Monday, November 3, 2025
E-PAPER
Homeఆటలుఇది నా కల. మీరు దాన్ని నిజం చేశారు: ఝులన్ గోస్వామి

ఇది నా కల. మీరు దాన్ని నిజం చేశారు: ఝులన్ గోస్వామి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. కోట్లాది మంది అభిమానుల దశాబ్దాల కలను నిజం చేస్తూ తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఆదివారం, నవంబర్ 2న జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి విశ్వవిజేతగా అవతరించింది. ఈ చారిత్రక విజయం అనంతరం, భారత క్రికెట్ దిగ్గజం ఝులన్ గోస్వామి భావోద్వేగంతో కన్నీటిపర్యంతమయ్యారు. ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. ట్రోఫీ ప్రజెంటేషన్ తర్వాత భారత జట్టు మైదానంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఈ సమయంలో బ్రాడ్‌కాస్టర్ల తరఫున కామెంటరీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మాజీ దిగ్గజాలు ఝులన్ గోస్వామి, మిథాలీ రాజ్, అంజుమ్ చోప్రాలను కలుసుకున్నారు. విజేత జట్టు వారిని తమ సంబరాల్లో భాగం చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ స్వయంగా ప్రపంచకప్ ట్రోఫీని ఝులన్ చేతికి అందించారు. తన సుదీర్ఘ కెరీర్‌లో సాధ్యం కాని కల, జట్టు నెరవేర్చడంతో ఝులన్ తన కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. 2017లో ప్రపంచకప్‌కు అత్యంత చేరువగా వచ్చి ఓటమి పాలైన ఝులన్‌కు ఇది ఎంతో ప్రత్యేకమైన క్షణంగా నిలిచిపోయింది.

ఈ గెలుపుపై ఝులన్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. “ఇది నా కల. మీరు దాన్ని నిజం చేశారు. షఫాలీ వర్మ 70 పరుగులు, రెండు వికెట్లు.. దీప్తి శర్మ అర్ధశతకం, ఐదు వికెట్లు.. ఇద్దరి నుంచి అద్భుతమైన ప్రదర్శన. కప్ మన ఇంటికి వచ్చింది” అని ట్వీట్ చేశారు. ఈ భావోద్వేగ క్షణాల వెనుక ఉన్న కారణాన్ని ఝులన్ స్వయంగా వెల్లడించారు. “ఈ ప్రపంచకప్‌కు ముందు హర్మన్‌ప్రీత్, స్మృతి నాకు ఒక మాట ఇచ్చారు. ‘మేము నీకోసం కప్ గెలుస్తాం’ అని చెప్పారు. 2022లో మేము సెమీఫైనల్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయాం. అప్పుడు అర్ధరాత్రి హర్మన్, స్మృతి నా గదికి వచ్చి.. ‘వచ్చేసారి నువ్వు మాతో ఉంటావో లేదో తెలీదు, కానీ నీకోసం ట్రోఫీ గెలుస్తాం’ అని నాకు మాటిచ్చారు. చివరికి వాళ్లు దాన్ని చేసి చూపించారు. అందుకే నేను అంతగా భావోద్వేగానికి గురయ్యాను” అని ఝులన్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -