నవతెలంగాణ-హైదరాబాద్: తమ హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం చలో సెక్రటేరియట్‌కు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో … తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఆయా డిపోల నుంచి హైదరాబాద్ చేరుకునేందుకు సిద్దమవుతుండటంతో పోలీసులు అడ్డుకోవద్దని కోరారు. ఈ మేరకు సోమవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల గురించి ఇచ్చిన హామీలనే అమలు చేయాలని ఫిబ్రవరి 24వ తేదీ చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నామని టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. ‘ ఆర్టీసీ సంస్థ రక్షణ కోసం జరుగుతున్న పోరాటం, ఇది మా ఆత్మగౌరవ పోరాటం, ఇది మా ఆకలి పోరాటం, ఇది మా బతుకు పోరాటం, ఇది మా హక్కులకై పోరాటం, మా శ్రమ దోపిడీపై పోరాటం, మా శ్రమకు తగ్గ ఫలితానికై పోరాటం, మా కార్మిక సంఘాల కోసం పోరాటం చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ పోరాటం శాంతియుతంగా, గాంధేయ మార్గంలో నిర్వహించబోతున్నామని తెలిపారు. ఫిబ్రవరి 24న రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని ఈదురు వెంకన్న కోరారు. ఆర్టీసీ ఉద్యోగులు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌కు రాకుండా పోలీసులు అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుల గోసలు, గోడులు, ఆక్రందనలు చూసి ఈ ప్రభుత్వం దిగిరావాలనే కార్మికవర్గమంతా తరలివస్తున్నారని చెప్పారు. దీన్ని భగం చేసే ప్రయత్నం అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు చేయకూడదని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి బస్సులు అక్కడే వదిలేసి, విధుల బహిష్కరణకు పిలుపునివ్వాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇది మా ఆకలి,బతుకు పోరాటం..అడ్డుకోకండి: టీఎస్ ఆర్టీసీ కార్మికులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



