ఆర్టీఐ నాయకులు వెంకటేశ్వర్లు గౌడ్, కుమార్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పొనగండ్ల గ్రామంలో 8 ఏళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడిన శ్రీకాంత్,గణేష్ అనే నిందితులను కఠినంగా శిక్షించాలని యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్ వెంకటేశ్వర్లు గౌడ్, కాటారం సబ్ డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన అవి ఆచరణకు నోచుకోవడం లేదన్నారు.
చిన్నారి అత్యాచార ఘటన తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని, అభంశుభం తెలియని చిన్నారిపై ఈ ఘటన జరగడం అత్యంత హేయమైన చర్యన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిందితులకు చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని,పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు. కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించి త్వరితగతిన న్యాయం చేయాలన్నారు. బాధిత చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉండాలని కోరారు.



