మాజీ సర్పంచులకు అండగా కాంగ్రెస్
తన స్వంత ఖర్చులతో మెరుగైన వైద్యం అందిస్తానని భరోసా
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
నవతెలంగాణ – కరీంనగర్
తెలంగాణలో మాజీ సర్పంచుల పరిస్థితికి కారణమైన బాధ్యత పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవిని పరామర్శించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, తన స్వంత ఖర్చులతో మెరుగైన వైద్యం అందిస్తానని భరోసా ఇచ్చారు. లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తాళ్ల విజయలక్ష్మి భర్త రవి ఆత్మ హత్యయత్నానికి పాల్పడిన ఘటనపై స్పందించిన ఆయన, “ఈ ఘటన బాధాకరం. అభివృద్ధి పనులు చేయాలనే ఉద్దేశంతో అప్పులు చేసి ముందుకు వచ్చిన సర్పంచులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకోవాల్సిన సమయంలో ఒత్తిళ్లు గురిచేసిందని పేర్కొన్నారు. ఇది క్షమించలేని నేరం అన్నారు.బిల్లులు చెల్లించక ప్రజా ప్రతినిధులను ఆర్థికంగా అస్తవ్యస్తులుగా మార్చినప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన తీవ్రంగా ఎద్దేవా చేశారు.
అలాగే రవి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు.గ్రామాల్లో అప్పట్లో జరిగిన అభివృద్ధి పనుల బిల్లులు ఇంకా చెల్లించకపోవడం వల్ల ఎంతో మంది సర్పంచులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారని తెలిపారు. కేసీఆర్ చేసిన పాపాన్ని మసిపూసి మారేడు కాయ చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకుల అబద్ధపు ప్రచారమే అంటూ విమర్శించారు.
చొప్పదండి నియోజకవర్గంలోని మాజీ సర్పంచులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. ఇది కాంగ్రెస్ హయాంలో మాత్రమే సాధ్యం అవుతోంది అని పేర్కొన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ అధ్యక్షుడు ముత్యం శంకర్, గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, చొప్పదండి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి తదితర నాయకులు ఉన్నారు.