ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపట్టిన అమెరికా అప్పీళ్ల కోర్టు
సుప్రీంలో సవాలు చేయనున్న ప్రభుత్వం
వాషింగ్టన్ డీసీ : వాణిజ్య భాగస్వామ్య దేశాలపై దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలలో చాలా వరకూ చట్టవిరుద్ధమైనవేనని అమెరికా అప్పీళ్ల కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. ట్రంప్ అనుసరిస్తున్న విదేశాంగ విధాన అజెండాను న్యాయస్థానం తప్పు పట్టింది. ప్రపంచంలోని పలు దేశాలపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలకు, అదే విధంగా చైనా, మెక్సికో, కెనడా దేశాలపై విధించిన ఇతర సుంకాలకు ఈ తీర్పుతో అడ్డుకట్ట పడింది. అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ప్రపంచ దేశాలపై సుంకాలు విధించే అధికారం తనకు దఖలు పడిందంటూ ట్రంప్ చేసిన వాదనను 7-4 మెజారిటీతో కోర్టు తోసిపుచ్చింది. అయితే సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడానికి వీలుగా తీర్పు అమలును అక్టోబర్ 14వ తేదీ వరకూ వాయిదా వేసింది.
మండిపడిన ట్రంప్
అప్పీళ్ల కోర్టు నిర్ణయాన్ని ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో విమర్శించారు. దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని తెలిపారు. కోర్టు నిర్ణయం అమెరికాను నాశనం చేస్తుందని మండిపడ్డారు. ‘సుంకాలను ఎత్తివేయాలని ఈ రోజు అత్యంత పక్షపాతపూరితమైన అప్పీ ళ్ల కోర్టు తప్పుడు తీర్పు చెప్పింది. కానీ చివరికి అమెరికాయే విజయం సాధిస్తుందని వారికి తెలుసు’ అని అన్నారు. సుంకాలను తొలగిస్తే దేశానికి పెను విపత్తు సంభవిస్తుం దని, మనల్ని ఆర్థికంగా బలహీనుల్ని చేస్తుందని అంటూ మనం బలంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద సు ంకాలు విధించడాన్ని ఆయన సమర్ధించుకున్నారు. అసాధా రణమైన ముప్పు ఎదురైనప్పుడు అవసరమైన చర్యలు తీసుకునే అధికారాన్ని ఈ చట్టం దేశాధ్యక్షుడికి కట్టబెట్టింది.
కోర్టు ఏం చెప్పిందంటే…
గతంలో వాణిజ్యంపై అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ట్రంప్… దేశ భద్రతకు వాణిజ్య అసమానతలు ప్రమాదకరమని వాదించారు. అయితే ఈ వాదనను కోర్టు తిరస్కరించింది. అధ్యక్షుడికి దఖలు పడిన అధికారాల పరిధిలో సుంకాల విధింపు లేదని, వాటిని నిర్ణయించే అధికారం కాంగ్రెస్‌దేనని స్పష్టం చేసింది. చట్టానికి విరుద్ధంగా ఉన్న సుంకాలు చెల్లుబాటు కావని తేల్చి చెప్పింది. ‘ఈ చట్టంలో సుంకాల ప్రస్తావన లేదు. సుంకాలను విధించేందుకు అధ్యక్షుడికి ఉన్న అధికారాల పరిమితులను నిర్దేశించే విధానపరమైన రక్షణ చర్యలూ లేవు’ అని 127 పేజీల రూలింగులో కోర్టు తెలిపింది. సుంకాలు, పన్నులు విధించే అధికారం కాంగ్రెస్‌కే ఉంటుంద ని, దీనిని చట్టం తోసిపుచ్చలేదని పేర్కొంది. గతంలో సుంకాలు విధించేందుకు అధ్యక్షుడికి అపరిమితమైన అధికా రాలు ఉండేవని, ఆ విధానానికి స్వస్తి చెప్పేందుకే 1977లో కాంగ్రెస్ ఓ చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేసింది.
న్యూయార్క్ కోర్టూ ఇదే చెప్పింది
కొన్ని చిన్న వ్యాపార సంస్థలు దాఖలు చేసిన రెండు వ్యాజ్యాలను పురస్కరించుకొని న్యాయస్థానం ఈ రూలింగ్ ఇచ్చింది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల పైన పది శాతం బేస్‌లైన్ టారిఫ్ విధిస్తూ ఏప్రిల్‌లో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆదేశం జారీ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా కొన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు కూడా విధించారు. వీటిని సవాలు చేస్తూ వ్యాపార సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. సుంకాలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన న్యూయార్క్ న్యాయస్థానం మేలోనే ప్రకటించింది. ప్రభుత్వం అప్పీలు చేయడంతో దీని అమలును నిలిపివేశారు. కాగా ఔషధాల దిగుమతులను నిలువరించేందుకు కెనడా, మెక్సికో, చైనాపై విధించిన సుంకాలను కూడా న్యాయస్థానం కొట్టివేసింది. అయితే ఉక్కు, అల్యూమినియంపై విధించిన ఇతర సుంకాలకు ఈ తీర్పు వర్తించదు.
సుప్రీంకోర్టుకు చేరనున్న కేసు
తగ్గించిన టారిఫ్ రేట్లకు అంగీకరిస్తూ కొన్ని దేశాలు ఇప్పటికే అమెరికాతో ఒప్పందాలు చేసుకున్నాయి. తాజా తీర్పుతో ఆ ఒప్పందాల మనుగడపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ తీర్పు నేపథ్యంలో ఇప్పుడు కేసు అమెరికా సుప్రీంకోర్టు ముందుకు వస్తుంది. కాంగ్రెస్ అనుమతి తీసుకోకుండా దేశాధ్యక్షులు నూతన విధానాలను అమలు చేయడానికి ప్రయత్నించడాన్ని ఇటీవల సుప్రీంకోర్టు పలు సందర్భాలలో తప్పు పట్టింది.
ఆ సుంకాలు చట్టవిరుద్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES