Saturday, January 3, 2026
E-PAPER
Homeజాతీయంఆ లెక్కలు నమ్మలేం!

ఆ లెక్కలు నమ్మలేం!

- Advertisement -

– భారత ఆర్థిక గణాంకాలపై ఐఎంఎఫ్‌ అనుమానాలు
– జీడీపీ, ప్రభుత్వ ఖాతాల డేటాకు ‘సీ గ్రేడ్‌’
– ఎన్‌బీఎఫ్‌సీలతో భవిష్యత్‌లో ప్రమాదాలు
– తయారీరంగం వెనుకబడింది.. కార్మికుల మార్పు అవసరం
– అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నివేదికలో వెల్లడి

భారత ఆర్థిక గణాంకాల నాణ్యతపై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) తీవ్ర సందేహాలు వ్యక్తం చేసింది. డేటాలో లోపాలను ప్రస్తావించింది. ఈ విషయంలో భారత్‌కు ‘సీ గ్రేడ్‌’ను ఇచ్చింది. ఈ విషయాలు ఐఎంఎఫ్‌ రూపొందించిన ఓ నివేదికలో వెల్లడయ్యాయి. ప్రపంచంలో భారత్‌ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందనీ, జీడీపీ వృద్ధి గణనీయంగా పెరుగుతున్నదని పలు సందర్భాల్లో మోడీ ప్రభుత్వం తీవ్ర ప్రచారాన్నే కల్పించుకున్నది. ‘విశ్వగురు’గా తయారవుతున్నామంటూ ప్రభుత్వం తన గణాంకాలతో సమర్థించుకున్నది. అయితే ఐఎంఎఫ్‌ తాజా నివేదికతో భారత ఆర్థిక గణాంకాల్లోని డొల్లతనం, విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారాయని ఆర్థికరంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

న్యూఢిల్లీ : అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఆర్టికల్‌-4 సంప్రదింపుల నివేదిక- 2025లో భారత ఆర్థిక వ్యవస్థను నాలుగు రంగాల్లో సమీక్షించింది. అందులో ఆర్థిక విధానం, ద్రవ్య విధానం, ఆర్థిక రంగం, నిర్మాణాత్మక సంస్కరణలు వంటివి ఉన్నాయి. అయితే భారత జాతీయ ఖాతాలు, ప్రభుత్వ ఆర్థిక గణాంకాలకు మాత్రం ఐఎంఎఫ్‌ ‘సీ గ్రేడ్‌’ను కేటాయించింది. భారత గణాంకాలపై ఐఎంఎఫ్‌ సందేహాలు వ్యక్తం చేసింది. ఆర్థిక గణాంకాలు పూర్తిగా లేకపోవడం, ప్రజలకు పారదర్శకంగా అందుబాటులో లేకపోవడం వంటి అంశాలను ఐఎంఎఫ్‌ ప్రస్తావించింది. ప్రొఫెసర్‌ అరుణ్‌ కుమార్‌ వంటి పలువురు ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్తలు ఇదే అంశంపై ఎన్నో ఏండ్ల నుంచి హెచ్చరిస్తుండటం, ఇప్పుడు ఐఎంఎఫ్‌ కూడా దీనిని ఎత్తి చూపటం గమనార్హం. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, కరోనా లాక్‌డౌన్‌ వంటి సందర్భాల్లో దేశంలో అసంఘటిత రంగం తీవ్రంగా నష్టపోయినా, దాని వాస్తవ పరిస్థితి జీడీపీ లెక్కల్లో సరిగ్గా ప్రతిబింబించటం లేదనేది ప్రధాన అంశం.

‘విశ్వగురు’… ప్రచారమే!
కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ఐఎంఎఫ్‌ నివేదిక ఇబ్బందికరంగా మారింది. ఇది ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లోని లోపాలను ఎత్తి చూపడంతో విపక్షాలకు ఆయుధం ఇచ్చినట్టైందని కేంద్రం భావిస్తోంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న నివేదికలను ‘విశ్వగురు’ ప్రతిష్టకు సాక్ష్యంగా ప్రచారం చేసే బీజేపీ సర్కారు, అంతర్జాతీయ సంస్థలైన ఐఎంఎఫ్‌ వంటి సంస్థల ప్రతికూల నివేదికలు, వ్యాఖ్యలను కుట్రగా కొట్టిపారేస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ‘సీ గ్రేడ్‌’ రేటింగ్‌ అంశం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఐఎంఎఫ్‌ సూచనలు
ప్రభుత్వ ఆదాయ-వ్యయ నిర్వహణపై ఐఎంఎఫ్‌ కొన్ని సూచనలు చేసింది. అప్పులు నియంత్రణలో ఉంచాలనీ, పన్ను వసూళ్ల సామర్థ్యం పెంచాలనీ, పెట్టుబడులు, సామాజిక రంగాలపై ఖర్చు పెంచాలని వివరించింది. భారత్‌పై అమెరికా విధించిన అధిక సుంకాల వల్ల వృద్ధి మందగిస్తే, కఠిన ఆర్థిక క్రమశిక్షణను తాత్కాలికంగా నిలిపివేసి, ‘తటస్థ ఆర్థిక విధానం’ పాటించాలని ఐఎంఎఫ్‌ సూచించింది.

ఎన్‌బీఎఫ్‌సీలపై హెచ్చరికలు
దేశంలో ఆర్థిక రంగం, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)లపై ఐఎంఎఫ్‌ హెచ్చరించింది. ఏమాత్రం రక్షణ లేని వ్యక్తిగత రుణాలు, ఎన్‌బీఎఫ్‌సీల విస్తరణపై ఆందోళన వ్యక్తం చేసింది. విద్యుత్‌ రంగంపై ఆధారపడిన పెద్ద ఎన్‌బీఎఫ్‌సీల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని పేర్కొంది. ప్రయివేటు, ప్రభుత్వ ఎన్‌బీఎఫ్‌సీలకు సమాన నియంత్రణలు, కఠిన లిక్విడిటీ నిబంధనలు అవసరమని సూచించింది.

తయారీరంగం పెరగలేదు
భారత ఉత్పాదకత ప్రధానంగా సేవారంగం వల్లే పెరిగిందనీ, తయారీ రంగం మాత్రం వెనుకబడి ఉన్నదని ఐఎంఎఫ్‌ పేర్కొన్నది. వ్యవసాయ రంగం నుంచి తయారీ, సేవారంగాలకు కార్మికుల మార్పు అవసరమని అభిప్రాయపడింది. భారతదేశం పరిశోధన, అభివృద్ధిపై చాలా తక్కువ ఖర్చు చేస్తున్నదని తెలిపింది. విశ్వవిద్యాలయ-పరిశ్రమ సహకారం బలోపేతం కావాలని నివేదికలో పేర్కొన్నారు. తయారీరంగ విస్తరణకు భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారిందన్న ఐఎంఎఫ్‌, భూ రికార్డుల ఆధునీకరణ, త్వరిత అనుమతులు అవసరమని సూచించింది. దివాళా చట్టం మెరుగుపడినప్పటికీ, కేసుల ఆలస్యం పెద్ద సమస్యగా ఉన్నదనీ, న్యాయవ్యవస్థ సామర్థ్యం పెంచాలని సూచించింది.
ఐఎంఎఫ్‌ నివేదికలోని అంశాలపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. పాత ఆర్థిక నమూనాను ప్రోత్సహిస్తున్నదనీ, మూడు దశాబ్దాలుగా అమలులో ఉన్న ఈ విధానాలు దేశంలో ఉద్యోగాలు సృష్టించడంలో విఫలమయ్యాయనీ, అసమానతలు పెరిగాయని తెలిపారు. సార్వత్రిక విద్య, ఆరోగ్యం, పెన్షన్లు, కార్మిక హక్కులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. పరోక్ష పన్నులతో దేశంలో సామాన్యులపై పెను భారం పడుతున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నివేదిక కేంద్ర ప్రభుత్వ పెట్టుబడిదారీ, కార్పొరేట్‌ అనుకూల ఆర్థిక విధానాలు వైఫల్యాల్ని ఎత్తిచూపుతున్నదని అభిప్రాయపడుతున్నారు.

నివేదిక ప్రభావమెంత?
ఐఎంఎఫ్‌ ఆర్టికల్‌-4 వంటి నివేదికలు సాంకేతిక సమీక్షలు మాత్రమే కాకుండా, ప్రపంచ ఆర్థిక విధానాలపై ప్రభావం చూపే ‘జ్ఞాన ఉత్పత్తులు’ అని పెట్టుబడిదారీవర్గాలు భావిస్తుంటాయి. జీడీపీ వృద్ధి, ఆర్థిక క్రమశిక్షణ, ద్రవ్యోల్బణ నియంత్రణ, మార్కెట్‌ ఆధారిత సంస్కరణలను ఇవి సమీక్షిస్తాయి. ఆయా రంగాలపై ఐఎంఎఫ్‌ ‘ముద్ర’ పడితే పెట్టుబడిదారులకు విశ్వాసం పెరుగుతుంది. విమర్శలు వస్తే ప్రభుత్వాలపై విధాన మార్పులకు ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల పెట్టుబడులు రాకపోవడం, వచ్చిన పెట్టుబడులు వెనక్కి పోయే ప్రమాదం కూడా ఉన్నదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -