Monday, October 13, 2025
E-PAPER
Homeజాతీయంఆ 52 స్థానాలే కీలకం

ఆ 52 స్థానాలే కీలకం

- Advertisement -

గత బీహార్‌ ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన పోటీ
పాట్నా : బీహార్‌ శాసనసభలో 243 స్థానాలు ఉండగా వాటిలో 52 స్థానాలపై మాత్రమే ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. 2000వ సంవత్సరంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈ స్థానాల్లో విజేతలకు వచ్చిన మెజారిటీ ఐదు వేల ఓట్లకు లోపే ఉండడం గమనార్హం. అంటే ఈ స్థానాల్లో హోరాహోరీ పోరు జరిగిందన్న మాట. గత ఎన్నికల్లో 75 స్థానాలు గెలుచుకొని ఆర్జేడీ అతి పెద్ద పార్టీగా అవతరించగా 74 స్థానాలతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. మొత్తంమీద ఎన్డీఏకు 125, మహాగట్‌బంధన్‌కు 1110 స్థానాలు వచ్చాయి. తీవ్ర పోటీ జరిగిన స్థానాల్లో పదిహేను సీట్లను లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ గెలుచుకోగా కాంగ్రెస్‌ తొమ్మిదింటిలో విజయం సాధించింది. మహాగట్‌బంధన్‌లోని ఇతర పార్టీలైన సీపీఐ, సీపీఐ (ఎం), సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ ఒక్కో స్థానాన్ని గెలుచుకున్నాయి.

తీవ్ర పోటీ జరిగిన నియోజకవర్గాల్లో 16 సీట్లలో ఆర్జేడీ, ఏడింటిలో కాంగ్రెస్‌, రెండింటిలో సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌, ఒక స్థానంలో సీపీఐ రెండో స్థానంలో నిలిచాయి. ఇక ఎన్డీఏ పక్షంలో చూస్తే… హోరాహోరీ పోరు సాగిన 52 స్థానాల్లో నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ 13, బీజేపీ 9 సీట్లు గెలుచుకున్నాయి. ఇతర భాగస్వామ్య పక్షాలైన వీఐపీ, హిందుస్థాన్‌ ఆవామ్‌ మోర్చ (సెక్యులర్‌) ఒక్కో స్థానంలో విజయం సాధించాయి. జేడీయూ 13, బీజేపీ 10, వీఐపీ 2 సీట్లలో రెండో స్థానంలో నిలిచాయి. గత ఎన్నికల సమయంలో ఎన్డీఏలో ఉన్న ముకేష్‌ సహానీ నేతృత్వంలోని వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ (వీఐపీ) ఇప్పుడు మహాగట్‌బంధన్‌లో ఉంది. అప్పుడు అవిభక్త లోక్‌ జనశక్తి పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఒకే ఒక స్థానంలో సరిపెట్టుకుంది. హిల్సాలో జేడీయూ పార్టీ 12 ఓట్ల అత్యల్ప మెజారిటీతో గట్టెక్కింది. అదే పార్టీ బార్బిఘాలో 133 ఓట్ల మెజారిటీ మాత్రమే పొందింది. రామ్‌ఘర్‌లో ఆర్జేడీకి 189 ఓట్ల మెజారిటీ దక్కింది. వెయ్యి లోపు మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థులు ఏడుగురు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -