అమెరికా-ఇరాన్ చర్చల్లో ఇవే ప్రధానం
పరిష్కారం కోసం తర్జన భర్జన
శాంతి చర్చలపై సర్వత్రా ఉత్కంఠ
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కేంద్రంగా జరుగుతోన్న అమెరికా-ఇరాన్ మధ్య కీలక చర్చలకు ఐదు అంశాలు కీలకంగా మారాయి. ఇందులో లెబనాన్ పరిస్థితి, హార్ముజ్ జలసంధి, అణు కార్యక్రమం, ఇరాన్ ప్రాంతీయ మిత్రులు, ఆంక్షల సడలింపులు వంటివి ఉన్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు ఇప్పటికే చర్చలకు పెద్ద అడ్డంకిగా మారాయి. ఎట్టకేలకు ఇరు దేశాల బృందాలు శాంతి చర్చలకు కోసం ఇస్లామాబాద్‌కు చేరుకున్నాయి. అయితే ఈ ఐదు సమస్యలకు పరిష్కారం లభించి, ఇరు దేశాల మధ్య యుద్ధం ముగింపునకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
లెబనాన్ అంశం
తన మిత్ర దేశం లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాల్పుల విరమణ వేళ ఇజ్రాయిల్ దాడులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీంతో లెబనాన్‌లోని సాయుధ గ్రూపు హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న దాడులు చర్చలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ విషయంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఇప్పటికే గట్టి హెచ్చరికలు పంపారు. లెబనాన్‌పై ఈ దాడులు కొనసాగితే చర్చలు అర్థహీనమవుతాయని చెప్పారు. అయితే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం హిజ్బుల్లాపై చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
హార్ముజ్ జలసంధి
హార్ముజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు మార్గం. అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల యుద్ధ విరమణ తర్వాత కూడా చాలా తక్కువ నౌకలు మాత్రమే ఈ మార్గం గుండా వెళ్తున్నాయి. వందల నౌకలు, వేల సిబ్బంది గల్ఫ్‌లో చిక్కుకున్నాయి. దీంతో ఇది ప్రపంచ ఇంధన కొరతకు దారి తీసింది. ఇరాన్ ఈ జలసంధిని తమ సార్వభౌమ ప్రాంతంగా ప్రకటిస్తూ కొత్త నియమాలు తీసుకురావాలని చూస్తోంది. కొన్ని నౌకల నుంచి రెండు మిలియన్ డాలర్ల వరకు ఫీజులు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు.
అణు కార్యక్రమం
ఇది అత్యంత ప్రధాన వివాదాస్పద అంశం. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకూడదన్నది అమెరికా డిమాండ్. తమకు శాంతియుత ప్రయోజనాల కోసం యురేనియం శుద్ధి హక్కు ఉందన్నది ఇరాన్ వాదన. ఇరాన్ ప్రతిపాదనలో ఈ హక్కుకు అంతర్జాతీయ గుర్తింపు కోరింది. అమెరికా మాత్రం యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయాలని కోరుతోంది.
ఇరాన్ ప్రాంతీయ మిత్రులు
ఇరాన్‌కు ప్రాంతీయంగా ఉన్న మిత్రబలగాలు ఎంతో కీలకమైనవి. ఇందులో లెబనాన్‌లో హిజ్బుల్లా, యెమెన్‌లో హౌతీలు, గాజాలో హమాస్, ఇరాక్‌లో మిలీషియా గ్రూపులు ఉన్నాయి. అయితే ఇజ్రాయిల్ మాత్రం వీటిని భారీ ముప్పుగా చూస్తోంది. వాటిపై చర్యలకు దిగుతోంది. దీంతో ఈ అంశం కూడా చర్చల్లో కీలకంగా మారింది.
ఆంక్షల సడలింపు
ఇరాన్‌పై దశాబ్దాలుగా కఠిన ఆంక్షలు ఉన్నాయి. అన్ని అమెరికా, అంతర్జాతీయ ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. సుమారు 120 బిలియన్ డాలర్ల ఫ్రీజ్ చేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని అంటోంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఖలీబాఫ్ ఈ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. అయితే అమెరికా మాత్రం ఈ విషయంలో సానుకూలంగా లేదని సమాచారం.



