– సంజు శాంసన్‌పైనే ఫోకస్
– భారత్, న్యూజిలాండ్ ఐదో టీ20 నేడు
– రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
భారత్, న్యూజిలాండ్ టీ20 సవాల్ అంతిమ ఘట్టానికి చేరుకుంది. హ్యాట్రిక్ విజయాలతో భారత్ సిరీస్ సొంతం చేసుకోగా.. భారత్ జోరుకు న్యూజిలాండ్ నాల్గో టీ20లో బ్రేక్ వేసింది. సిరీస్ ఫలితంపై ఇరు జట్లలోనూ పెద్దగా ప్రభావం లేదు.
కానీ ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముంగిట తుది జట్టు సమీకరణాలు, జట్టు సమతూకం చుట్టూ వ్యూహం నడుస్తోంది. పొట్టి ప్రపంచకప్ ముంగిట చివరి టీ20 ఆడనున్న భారత్ బ్యాటింగ్ లైనప్‌పై ఓ స్పష్టతకు రానుంది. తిరువనంతపురంలో భారత్, న్యూజిలాండ్ ఐదో టీ20 నేడు.
నవతెలంగాణ-తిరువనంతపురం
ఐసీసీ టీ20 ప్రపంచకప్ సన్నాహకం చివరి అంకానికి చేరుకుంది. స్వదేశంలో న్యూజిలాండ్‌పై తొలి మూడు మ్యాచ్‌ల్లో విజృంభించిన భారత్..ఓ మ్యాచ్‌లో తేలిపోయింది. ఓపెనర్ సంజు శాంసన్ ఫామ్ ఆందోళన రేకెత్తిస్తున్నా.. మరో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్ చాటుకోవటం జట్టు మేనేజ్‌మెంట్‌కు సానుకూలం. అటు బ్యాటింగ్, అటు బౌలింగ్ లైనప్‌లో ఒకరిద్దరు ఆటగాళ్లు కుదురుకునేందుకు, టీ20 ప్రపంచకప్ ముంగిట ఆత్మవిశ్వాసం సాధించేందుకు నేటి మ్యాచ్ ఎంతో కీలకం. సిరీస్‌ను విజయంతో ముగించాలని ఇటు భారత్, అటు న్యూజిలాండ్ ఎదురుచూస్తుండగా నేడు తిరువనంతపురంలో ఆఖరు టీ20 పోరు.
సంజుకు సవాల్
న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో భారత్ పలు సమస్యలకు పరిష్కారాలు అన్వేషించింది. అయితే, ఈ రెండు సిరీస్‌ల్లోనూ బ్యాట్‌తో నిరాశపరిచిన వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్‌పై ఇప్పుడు ఫోకస్ కనిపిస్తోంది. శుభ్‌మన్ గిల్‌కు ఓపెనర్ స్థానం కోల్పోయిన తర్వాత తుది జట్టులో చోటు గల్లంతు చేసుకున్న సంజు శాంసన్.. మిడిల్ ఆర్డర్‌లో అవకాశం వచ్చినా మెప్పించలేదు. ఇప్పుడు మళ్లీ ఓపెనర్‌గా అవకాశం చిక్కినా.. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నిరాశపరిచాడు. 10, 6, 0, 24 పరుగులతో శాంసన్ తేలిపోయాడు. గత ఏడాది ఆరంభం నుంచి 19 మ్యాచ్‌ల్లో ఆడిన సంజు శాంసన్ 129.06 స్ట్రయిక్‌రేట్‌తో 262 పరుగులే చేశాడు. బ్యాటింగ్ సగటు 17.46 మాత్రమే. ఈ సమయంలో సంజు శాంసన్ అత్యధిక స్కోరు 56 కాగా.. అది ఓమన్‌పై సాధించటం గమనార్హం. వీటిలో పది మ్యాచ్‌ల్లో క్యాచౌట్‌గా నిష్క్రమించిన సంజు శాంసన్.. నాలుగు సార్లు క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. క్రీజులో ఆత్మవిశ్వాసం లేకుండా కదులుతున్న సంజు శాంసన్ బౌలర్లకు వికెట్‌ను పువుల్లో పెట్టి ఇస్తున్నాడు. మరో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఈ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో ప్రపంచకప్ తుది జట్టులో సంజు శాంసన్ ఓపెనర్ స్థానాన్ని ఇషాన్ కిషన్‌కు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచనలు మారకముందే.. నేడు సొంతగడ్డపై సంజు శాంసన్ తనదైన ఇన్నింగ్స్‌తో కదం తొక్కాల్సి ఉంది. లేదంటే, టీ20 ప్రపంచకప్‌లో సంజు శాంసన్ బెంచ్‌కు పరిమితం కావాల్సిందే.
కివీస్‌తో సిరీస్‌లో భారత బ్యాటర్లు గొప్పగా ఆడారు. కానీ బ్యాటింగ్ లైనప్‌లో ఒకరిద్దరు విఫలమైతే.. దూకుడును కొనసాగించటంలో ఎదురయ్యే ఇబ్బందులు గత మ్యాచ్‌లో చూశాం. భయమెరుగని క్రికెట్ ఆడుతూనే, పరిస్థితులకు అనుగుణంగా జట్టును గెలుపు దిశగా నడిపించే ప్రణాళికలు అవసరం. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శివం దూబె, రింకు సింగ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. గాయం నుంచి కోలుకుంటే ఇషాన్ కిషన్ సైతం నేడు బరిలోకి దిగనున్నాడు. బౌలింగ్ లైనప్‌లో హర్షిత్ రాణాను పేసర్ లేదా ఆల్‌రౌండర్‌గా తీసుకోవాలనే ఉత్సుకత ఎక్కువగా ఉండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త బంతితో జశ్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఎటాక్ చేయనుండగా.. వరుణ్ చక్రవర్తితో కలిసి అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్‌లు మాయాజాలం చేయనున్నారు.
విజయంతో ముగించాలని..
1-3తో సిరీస్‌పై ఆశలు ఆవిరి చేసుకున్న న్యూజిలాండ్ సిరీస్‌ను గౌరవప్రదంగా ముగించాలని భావిస్తోంది. మార్క్‌చాప్‌మన్, డెవాన్ కాన్వే సహా గ్లెన్ ఫిలిప్స్, డార్లీ మిచెల్‌లు న్యూజిలాండ్ బ్యాటింగ్ భారం మోస్తున్నారు. కివీస్ బ్యాటర్లు నిలకడగా రాణించినా.. వేగంగా పరుగులు చేయటంలో వెనుకంజలో నిలిచారు. నిలకడతో పాటు ఇన్నింగ్స్‌కు వేగం జోడిస్తే న్యూజిలాండ్ నేటి మ్యాచ్‌తో పాటు ప్రపంచకప్‌లోనూ ప్రత్యర్థులకు సవాల్ విసరగలదు. జాకబ్ డఫ్ఫీ, ఇశ్ సోధి, మిచెల్ శాంట్నర్‌లు గత మ్యాచ్ తరహాలో రాణిస్తే.. భారత బ్యాటర్లను కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుంది. సిరీస్‌లో 4 మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగటంతో కనీసం ఆఖరు మ్యాచ్‌లోనైనా ఇరు జట్లు అమీతుమీ తేల్చుకుంటాయేమో చూడాలి.
పిచ్, వాతావరణం
తిరువనంతపురంలో భారత్‌కు మంచి రికార్డుంది. ఇక్కడ ఆడిన 4 మ్యాచ్‌ల్లో భారత్ 3 టీ20ల్లో విజయాలు సాధించింది. 2017లో ఇక్కడ ఓ మ్యాచ్ ఆడిన న్యూజిలాండ్.. ఓటమి చవిచూసింది. ఈ గ్రౌండ్‌లో అత్యధిక స్కోరు 235 కాగా, అత్యల్ప స్కోరు 61. పిచ్ నుంచి బౌలర్లకు చక్కటి సహకారం ఉంటుంది. బ్యాట్‌పైకి బంతి రావటంతో బ్యాటర్లకు పరుగుల వేట సులభతరం అవుతుంది. మంచు ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు!. అయినా, టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. నేడు టీ20 మ్యాచ్ సమయంలో ఎటువంటి వర్షం సూచనలు లేవని సమాచారం.
తుది జట్లు (అంచనా)
భారత్ : అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, రింకు సింగ్, శివం దూబె, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జశ్‌ప్రీత్ బుమ్రా, కుల్‌దీప్ యాదవ్.
న్యూజిలాండ్ : డెవాన్ కాన్వే, టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్‌చాప్‌మన్, డార్లీ మిచెల్, జాక్ ఫౌల్క్స్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), మాట్ హెన్రీ, ఇశ్ సోధి, జాకబ్ డఫ్ఫీ.



