటనలో అధికారికంగా తెలియజేసింది. తమకున్న భారీ ఏజెంట్ల వ్యవస్థ వల్లే ఈ ఘనత సాధ్యమైందని, దీనిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించిందని సంస్థ పేర్కొంది.

జనవరి 20న దేశవ్యాప్తంగా ఉన్న ఎల్‌ఐసీ ఏజెంట్లు అద్భుతమైన పనితీరు కనబరిచారు. ఆ ఒక్క రోజే, ఏకంగా 4,52,839 మంది ఏజెంట్లు కలిసి మొత్తం 5,88,107 జీవిత బీమా పాలసీలను జారీ చేసినట్లు ఎల్‌ఐసీ తెలిపింది. బీమా రంగ చరిత్రలో కేవలం 24 గంటల్లో ఇన్ని పాలసీలు జారీ కావడం ఇదే మొట్టమొదటిసారని సంస్థ తెలిపింది.

తమ ఏజెంట్లు తమ కార్యదక్షతతో ఒక నూతన ప్రమాణాన్ని నెలకొల్పారని ప్రశంసించింది. ఇది తమ ఏజెంట్ల అలుపెరగని కృషికి, అంకితభావానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడింది. ఎల్‌ఐసీ తన వినియోగదారులకు, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే తమ ప్రధాన లక్ష్యానికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది.

ఎల్‌ఐసీ వ్యవస్థాపక దినోత్సవమైన జనవరి 20న ‘మ్యాడ్ మిలియన్ డే’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) అయిన సిద్ధార్థ మొహంతి, ప్రతి ఏజెంట్ కనీసం ఒక్క పాలసీ అయినా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఏజెంట్లు ఉత్సాహంగా పాల్గొని ఈ అరుదైన రికార్డును సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -