Saturday, November 29, 2025
E-PAPER
Homeజాతీయంఇదంతా పెద్ద కుట్ర

ఇదంతా పెద్ద కుట్ర

- Advertisement -

ప్రజలు అప్రమత్తంగా వుండాలి : సర్‌ ప్రక్రియపై అఖిలేశ్‌ విమర్శ

లక్నో : ఎన్నికల కమిషన్‌ అమలు చేస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ శుక్రవారం తాజాగా దాడి చేశారు. ఈ దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఇందులో పెద్ద కుట్ర దాగి వుందని, వలసవాద కాలం నాటి కన్నా అధ్వాన్నమైన పరిస్థితుల్లోకి పౌరులను నెట్టేస్తుందని విమర్శించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఎక్స్‌లో 20సెకండ్ల వీడియో పెట్టారు. బీజేపీ అమలు చేస్తున్న ఈ మెగా కుట్రకు వ్యతిరేకంగా మనమంతా సమైక్యంగా వుండి ఎండగట్టాలని ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ”ఇదంతా ప్రజాస్వామ్యాన్ని మోసం చేయడమే, ప్రజలు అప్రమత్తంగా వుండాలి, ఈరోజు ఓట్లలో కోత వుంటుంది, రేపు పేర్లను భూ రికార్డులు, రేషన్‌ కార్డులు, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు, రిజర్వేషన్లు, చివరకు బ్యాంక్‌ ఖాతాలు, లాకర్ల నుంచి తొలగిస్తారని అఖిలేశ్‌ ఎక్స్‌ పోస్టులో విమర్శించారు.

ప్రజలు తక్షణమే మేల్కోని, ప్రతి ఒక్క ఓటును కాపాడుకోవాలన్నారు. బీజేపీ నేతలు, మిత్రపక్షాలు కలిసి బహిరంగంగా చేస్తున్న ఈ దోపిడీ నుండి దేశాన్ని కాపాడాలన్నారు. మన ఓటు ద్వారా మన గుర్తింపును కాపాడుకోవాలన్నారు. లేనిపక్షంలో మనల్ని బయటివారుగా వారు ప్రకటిస్తారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర ప్రతినిధి హరీశ్చంద్ర శ్రీవాత్సవ ఈ ప్రచారాన్ని తిప్పికొట్టారు. తన పోస్టు ద్వారా ప్రజల్లో ఒక రకమైన భయం, ఆందోళన వ్యాప్తి చేయడానికి ఎస్‌పీ చీఫ్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇది డిజిటల్‌ భారత్‌ అని, ప్రజలకు వాస్తవం తెలుసని, వారు తప్పుదారి పట్టరని అన్నారు. ప్రస్తుతం 9 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్‌ ప్రక్రియ కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -