దక్షిణాఫ్రికాపై 10వికెట్ల తేడాతో ఘన విజయం
ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్
గౌహతి: ఐసిసి మహిళల వన్డే ప్రపంచ కప్ ఇంగ్లండ్‌కు అదిరే ఆరంభం లభించింది. దక్షిణాఫ్రికా మహిళలపై ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తొలుత దక్షిణాఫ్రికాను 69 పరుగులకే పరిమితం చేసిన ఇంగ్లండ్.. ఆ లక్ష్యాన్ని 14.1 ఓవర్లకే పూర్తి చేసింది. ఓపెనర్లు టమ్మీ బ్యూమంట్ (40నాటౌట్), అమీ జోన్స్(18 నాటౌట్) దూకుడైన ఆటతో సఫారీ బౌలర్లకు దడ పుట్టించారు. దక్షిణాఫ్రికా బౌలర్ ఖాక ఓవర్లో బ్యూమంట్ సింగిల్ తీయడంతో ఇంగ్లండ్ భారీ విజయాన్ని మూటగట్టుకుంది. అంతకుముందు ఇంగ్లండ్ బౌలర్లు లినే స్మిత్ (3/7) సంచలన స్పెల్‌తో సఫారీలను దెబ్బకొట్టగా.. నాట్ సీవర్ బ్రంట్(2/5), చార్లీ డీన్(2/14)లు తలా రెండేసి వికెట్లతో మెరిశారు. దాంతో.. లారా వొల్వార్డ్త్ బృందం 20.4ఓవర్లలో 69 పరుగులకే ఆలౌటయ్యింది. జోఫ్రా(22) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
రెండో ఓవర్‌లోనే కెప్టెన్ లారా వొల్వార్డ్(5)ను లినే స్మిత్ ఔట్ చేసి ఇంగ్లండ్‌కు శుభారంభమిచ్చింది. ఆ తర్వాత.. తంజిమ్ బ్రిట్స్(5), సునే లుస్(2)లను బౌల్డ్ చేసిన స్మిత్ సఫారీలను దెబ్బతీసింది. అనంతరం.. మరినే కాప్ (4)సైతం పెవిలియన్ చేర్చిన ఆమె దక్షిణాఫ్రికాను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టింది. టాపార్డర్ బ్యాటర్లు వెనుదిరుగుతున్నా సినాలో జఫ్తా(22) ఒంటరిపోరాటం చేసింది. కానీ, ఆమెను ఎకిల్‌స్టోన్ బౌల్డ్ చేయడంతో దక్షిణాఫ్రికా కోలుకోలేకపోయింది. మరో ఎండ్ నుంచి .. నాట్ సీవర్ బ్రంట్(2-5), చార్లీ డీన్(2-14) పోటీపడుతూ వికెట్ల వేట కొనసాగించి సఫారీలను ఆలౌట్ అంచున నిలిపారు. చివరి వికెట్ అయిన మలబా(3)ను డీన్ బౌల్డ్ చేయడంతో సఫారీల ఇన్నింగ్స్ 69 పరుగులవద్ద ముగిసింది. వన్డేల్లో దక్షిణాఫ్రికాకు ఇదే మూడో అత్యల్ప స్కోర్. గతంలో.. 2009లో న్యూజిలాండ్‌పై 51కే ఆ జట్టు కుప్పకూలింది. పాకిస్థాన్‌పై 2019లో 63 రన్స్‌కే సఫారీ టీమ్ ఆలౌటయ్యింది. తక్కువ స్కోర్‌కు ఆలౌట్ కావడం ఇది మూడోసారి.
స్కోర్‌బోర్డు…
దక్షిణాఫ్రికా మహిళల ఇన్నింగ్స్: వోల్వడార్ట్ (సి అండ్ బి)స్మిత్ 5, బ్రిట్స్ (బి)స్మిత్ 5, లూస్ (బి)బెల్ 2, కాప్ (బి)స్మిత్ 4, బోట్చ్ (ఎల్‌బి)స్కీవర్ బ్రంట్ 6, జోఫ్రా (బి)ఎక్లేస్టోన్ 22, ట్రయాన్ (సి)కాప్సే (బి)స్కీవర్ బ్రంట్ 2, క్లార్క్ (సి)నైట్ (బి)ఎక్లేస్టోన్ 3, క్లాస్ (బి)ఛార్లీ డీన్ 3, ఖాకా (నాటౌట్) 6, మబా (బి)ఛార్లీ డీన్ 3, అదనం 8. (20.4ఓవర్లలో ఆలౌట్) 69పరుగులు.
వికెట్ల పతనం: 1/9, 2/12, 3/17, 4/19, 5/31, 6/38, 7/48, 8/70, 9/60, 10/69
బౌలింగ్: లారెన్ బెల్ 4-0-24-1, లిన్సే స్మిత్ 4-2-7-3, స్కీవర్ బ్రంట్ 3-1-5-2, సోఫీ ఎక్లేస్టోన్ 6-2-19-2, ఛార్లీ డీన్ 3.4-0-14-2.
ఇంగ్లండ్ మహిళల ఇన్నింగ్స్: బ్యూమౌంట్ (నాటౌట్) 21, అమీ జోన్స్ (నాటౌట్) 40, అదనం 12. (14.1ఓవర్లలో) 73పరుగులు.
బౌలింగ్: మారిజానే కాప్ 4-0-13-0, ట్రయాన్ 3-0-17-0, క్లాస్ 4-0-18-0, మాబా 2-1-9-0, ఖాకా 1.1-0-13-0.