Monday, February 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంచిన్నారి మృతికి కారకుల్ని కఠినంగా శిక్షించాలి

చిన్నారి మృతికి కారకుల్ని కఠినంగా శిక్షించాలి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
నాగర్‌ కర్నూల్‌ జిల్లా కుమ్మెర జాతరలో దర్శనానికి వెళ్లిన రెండేండ్ల దళిత చిన్నారి అనుమానాస్పద మృతి చెందడం అత్యంత విషాదకరమని సీపీఐ(ఎం) పేర్కొంది. చిన్నారి మృతి పట్ల సంతాపం, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపింది. ఈమేరకు ఆదివారం ఇదే అంశంపై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెంటనే ఈ ఘటనపై స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కుమ్మెర కొండపై ఉన్న ఆలయాన్ని కొందరు పెత్తందారులు తమ గుప్పిట్లో ఉంచుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతూ, ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. దాన్ని ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.

ఈఘటనలో చిన్నారి తల్లి కీర్తి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకుండా, దాడికి పాల్పడిన పెత్తందారులు ఇచ్చిన ఫిర్యాదునే ముందుగా పరిగణనలోకి తీసుకున్నారని తెలిపారు. చివరకు ప్రజాసంఘాల పోరాటం తర్వాత పెత్తందార్లపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత, సామాజిక న్యాయం ప్రశ్నార్థకంగా మారిందనడానికి ఈ ఘటనే నిదర్శనమని గుర్తు చేశారు. బాధితుల ఫిర్యాదును నిర్లక్ష్యం చేసిన ఎస్‌ఐ, ఇతర సిబ్బందిపై విచారణ జరిపి వారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. నిందితుల నుంచి బాధిత కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చిన్నారి మృతికి కారణమైన దోషులను వెంటనే అరెస్టు చేసి, హత్య కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -