Wednesday, December 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఇదీ మన 'విజన్‌'

ఇదీ మన ‘విజన్‌’

- Advertisement -

– 2047 డాక్యుమెంట్‌లో ముఖ్యాంశాలు
– అన్ని రంగాల్లోనూ నిరంతర అభివృద్ధి
– కోర్‌… ప్యూర్‌… రేర్‌ పేరుతో మూడు కారిడార్‌లుగా విభజన
– 3 ట్రిలియన్‌ డాలర్ల వృద్ధి లక్ష్యం

రాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశించే రోడ్‌ మ్యాప్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అన్ని రంగాల్లో అన్‌స్టాపబుల్‌ అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ”తెలంగాణ రైజింగ్‌ 2047” డాక్యూమెంట్‌ను రూపొందించింది. రాబోయే రెండు దశాబ్దాల్లో రాష్ట్రాన్ని సమగ్రంగా, సమ్మిళిత, సుస్థిర భవిష్యత్‌కు విధాన పత్రం బాటలు వేయనుంది. మంగళవారం ఫ్యూచర్‌ సిటీలో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2047 ముగింపు సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలకు ఇందులో చోటు కల్పించారు. దీని తయారీలో నిటి ఆయోగ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ప్రొఫెసర్లు పాలుపంచుకున్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడమే ప్రధాన విజన్‌గా రూపొందించారు. అదునాతన సాంకేతికత, కొత్త ఆవిష్కరణలు, సమర్థవంతమైన ఆర్థిక వనరులతో పాటు సుపరిపాలన ఈ ఆర్ధిక వృద్ధికి దోహదంగా పని చేస్తాయని ఇందులో పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి కోర్‌, ప్యూర్‌, రేర్‌ అనే మూడు-జోన్ల నమూనాను కీలకంగా ప్రస్తావించారు. హైదరాబాద్‌ సిటీతో పాటు పరిసర ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య సమతుల్య, పరస్పర ఆధారిత వృద్ధిని సాధించాలని నిర్ణయించారు. 2047 నాటికి జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా పదో వంతుకు చేరాలని లక్ష్యమని పేర్కొన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా, ఆవిష్కరణలకు కేంద్రంగా తెలంగాణను ప్రపంచ స్థాయి మౌలిక వసతులున్న అత్యాధునిక రాష్ట్రంగా తీర్చిదిద్దటం, అన్ని వర్గాలకు సమాన గౌరవం, సమాన అవకాశాలు కల్పించే ఆదర్శవంతమైన రాష్ట్రంగా నిలబెట్టడాన్ని ప్రస్తావించారు.

ఆర్థిక, సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి
2047 లక్ష్య సాధనకు మూడు సూత్రాలను ఇందులో ప్రతిపాదించారు. 1. ఆర్థిక వృద్ధి ఆవిష్కరణలు, ఉత్పాదకత ఆధారిత వృద్ధి ద్వారా 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడం. 2. యువత, మహిళలు, రైతులు, అణగారిన వర్గాలతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు వృద్ధి ఫలాలు అందేలా సమ్మిళిత అభివృద్ధి 3. అన్ని రంగాల్లో సుస్థిరతను పొందుపర్చడం, 2047 నాటికి నెట్‌-జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించారు. సాంకేతికత, ఆవిష్కరణలు, పరిశ్రమలు సేవల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు, పెట్టుబడులను ఆకర్షించడానికి, ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి వినూత్న ఆర్థిక నమూనాలను రూపొందించనున్నారు. అబివృద్థి, సంక్షేమంతో పాటు అన్ని రంగాల్లో సుపరిపాలన, పారదర్శక, జవాబుదారీ తనాన్ని అందించాలని ప్రతిపాదించారు.

లక్ష్య సాధనకు మూడంచెల వ్యూహం
తెలంగాణ భౌగోళిక ప్రాంతాన్ని మూడు విభిన్న, రంగాల వారీగా ఇందులో విభజించారు. ఈ విధానం సమతుల్య ప్రాంతీయ అభివృద్ధికి పునాదులు వేస్తుంది.
1)కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ: 160 కిలోమీటర్ల ఔటర్‌ రింగ్‌ రోడ్‌(ఓఆర్‌ఆర్‌) లోపల ఉన్న హైదరాబాద్‌ సిటీ ప్రాంతం. సేవల విస్తరణకు ప్రాధాన్యం, నెట్‌-జీరో సిటీగా అభివృద్ధి చెందుతుంది. ఇది ప్రపంచ స్థాయి నాలెడ్జ్‌, ఆవిష్కరణల కేంద్రంగా వృద్ధి చెందుతుంది.
2). అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ: ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌), 360 కిలోమీటర్ల ప్రాంతీయ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) మధ్య ఉన్న జోన్‌గా నిర్ణయించారు. ఇది భవిష్యత్‌లో తయారీ రంగానికి కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ పారిశ్రామిక క్లస్టర్లు, లాజిస్టిక్స్‌ హబ్‌లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారు. ఫలితంగా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది.
3).రూరల్‌ అగ్రికల్చర్‌ రీజియన్‌ ఎకానమీ: ప్రాంతీయ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) దాటి, రాష్ట్ర సరిహద్దుల వరకు విస్తరించి ఉన్న ప్రాంతంగా దీన్ని నిర్ణయించారు. వ్యవసాయం, హరిత ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు ధీటుగా వృద్ధి చెందుతందని డాక్యుమెంట్‌లో ప్రస్తావించారు.

పది కీలక వ్యూహాలు
2047 దార్శనికతను సాధించడానికి 10 కీలక వ్యూహాలను డాక్యుమెంట్‌లో ప్రస్తావించారు.

  1. 3-జోన్ల రాష్ట్రం : సమతుల్య అభివృద్ధికి క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ నమూనా.
  2. విచక్షణ నుంచి విధానానికి : పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత. విధానపరమైన నిర్ణయాలను ప్రోత్సహించడం.
  3. గేమ్‌-ఛేంజర్‌ ప్రాజెక్ట్‌లు : భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, మూసీ పునరుజ్జీవనం, డ్రై పోర్ట్‌, బందర్‌ పోర్ట్‌ వరకు గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే, రీజినల్‌ రింగ్‌ రోడ్‌. రింగ్‌ రైలు, బుల్లెట్‌ రైలు, కారిడార్ల వంటి ప్రాజెక్టులు.
  4. సమర్ధపాలన : డిజిటల్‌ గవర్నమెంట్‌, టీ ఫైబర్‌, స్పీడ్‌ వంటి కార్యక్రమాలతో పాలనా సామర్థ్యాన్ని పెంచడం.
  5. నాలెడ్జ్‌ హబ్‌ : ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన సంస్థలను ఆకర్షించడం.
  6. సుస్థిర సంక్షేమం : మహిళలు, రైతులు, యువతపై ప్రత్యేక దృష్టి. ఆరోగ్యం, విద్య, జీవనోపాధి అందరికీ సమాన అవకాశాలు.
  7. అభివృద్ధి నిధులు : మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ల్లో ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం.
  8. పర్యావరణం, సుస్థిరత వాతావరణ మార్పులతో వాటిల్లే నష్టాలను తగ్గించడం.
  9. సంస్కృతి : రాష్ట్ర సాంస్కృతిక వారసత్వమైన, కళలు, పర్యాటకాన్ని పరిరక్షించడం, ప్రోత్సహించడం.
  10. ప్రజల యొక్క, ప్రజల కోసం, ప్రజల చేత అనే విధానం ద్వారా పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని నిర్ధారించాలని ప్రతిపాదించారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -