సిట్‌ను నేనూ ప్రశ్నలు అడుగుతా
రేవంత్‌రెడ్డికి పరిపాలన రాదు..చేతకాదు : ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
”ఇదో లొట్ట పీస్ కేసు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏముంది.. సిట్ విచారణకు హాజరవుతా.. నేనూ సిట్‌ను ప్రశ్నలు అడుగుతా.. సీఎం రేవంత్‌రెడ్డికి పాపం పరిపాలన రాదు, చేతగాదు, అసమర్థుడు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు.. 420 హామీలు ఇచ్చి అడ్డగోలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు” అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు.. ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ గేమ్స్ ఆడాలి కాబట్టే కేసులు తెరమీదకు తెస్తున్నారని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొన్న హరీశ్‌రావు కాంగ్రెస్ వారి బొగ్గు కుంభకోణాన్ని బయట పెటినందుకే సాయంత్రం కల్లా ఆయనకు సిట్ నోటీసు ఇచ్చిందని చెప్పారు.
2015లో మా ఎమ్మెల్యేలను కొంటూ రూ.50 లక్షల రూపాయలతో ఒక సన్నాసి దొరికిండని విమర్శించారు. ప్రభుత్వాన్ని కూలగొట్టే కుట్రలు ఎవరైనా చేస్తే వాళ్ళ ఫోన్లు పోలీసులు విన్నారేమో నాకేం తెలుసని అన్నారు. అట్లనే ఇంకెవరైనా చేసిండ్రేమో.. పోలీసులు విన్నారేమో.. మంత్రులకు ఏం తెలుస్తదన్నారు. ప్రస్తుతం మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పి జర్నలిస్టులకు చెప్తే వార్తలు రాసినా ఇంతవరకు ప్రభుత్వం ఖండించలేదని అన్నారు. మంత్రుల ఫోన్‌లు ట్యాప్ చేయట్లేదని ప్రమాణం చేస్తారా? అని ప్రశ్నించారు. సిట్ ఎవరిని పిలవాలి.. నిజానికి గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పని చేసి ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్‌రెడ్డిని పిలిచారా? అని ప్రశ్నించారు. ముందు ఆయనను విచారించాలన్నారు.
కాళేశ్వరం స్కామ్, ఫోన్ ట్యాపింగ్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి సిట్ అంటే.. సిట్, స్టాండ్, సిట్ విచారణ సీరియల్‌లా మారిందన్నారు. ఆర్ ఆర్ ట్యాక్స్, బొగ్గు కుంభకోణంపై మాత్రం సిట్ ఉండదు.. ఏదో రూపంలో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సిట్ విచారణకు ఖచ్చితంగా హాజరువతానని, ఫోన్ ట్యాపింగ్ కేసులో సంబంధంలేని నేతలను ప్రశ్నించారని అన్నారు. తన ఫోన్ ట్యాప్ అవుతుందా? అని సిట్ అధికారులను కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతానని అన్నారు. తాము అధికారంలోకొచ్చాక ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారులు బలవుతారని చెప్పారు.



