మోడీ ప్రభుత్వం మహిళలకు చీకటి రోజులు తెచ్చింది
26న దేశవ్యాప్త నిరసనలు
రాష్ట్రంలో నేడు, రేపు నిరసన కార్యక్రమాలు
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నాలుగు లేబర్ కోడ్‌లను నోటిఫై చేస్తూ…అన్ని రాష్ట్రాలు తక్షణం వాటిని అమల్లోకి తీసుకురావాలని కేంద్రం ప్రకటించటం శ్రామికులకు, కార్మికులకు మరణ శాసనంలాంటిదని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఆ సంఘం కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి నాగయ్య, ఆర్ వెంకట్రాములుతో కలిసి వెంకట్ విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయ కూలీలకు ఇది చీకటి రోజని ఆందోళన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగంలో ఎక్కువ మంది మహిళలుంటారని గుర్తు చేశారు. ఆనందంగా కార్తీక మాసాన్ని ముగించుకున్న మహిళలకు మోడీ ప్రభుత్వం చీకటి రోజులు మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మిక, ప్రజావ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఈ నెల 26న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. లేబర్ కోడ్‌లోని ఒకటి రెండు మంచి అంశాలనే హైలెట్ చేసి మీడియా ప్రచారం చేస్తున్నదనీ, కార్మికులకు నష్టం తీసుకొచ్చే 90శాతం అంశాలను తద్వారా కార్మికులకు జరుగుతున్న వినాశనాన్ని వెలుగులోకి రాకుండా కప్పిపెడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్లుగా పోరాటాలు నిర్వహించి, త్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాల అంత్ణసారాన్ని నాలుగు లేబర్‌కోడ్‌లుగా తీసుకొచ్చి, కార్పొరేట్లకు, భూస్వాములకు ఊడిగం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత ముందుకు పోతున్నదని విమర్శించారు. ఉత్పత్తి, పరిస్థితుల్లో మార్పులొచ్చినప్పుడు అందుకనుగుణంగా చట్టాలను సానుకూలంగా మార్చాలని చెప్పారు. మోడీ చెప్పినట్టు కార్మికులు పండుగ చేసుకునేటట్టు చట్టాలు లేవని తెలిపారు. అవి యజమానులకు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. మరీ ముఖ్యంగా వ్యవసాయ కార్మికులకు వినాశనకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు నిర్ణయించే అంశాన్ని యాజమాన్యాలకు వదిలేయటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
యూనియన్ పెట్టుకునే హక్కుకు ఆటంకాలు కల్పించే విధంగా కోడ్‌లో మార్పు చేశారని తెలిపారు. వలస కార్మికులను గుర్తించేందుకు సంఖ్యను పెంచి.. అంతా మంచి చేస్తున్నామంటూ బిల్డప్ ఇవ్వటం మానుకోవాలని హెచ్చరించారు. పని గంటలను యాజమాన్యాలు ఇష్టానుసారంగా పెంచుకునేందుకు అందులో అవకాశం కల్పించలేదా? అని ప్రశ్నించారు. అదనపు గంటలు పని చేసి అదనపు వేతనం పొందొచ్చని చెప్పే కాకమ్మ కబుర్లు మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. చట్టాల పేరుతో పనిగంటలు పెంచి, కొత్త తరహా బానిస వ్యవస్థను తీసుకొస్తున్నారని విమర్శించారు. ఈ నాలుగు కోడ్‌లు వెట్టిచేసే బానిసలుగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గిగ్, ప్లాట్‌ఫారమ్ వర్కర్లకు కనీస టైం బౌండ్ ఉండాలని చెప్పటమంటేనే ఆ కోడ్‌లు కార్మికులకు ఎట్లాంటి ప్రయోజనం చేకూరుస్తాయో అర్థం చేసుకోవచ్చన్నారు.
సంఘటిత, అసంఘటిత కార్మికులకే ఇవి వినాశనంగా ఉంటే..అసలు వ్యవసాయ కార్మికులకు ఎలాంటి హక్కులుండబోవని తెలిపారు. వారు చేస్తున్న పనులన్నీ, వంగి చేసే పనులు కాబట్టి అనారోగ్యాలకు గురవుతు న్నారని ఆందోళన జరగుతుంటే..ఎక్కువ గంటలు పనిచేయాలని చెప్పటం ఎలాంటి నీతో చెప్పాలని నిలదీశారు. ఇందులో మహిళలకు రక్షణ లేదని అన్నారు. ప్రభుత్వానికి ఏ మాత్రం సామాజిక దృక్పథం ఉన్నా..కనీస వేతనం రూ.24వేలు నిర్ణయించి, వాటిని అమలు చేసేందుకు చట్టాలు చేసి నిరూపించుకోవాలని కోరారు. ఇప్పటికే దేశంలో సామాజిక వివక్ష విలయతాండవం చేస్తున్నదని తెలిపారు. అసంఘటిత రంగంలో పనిచేసే వారంతా దళితులు, గిరిజనులు, బీసీలు, ఎంబీసీలేనని చెప్పారు.
వ్యవసాయ కార్మికుల్లో 49శాతం దళితులు, మరికొన్ని రాష్ట్రాల్లో 70శాతం దళితులు, గిరిజనులు ఎంబీసీలున్నారని తెలిపారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని చట్టం చేస్తే..సామాజిక భద్రతకు అర్థం ఉంటుందన్నారు. ప్రభుత్వం ఎన్నిమాటలు చెబుతున్నప్పటికీ కార్పొరేట్లు, ధనికులకు, నూతనంగా అభివృద్ధి అవుతున్న కార్పొరేట్ వ్యవసాయ శక్తులకు ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. ఉపాధి పనికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నందున ఆది, సోమవారాల్లో దేశవ్యాప్తంగా ఉపాధిహామీ పని ప్రదేశాల్లో నాలుగు లేబర్‌కోడ్‌లను దహనం చేయాలని పిలుపునిచ్చారు. దీని కి కొనసాగింపుగా 26న జరిగే ఆందోళనలో భాగస్వాములు కావాలని కోరారు.
లేబర్ కోడ్‌ల బిల్లులు దహనం చేయాలి..
కార్మికులకు, కూలీలకు నష్టం తీసుకొచ్చే నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు పోరాటాలకు సన్నద్ధం కావాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు పిలుపునిచ్చారు. ఆది, సోమవారాల్లో లేబర్ కోడ్‌ల ప్రతులను దహనం చేయాలని కోరారు. ఇప్పటికే అనేక పోరాటాలు నిర్వహించామనీ, అయినా ప్రభుత్వం ప్రజల పట్ల మొండిగా వ్యవహరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు వినాశనకరంగా ఉన్న లేబర్ కోడ్‌లను పోరాటాలతోనే సమాధానం చెప్పాలన్నారు.



